ఏపీ నడిబొడ్డున హైందవ శంఖారావం...కమల వికాసమేనా ?
బీజేపీ ప్రధానంగా తేడా గల పార్టీగా చెప్పుకుంటుంది. ఆ పార్టీ మెజారిటీ వర్గం వైపు తాను ఉన్నాను అంటుంది.
By: Tupaki Desk | 4 Jan 2025 4:30 AM GMTబీజేపీ ప్రధానంగా తేడా గల పార్టీగా చెప్పుకుంటుంది. ఆ పార్టీ మెజారిటీ వర్గం వైపు తాను ఉన్నాను అంటుంది. గడచిన నాలుగు దశాబ్దాలుగా బీజేపీ రాజకీయ ఎదుగుదల చూస్తే అందులో హిందుత్వ అన్నది ఒక ట్రంప్ కార్డుగా ఉంది అని విశ్లేషణకు ఉన్నాయి. ఈ దేశంలో మొత్తం 144 కోట్ల జనాభా ఉంటే వంద కోట్లకు పైగా హిందువులు ఉన్నారని వారి పక్షాన నినదించే ఏకైక పార్టీగా తాము ఉన్నామని బీజేపీ క్లెయిం చేసుకుంటోంది.
ఉత్తరాదిన బీజేపీ హిందూత్వ నినాదం పెద్ద ఎత్తున పనిచేస్తోంది. దాని ఫలితంగానే వాజ్ పేయి మూడు విడతలుగా ఆరేళ్ల పాటు ప్రధానిగా పనిచేశారు. నరేంద్ర మోడీ రెండు విడతలుగా పదేళ్ళ పాటు పూర్తి స్థాయి ప్రధానిగా పనిచేసి మూడోసారి ప్రధానిగా రికార్డు నెలకొల్పారు.
ఇపుడు బీజేపీ చూపు దక్షిణాది మీద ఉంది. కర్ణాటకలో కమలం బాగానే వికసిస్తోంది. ఇక కేరళలో ఒక ఎంపీ సీటుని సాధిచింది అక్కడ తన ప్రస్తానానికి పునాది వేసుకుంటోంది. తమిళనాడులో సైతం విపరీతంగా శ్రమిస్తోంది. తెలంగాణాలో ఏకంగా ఎనిమిది ఎంపీ సీట్లు సాధించిన బీజేపీ రేపటి అధికారం తనదేనని అంటోంది.
ఈ క్రమంలో ఏపీలో కూడా బీజేపీ తన సత్తా చాటేందుకు చూస్తోంది. 2024 ఎన్నికల్లో కూటమిలో చేరి ఎనిమిది మంది ఎమ్మెల్యేలను ఆ పార్టీ గెలిపించుకుంది. అలాగే ముగ్గురు ఎంపీలు కూడా గెలిచారు. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాలలో పదకొండు మంది ఎంపీలు బీజేపీకి లోక్ సభలో ఉండడం గ్రేట్ అనే చెప్పాలి.
ఈ సంఖ్యను మరింతగా పెంచుకునేందుకు బీజేపీ చూస్తోంది. ఈ క్రమంలో విశ్వహిందూ పరిషత్ నిర్వహిస్తున్న హైందవ శంఖారావం బీజేపీ ఎదుగుదలకు బాటలు వేస్తుందా అన్న చర్చ అయితే సాగుతోంది. నిజానికి బీజేపీ కూడా సంఘ్ పరివారంలో భాగమే. అలాగే విశ్వహిందూ పరిషత్ కూడా అందులో మరో పరివారమే.
ఈ నేపథ్యంలో హిందూ దేవాలయాల పరిరక్షణ కోసం విశ్వహిందూ పరిషత్ హైందవ శంఖారావం సభను నిర్వహించడం ద్వారా తెలుగు నాట రాజకీయ సమీకరణల మీద తీవ్ర ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయా అన్నది చర్చగా ఉంది. ఏకంగా అయిదు లక్షల మందితో నిర్వహించే ఈ సభకు కృష్ణాజిల్లా కేసరపల్లిని వేదికగా చేసుకున్నారు.
ఏపీ రాజకీయ రాజధాని క్రిష్ణా జిల్లాలో నిర్వహించే ఈ సభను సుమారు 30 ఎకరాల స్థలంలో జరుపుతున్నారు. అలాగే దేశ వ్యాప్తంగా 150 మందికి పైగా స్వామీజీలు హాజరవుతున్నారు. ఇక ఈ సభ ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి అంటే హిందూ ధార్మిక సంస్థలను ప్రభుత్వ పెత్తనం నుంది వేరు చేయడం. వాటికి స్వయం ప్రతిపత్తి ఇచ్చి స్వయంగా నడుపుకునేలా చేయడం.
ఇతర మతాల ప్రార్ధనా మందిరాలకు లేని ఈ నియంత్రణ కేవలం హిందువులకు చెందిన ఆలయాలకే వర్తింపచేయడమేంటని విశ్వహిందూ పరిషత్ ప్రశ్నిస్తోంది. అంతే కాదు ఈ మేరకు చట్ట సవరణ చేయాలని కోరుతూ జాతీయ స్థాయిలో ఒక ఉద్యమాన్ని చేపడుతోంది. అందులో భాగంగానే క్రిష్ణా జిల్లాలో నిర్వహించే హైందవ శంఖారావం అని చెబుతున్నారు.
ఈ సమావేశం ద్వారా హిందువులలో ఐక్యత సాధించడం వారిని ఒక త్రాటి మీదకు తేవడం ముఖ్య లక్ష్యాలుగా చేసుకుంటున్నారు. ఇక ఏపీలో తన రాజకీయ ప్రభావం చూపించాలని బీజేపీ చూస్తోంది. హిందూత్వ నినాదంతోనే అది సాధ్యమని నమ్ముతోంది. దానికి అవసరమైన ఇంధనాన్ని ఈ మహా సభ సమకూరుస్తుందా అన్నదే చర్చగా ఉంది. ఏది ఏమైనా బీజేపీకి ఈ సభ ద్వారా వీలైనంతగా మేలు జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.