దేశవ్యాప్తంగా చర్చ.. 'జ్ఞానవాపి'పై మళ్లీ అదే సస్పెన్స్.. సుప్రీం తాజా ఆర్డర్ ఇదే!
కాశీ విశ్వనాథుని మందిరానికి సమీపంలో జ్ఞానవాపి
By: Tupaki Desk | 24 July 2023 9:38 AM GMTప్రఖ్యాత శైవ క్షేత్రం కాశీలోని విశ్వనాథుడి ఆలయానికి సమీపంలో ఉన్న జ్ఞానవాపి మసీదు వ్యవహారంపై మళ్లీ అదే సస్పెన్స్ నెలకొంది. ఇక్కడ సోమవారం ఉదయం ప్రారంభించిన సర్వేను నిలిపివేయాలంటూ .. సుప్రీంకోర్టు ఆగమేఘాలపై ఆదేశాలు జారీ చేసింది. దీంతో పరిశీలన, పరిశోధన కోసం వెళ్లిన 1000 మంది పోలీసులు.. 100 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా వెనక్కి వచ్చేశారు. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది.
అసలు ఏం జరిగింది?
కాశీ విశ్వనాథుని మందిరానికి సమీపంలో జ్ఞానవాపి మసీదు ఉంది. ఇక్కడ ముస్లింలు ప్రార్థనలు చేస్తుంటారు. అయితే.. ఈ మసీదు విశ్వనాథుని ఆలయ కాంప్లెక్స్‌లో భాగమేనని.. ఆ మసీదు గోడలపై హిందూ దేవతా మూర్తుల విగ్రహాలు ఉన్నాయని.. తమకు పూజ చేసుకునే అవకాశం కల్పించాలని కొన్నాళ్ల కిందట హిందూ వర్గానికి చెందిన మహిళలు కోర్టును ఆశ్రయించారు. కానీ, ఈ వాదనను మసీదు కమిటీ వ్యతిరేకించింది.
ఈ క్రమంలో స్థానిక కోర్టు వారణాసి జ్ఞానవాపి మసీద్‌లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాతో సర్వే చేయించాలని ఇటీవల ఆదేశించింది. సోమవారం ఉదయం ఈ సర్వే జరగనుందని వారణాసి జిల్లా మెజిస్ట్రేట్(కలెక్టర్) స్పష్టం చేశారు. దీంతో పోలీసుల బృందం ముందుగా లోనికి ప్రవేశించగా.. 40 మంది ఏఎస్‌ఐ అధికారులు, మరో 50 మంది ఐపీఎస్‌లు వెళ్లారు. అయితే.. ఈ సర్వేను నిలుపుదల చేయాలంటూ.. మసీదు కమిటీ సోమవారం ఉదయాన్ని సుప్రీంకోర్టు తలుపు తట్టింది.
దీనిపై అత్యవసర విచారణ జరిగిన సుప్రీం కోర్టు తక్షణం సర్వేను నిలిపివేయాలని మధ్యంతర/ అత్యవసర ఉత్తర్వులు జారీ చేసింది. సర్వే జరగుతున్న సమయంలోనే.. మసీదు నిర్వాహణ కమిటీ వేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టడం, సర్వేను తాత్కాలికంగా ఆపేయాలని ఏఎస్‌ఐను ఆదేశించడం.. దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.
అంతేకాదు.. వాజుఖానాలో శివలింగ ఆకారం బయటపడడం.. అది శివలింగమని హిందూ సంఘాలు, నీటి కొలను నిర్మాణమని మసీదు కమిటీ పరస్పరం వాదించుకుంటున్నాయి. ఈ క్రమంలో స్థానిక కోర్టు సర్వే చేపట్టాలంటూ పురావస్తు శాఖను శుక్రవారం ఆదేశించింది. దీంతో.. సర్వే త్వరగతిన పూర్తి చేసిన ఆగష్టు 4వ తేదీన జిల్లా న్యాయస్థానానికి ఏఎస్‌ఐ తన నివేదికను అందించాల్సి ఉంది. కానీ, ఇప్పుడు సుప్రీం తాజాగా స్టే ఆర్డర్స్ ఇచ్చింది.