Begin typing your search above and press return to search.

‘హెచ్1బీ’కి ఆ సవరణ.. భారత టెక్ రంగానికి స్పీడ్ బ్రేకర్?

ఇప్పుడూ అంతే.. జనవరిలో అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ లోకి మరోసారి అడుగుపెడుతుండగా, మన అమెరికా కలలకు సంకెళ్లు ఎదురవనున్నాయి.

By:  Tupaki Desk   |   15 Dec 2024 1:30 PM GMT
‘హెచ్1బీ’కి ఆ సవరణ.. భారత టెక్ రంగానికి స్పీడ్ బ్రేకర్?
X

అమెరికాకు జలుబు చేస్తే ప్రపంచం తుమ్ముతుంది.. ఇది గతంలోని సామెత. ఇప్పటి కాలానికి వర్తింపజేస్తే.. అమెరికాకు దెబ్బ తగిలితే భారత్ కు నొప్పి పుడుతుంది. కారణం.. గత మూడు దశాబ్దాలుగా ఆ దేశంతో టెక్నాలజీ పరంగా మన యువత పెనవేసుకున్న బంధం. అయితే, అగ్ర రాజ్యంలో ప్రభుత్వాలు మారిన ప్రతిసారీ భారతీయుల్లో కల్లోలమే. ఇప్పుడూ అంతే.. జనవరిలో అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ లోకి మరోసారి అడుగుపెడుతుండగా, మన అమెరికా కలలకు సంకెళ్లు ఎదురవనున్నాయి.

తెంపరి ట్రంప్..

ట్రంప్ అంటే విపరీత వ్యాఖ్యలే కాదు.. వివాదాస్పద నిర్ణయాలు కూడా. అందుకే ఆయన వస్తున్నారంటేనే హడల్. గ్రీన్ కార్డుల రూల్స్ కూడా మార్చాలని చూస్తున్న వేళ అమెరికా వీసాల విషయంలో పలు మార్పులు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. హెచ్ 1బీ వీసా ప్రోగ్రాం సమగ్ర నియంత్రణ సవరణ ప్రతిపాదన వైట్‍ హౌస్ ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ రెగ్యులేటరీ అఫైర్స్ సమీక్షలో ఉంది.

ఇదివరకు హెచ్1బీలను లాటరీలో ఇచ్చేవారు. దీంతో ప్రతి దరఖాస్తుదారుకూ వీసా దొరికే చాన్స్ ఉండేది. కొత్త సంవత్సరం ప్రారంభానికి ముందు అమెరికా మార్పులకు శ్రీకారం చుడుతోంది.

ఏటా గరిష్ఠంగా 85 వేల హెచ్1బీ వీసాలను అందించేవారు. ఇది అమెరికా యజమానులు విదేశీ ఉద్యోగులను తాత్కాలికంగా ప్రత్యేక వృత్తుల్లో నియమించుకునేందుకు అనుమతిస్తుంది. దిగ్గజ టెక్ కంపెనీలైన గూగుల్, అమెజాన్, ఇన్ఫోసిస్, ఐబీఎం వంటివి 2024లో తక్కువ H-1B వీసాలను స్పాన్సర్ చేశాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 3.86 లక్షల హెచ్ 1బీలలో భారతీయులు 72.3% దక్కించుకున్నారు. అయితే, ఈ ఆర్థిక సంవత్సరం ప్రధానంగా టాప్ ఐటీ కంపెనీలకు అందించిన హెచ్-1బీ వీసాల ఆమోదం సంఖ్య 7,299కి తగ్గించారు. 2015లో ఇది 14,792 కావడం గమనార్హం. ట్రంప్ మెుదటి టర్మ్ లో మాదిరిగా నిర్బంధ ఇమ్మిగ్రేషన్ విధానాలను పునరుద్ధరిస్తే హెచ్-1బీ వీసాల తిరస్కరణ రేటు తిరిగి పెరుగుతుందని భావిస్తున్నారు.

2017లో మెుదటి సారి ట్రంప్ అధ్యక్షుడు అయినప్పుడు ఎదురైన పరిస్థితుల దృష్యా తమ విదేశీ విద్యార్థులను యూనివర్సిటీలు అప్రమత్తం చేస్తున్నాయి. విదేశాల్లో ఉన్న విద్యార్థులు ట్రంప్ బాధ్యతలు చేపట్టే సమయానికి భౌతికంగా అమెరికాలో ఉండాలని సూచిస్తున్నాయి.