Begin typing your search above and press return to search.

బ్యాలెట్ లో తూటా.. పాక్ ఎన్నికల్లో 26/11 సూత్రధారి కొడుకు

హఫీజ్‌ సయీద్‌ పాకిస్థాన్ నుంచే ముంబై ఉగ్రదాడులను పర్యవేక్షించాడు. తర్వాత కూడా ఆ దేశంలో స్వేచ్ఛగా తిరిగాడు.

By:  Tupaki Desk   |   26 Dec 2023 6:31 AM GMT
బ్యాలెట్ లో తూటా.. పాక్ ఎన్నికల్లో 26/11 సూత్రధారి కొడుకు
X

భారత దేశ చరిత్రలో అత్యంత ఘోరమైన ఉగ్ర దాడి ఏదంటే 2008 నవంబరు 26న ముంబైపై జరిగిన దాడే.. అంతకుముందు హైదరాబాద్ సహా పలు నగరాల్లో బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నప్పటికీ, ముంబై దాడి అందరినీ భయభ్రాంతులకు గురిచేసింది. ప్రతి భారతీయుడినీ నిలువెల్లా వణికించింది. ఏకంగా 166 మంది ప్రాణాలు బలిగొన్న ఆ దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్. అరేబియా సముద్ర మార్గం ద్వారా చొరబడిన 10 మంది ఉగ్రవాదులు భారత ఆర్థిక రాజధాని ముంబైలో సాగించిన నరమేధానికి యావత్ ప్రపంచం కూడా చలించిపోయింది. బహుశా అమెరికాపై జరిగిన 9/11 దాడుల తర్వాత ప్రపంచ చరిత్రలో ముంబై ఉగ్ర దాడులే అత్యంత భయంకరమైనవి అనడంలో సందేహం లేదు. కాగా, ఈ దాడులకు సూత్రధారి హఫీజ్ సయీద్ ప్రస్తుతం పాకిస్థాన్ జైల్లో ఉన్నాడు.

పాక్ లో పార్టీ పెట్టి..

హఫీజ్‌ సయీద్‌ పాకిస్థాన్ నుంచే ముంబై ఉగ్రదాడులను పర్యవేక్షించాడు. తర్వాత కూడా ఆ దేశంలో స్వేచ్ఛగా తిరిగాడు. పాకిస్థాన్ ఉగ్రవాదులకు స్వర్గధామం అని చెప్పేందుకు సయీద్ ఒక ఉదాహరణ. అతడు అక్కడ ఏకంగా రాజకీయ పార్టీనే స్థాపించాడు. అతి త్వరలో జరగనున్న పాక్ సార్వత్రిక ఎన్నికల్లో అతడి పార్టీ పోటీ కూడా చేయనుంది. ‘ది పాకిస్థాన్‌ మర్కజీ ముస్లిం లీగ్‌’ (పీఎంఎంఎల్‌).. సయీద్ పెట్టిన పార్టీ పేరు. ఇదివరకు భయంకర ఉగ్ర సంస్థ లష్కర్ ఎ తొయిబా తరఫున

మిల్లీ ముస్లిం లీగ్‌ (ఎంఎంఎల్) పార్టీ ఉండేది. దీనిపై 2018లో నిషేధం విధించారు. ఆ పార్టీ మూలాల నుంచే పీఎంఎంఎల్‌ పుట్టుకొచ్చింది. కుర్చీ గుర్తు దక్కిన ఈ పార్టీకి ఖలీద్‌ మసూద్‌ సింధూ అధ్యక్షుడు.

లష్కరేతో లింకు..

లష్కరే ఆనుపానుల నుంచి పుట్టుకొచ్చినప్పటికీ.. తమ పార్టీకి దానితో సంబంధం లేదని మసూద్ చెబుతున్నాడు. అయితే, ఆ పార్టీ తరఫున హఫీజ్‌ తనయుడు తల్హా సయీద్‌ ఎన్‌ఏ-127 స్థానం నుంచి బరిలోకి దిగుతున్నాడు. కాగా, 23 ఏళ్ల కిందటనే హఫీజ్ సయీద్‌ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది ఐక్యరాజ్య సమితి. కానీ పాకిస్థాన్ మాత్రం అతడిపై ఉగ్ర నేరాలను మోపలేదు. భారత్‌ ఎంత డిమాండ్ చేసినా తిరిగి అప్పగించలేదు. నాలుగేళ్ల కిందట తప్పినసరి పరిస్థితుల్లో

(2019 జూలై) అరెస్టు చేసి జైల్లో పెట్టారు. నిరుడు ఏప్రిల్‌ లో ఉగ్ర నిధుల సేకరణ ఆరోపణలపై శిక్ష విధించారు.

తల్హా మోస్ట్ వాంటెడ్

నిధుల సేకరణ, ప్లానింగ్‌, నియామకాలను చూసే తల్హా సయీద్‌ లష్కరే స్లెరిక్ విభాగానికి అధిపతి. భారత్‌, అఫ్గానిస్థాన్‌ లో లష్కరే నియామకాలు, నిధుల సేకరణ, దాడుల కుట్రలను పర్యవేక్షిస్తుంటాడు. 2022 ఏప్రిల్ లో సయీద్‌ ను మోస్ట్ వాంటెడ్‌ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది భారత ప్రభుత్వం. ఉగ్ర కార్యకలాపాలకు ఆర్థిక సహకరించాడన్న రెండు కేసుల్లో హఫీజ్‌ సయీద్‌ కు 33 ఏళ్ల జైలు శిక్ష పడిన మరుసటి రోజే.. తల్హాను భారత్ ఉగ్రవాదిగా ప్రకటించింది. గమనార్హం ఏమంటే.. 32 మందితో కూడిన ఇదే జాబితాలో తల్హా తండ్రి సయీద్ కూడా ఉన్నాడు. ప్రస్తుతం తల్హా వయసు 47. లాహోర్‌లో పుట్టాడు. తండ్రి హఫీజ్ సయీద్ స్థాపించిన లష్కరే తోయిబా ముఠాలో సీనియర్‌ నాయకుడిగానూ తల్హా వ్యవహరించాడు.