హఫీజ్‌ఖాన్‌కు రాజ్యసభ సీటిస్తా: మైనారిటీలకు జగన్ గుడ్ న్యూస్ ?
రెండేళ్ల తర్వాత వైసీపీ రాజ్యసభ సభ్యుల్లో కొందరి పదవీకాలం ముగుస్తుందని, హఫీజ్ ఖాన్ కు కచ్చితంగా టికెట్ ఇస్తామని సభాముఖంగా సీఎం జగన్ హామీ ఇచ్చారు.
By: Tupaki Desk | 29 March 2024 4:55 PM GMTమైనారిటీ ఓటు బ్యాంకుకు సీఎం జగన్ మరోసారి గేలం వేశారు. పార్టీ కోసం ఎంతగానో శ్రమించిన హఫీజ్ ఖాన్‌ను రాజ్యసభకు పంపిస్తానని జగన్ హామీ ఇచ్చారు. ఎమ్మిగనూరులో నిర్వహించిన ‘మేమంతా సిద్ధం’ సభలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. కర్నూల్ నుంచి హఫీజ్ ఖాన్‌కు తాను టికెట్ ఇవ్వలేకపోయానని చెప్పారు.
అయితే.. అందుకు ప్రతిగా 2 ఏళ్ల తరువాత వచ్చే రాజ్యసభ ఎన్నికలకు(2026లో) అభ్యర్థిగా హఫీజ్‌ను ఇప్పుడే ప్రకటిస్తున్నట్టు చెప్పారు. తన మనసులో ఎలాంటి కల్మషం ఉండదని, అందుకే లక్షల మంది సమక్షంలో ముస్లిం నేత హఫీజ్ ఖాన్‌ను రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించానన్నారు.
"కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో హఫీజ్ ఖాన్ కు టికెట్ కేటాయించలేకపోయాం. రెండేళ్ల తర్వాత రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా హఫీజ్ ఖాన్ రాజ్యసభకు పోటీ చేస్తారు" అని సీఎం జగన్ వివరించారు.
రెండేళ్ల తర్వాత వైసీపీ రాజ్యసభ సభ్యుల్లో కొందరి పదవీకాలం ముగుస్తుందని, హఫీజ్ ఖాన్ కు కచ్చితంగా టికెట్ ఇస్తామని సభాముఖంగా సీఎం జగన్ హామీ ఇచ్చారు. అయితే.. గతంలోనూ ఇలాంటి హామీలు చాలానే ఇచ్చారు. కానీ, ఏ ఒక్కటీ నిలబెట్టుకోలేకపోవడం గమనార్హం.