గుడ్ న్యూస్: హెచ్ 1బీ వీసా రెన్యువల్ అమెరికాలోనే చేసుకోవచ్చు
అమెరికాలో పని చేస్తున్న భారత టెక్ నిపుణులకు సంతోషాన్ని కలిగించే కొత్త నిర్ణయాన్ని తీసుకున్నారు.
By: Tupaki Desk | 30 Nov 2023 4:43 AM GMTవర్కు వీసాలతో అమెరికాకు వచ్చే వీసాదారులకు తీపికబురును చెప్పింది అగ్రరాజ్యం. తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో అత్యధికంగా లాభపడేవారు భారతీయులే కావటం గమనార్హం. అమెరికాలో పని చేస్తున్న భారత టెక్ నిపుణులకు సంతోషాన్ని కలిగించే కొత్త నిర్ణయాన్ని తీసుకున్నారు. డిసెంబరు నుంచి అమల్లోకి వచ్చే ఈ ప్రోగ్రాంను పైలెట్ ప్రోగ్రాంగా షురూ చేయనున్నారు. హెచ్ 1బీ వీసా రెన్యువల్ కోసం భారత దేశానికి తిరిగి రాకుండా.. అమెరికాలోనే ఉండి కూడా రెన్యువల్ చేసుకునే వెసులుబాటును కల్పించనున్నట్లుగా పేర్కొన్నారు.
ఈ కీలక అంశాల్ని వీసా సేవల డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ జూలీ స్టఫ్ వెల్లడించారు. ఈ ప్రోగ్రాంలో భాగంగా తొలుత 20వేల మందికి ఈ విధానంలో రెన్యువల్ చేస్తారు. దీని వల్ల భారతీయులే ఎక్కువగా లబ్థి పొందుతారని చెబుతున్నారు. డిసెంబరు నుంచి మూడు నెలల పాటు అమెరికాలో ఉంటున్న హెచ్ 1బీ వీసాదారులు.. వారి సొంత దేశాలకు వెళ్లకుండానే వీసాల్ని రెన్యువల్ చేసుకోవచ్చు. తొలుత పైలెట్ ప్రోగ్రాంలో భాగంగా 20 వేల మంది వీసాదారులకే ఈ సేవల్ని అందిస్తారు. అనంతరం.. ఈ ప్రోగ్రాంను మరింతగా విస్తరించనున్నట్లుగా జూలీ చెప్పారు.
అయితే.. దీనిపై అధికారిక నోటీసులు జారీ చేయలేదు. మరికొన్ని రోజుల్లో దీనికి సంబంధించిన విధివిధానాల్ని.. అర్హతకు సంబంధించిన అంశాల్ని.. అప్లికేషన్ ఎలా అప్లై చేయాలన్న అంశాల్ని వెల్లడించనున్నారు. ప్రస్తుతం ఈ విధానం కేవలం హెచ్ 1బీ కేటగిరి వర్కు వీసాదారులకే అమలు చేయనున్నారు. ఇప్పటివరకు అమల్లో ఉన్న విధానం ప్రకారం.. తమ హెచ్ 1బీ వీసా రెన్యువల్ స్టాంపింగ్ కోసం అమెరికాను విడిచి.. తమ దేశాలకు వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ.. 2004 తర్వాత నుంచి ఈ విధానంలో మార్పులు చేశారు.
దీంతో.. హెచ్ 1బీ వీసాదారులు తమ వీసాను రెన్యువల్ చేసుకోవటానికి తమ స్వదేశానికి వెళ్లి.. అక్కడ స్లాట్ తీసుకొని.. స్టాంపింగ్ తర్వాతే తిరిగి రావాల్సిన పరిస్థితి. వీసా అపాయింట్ మెంట్లు సకాలంలో దొరకని కారణంగా నెలల తరబడి వెయిట్ చేయాల్సి ఉండేది. ఇప్పుడు అలాంటి ఇబ్బందులు కలుగకుండానే.. అమెరికాలోనే ఉండి రెన్యువల్ పూర్తి చేసేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ విధానంలో అత్యధికంగా భారతీయులే లబ్థి పొందుతారని చెబుతున్నారు. హెచ్ 1బీ వీసాదారులకు ఇంతకు మించిన గుడ్ న్యూస్ ఇంకేం ఉంటుంది?