Begin typing your search above and press return to search.

జీవీఎంసీ మేయర్ పీఠంపై కూటమి కన్ను?... రంగంలోకి వైవీ!

ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   14 Jun 2024 8:05 AM GMT
జీవీఎంసీ మేయర్  పీఠంపై కూటమి కన్ను?... రంగంలోకి వైవీ!
X

ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 175కీ 164 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. ఈ నేపథ్యంలో ఘోర ఓటమి నుంచి తేరుకున్న జగన్... ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు. ప్రధానంగా... అసెంబ్లీలో బలం లేనప్పటికీ.. మండలిలో వైసీపీకి బలం ఉన్న వేళ ప్రలోభాలకు లొంగవద్దని తమ ఎమ్మెల్సీలకు సూచించారు.

దీంతో... 2014 ఎన్నికల ఫలితాల అనంతరం పార్టీ మారిన 23 మంది ఎమ్మెల్యేల విషయం మరోసారి చర్చకు వచ్చింది. ఆ సంగతి అలా ఉంటే... తాజాగా మరో విషయంలో వైసీపీ అధినాయకత్వంలో ఆందోళన మొదలైందనే చర్చ మొదలైంది. ఇందులో భాగంగా జీవీఎంసీ మేయర్ పీఠాన్ని కాపాడుకునే విషయంపై దృష్టి సారించినట్లు చెబుతున్నారు. తాజాగా ఈ విషయాన్ని సుబ్బారెడ్డి బలపరిచారు!

అవును... 2021 మార్చిలో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మొత్తం 98 డివిజన్ లలోనూ వైసీపీకి అత్యధికంగా 59 డివిజన్ లు దక్కగా.. టీడీపీ 30, జనసేన 3, బీజేపీ, సీపీఐ, సీపీఎం ల నుంచి ఒక్కొక్కరు, ఇండిపెండెంట్లుగా నలుగురు కార్పొరేటర్లుగా గెలిచారు.

అయితే... తదనంతర పరిణామాల్లో ముగ్గురు కార్పొరేటర్లు జారిపోగా... వైసీపీ బలం 56కి పడింది. అయినప్పటికీ పీఠం సేఫ్ గా ఉంది ప్రస్తుతానికి! అయితే... ప్రభుత్వం మారిన నేపథ్యంలో పలువురు వైసీపీ కార్పొరేటర్లు కూటమి వైపు చూస్తున్నారనే చర్చ గ్రేటర్ లో మొదలైంది. దీంతో... విశాఖ మేయర్ పీఠంపై కూటమి కన్నేసిందనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైపోయింది.

ఈ సమయంలో వైవీ సుబ్బారెడ్డి రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా తాజాగా తమపార్టీకి చెందిన జీవీఎంసీ కార్పొరేటర్లతో భేటీ అయ్యారు. కార్పొరేటర్లు కొంతమంది కూటమి వైపు వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో... కార్పొరేటర్లంతా కలిసికట్టుగా ఉండాలని.. పీఠాన్ని చేజారనీయకుండా బలంగా నిలబడాలని కోరారు వైవీ సుబ్బారెడ్డి!

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... కార్పొరేషన్లు, స్థానిక సంస్థల్లో ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉందని.. అలాంటి ప్రలోభాలకు ఏమాత్రం లొంగకుండా అంతా కలిసికట్టుగా ఉండాలని.. ఇదే సమయంలో దాడులకు ఏమాత్రం భయపడవద్దని, పార్టీ ఆదుకుంటుందని తెలిపారు! దీంతో... జీవీఎంసీ మేయర్ పీఠంపై ఏపీలో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయనేది ఆసక్తిగా మారింది.