హిందూ శంఖారావం సక్సెస్ తో కొత్త రాజకీయ సంకేతాలు
ఏపీలోని గన్నవరం నియోజకవర్గంలో కేసరపల్లిలో నిర్వహించిన హిందూ శంఖారావం సభ సూపర్ సక్సెస్ అయింది.
By: Tupaki Desk | 7 Jan 2025 3:52 AM GMTఏపీలోని గన్నవరం నియోజకవర్గంలో కేసరపల్లిలో నిర్వహించిన హిందూ శంఖారావం సభ సూపర్ సక్సెస్ అయింది. విశ్వహిందూ పరిషత్ ఈ సభను నిర్వహించింది. అయిదు లక్షల మందితో ఈ శంఖారావాన్ని నిర్వహించాలని వీహెచ్ పీ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఎన్ని లక్షల మంది వచ్చి ఉంటారు అన్నది ఇదమిద్దంగా లెక్క తేలకపోయిన అతి పెద్ద సంఖ్యలో జనాలు తరలి వచ్చారు అన్నది వాస్తవం. దాంతో హిందూ శంఖారావం విజయవంతం అయింది అని అంటున్నారు.
హిందువులు అంతా ఐక్యంగా ఉండాలని రాజకీయాలకు అతీతంగా అంతా ఒక్కటిగా నిలిచి హిందూ సమాజానికి గట్టి మేలు జరిగేలా చూడాలని ఈ సభలో వక్తలు ఇచ్చిన పిలుపుకు మంచి స్పందన లభించింది. నిజానికి చూస్తే ఏపీలో హిందూత్వ అన్నది పెద్దగా వర్కౌట్ అవదన్న భావన ఉంది. మొదటి నుంచి ఇక్కడ వామపక్ష భావ జాలం అధికంగా ఉంది. అంతే కాదు సెక్యులర్ భావజాలం ప్రభావితంగా ఏపీ రాజకీయాలు సాగుతూ వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి ఏపీ పెట్టని కోటగా మారడానికి ఇదే కారణం. దేశమంతా కాంగ్రెస్ ని వ్యతిరేకించినా ఏపీ ఆ పార్టీని కాపాడింది.
ఇక ప్రాంతీయ పార్టీలుగా టీడీపీ సహా ఎన్ని వచ్చినా సెక్యులర్ పంధాలోనే సాగుతూ జనం మన్ననలు పొందాయి. జనసంఘ్ కాలం నుంచి ఏపీలో కాలు పెట్టడానికి బీజేపీ చూసినా కూడా అది కుదరలేదు. బీజేపీ హిందూత్వ భావజాలం మీద పూర్తి వ్యతిరేకత అనేలేరు కానీ ఎందుకో అంతగా ఆకట్టుకోని జనాలే ఉన్నారు.
అందుకే బీజేపీకి తెలంగాణాలో విజయాలు దక్కినా ఏపీలో వాజ్ పేయి నరేంద్ర మోడీ లాంటి ప్రజాకర్షణ కలిగిన నేతలు కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఏపీలో ప్రజలు అంతా ఈ విధంగా ఆలోచనలు చేస్తారని జడిసి ఒక దశలో బీజేపీతో పొత్తులకు కూడా ప్రధాన పార్టీలు వెనకాడిన నేపథ్యం ఉంది.
అయితే చిత్రంగా బీజేపీతో ఇపుడు ప్రత్యక్షంగా పరోక్షంగా పొత్తు పెట్టుకునే పార్టీలే ఏపీలో కనిపిస్తున్నాయి. ఇక ఏపీలో టీడీపీ జనసేన బీజేపీతో పొత్తులో ఉన్నా మైనారిటీల మద్దతు కూడా అదే సమయంలో దక్కింది. దాంతో బీజేపీ నెమ్మదిగా అందరికీ నచ్చుతోందా అన్న చర్చ కూడా బయల్దేరింది.
ఇదిలా ఉంటే గడచిన వైసీపీ ప్రభుత్వ పాలనలో హిందువుల ఆలయాల మీద దాడులు విజయనగరంలో రామ తీర్ధాలు లో రాముడి తల నరకడం, అంతర్వేదిలో రధం తగులబడడం వంటివి కూడా హిందువులలో కొత్త ఆలోచనలు కలుగచేశాయని అంటున్నారు. అలాగే అయోధ్య రామమందిరం నిర్మాణం కావడం కూడా హిందువుల ఐక్యతకు బలానికి సంకేతంగా భావించే వారు ఆ విధంగా ఆలోచించేవారు క్రమంగా పెరుగుతున్నారని అంటున్నారు.
ఇటీవల తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది అన్న దాని మీద కూడా జనాలలో విపరీతమైన చర్చ సాగింది. అంతే కాదు హిందూ ఆలయాలలో అన్యమతస్తులకు ఉద్యోగాలు హిందూ ఆలయాల మీద ఇతరుల పెత్తనం ఇవన్నీ ఆలోచింపచేసేలా ఉన్నాయని అంటున్నారు. దాంతోనే హిందూ శంఖారావం అని మన దేవాలయాలు మన ఆధీనంలోనే ఉంచుకోవాలి అంటూ వీహెచ్ పీ ఇచ్చిన పిలుపునకు పెద్ద ఎత్తున జనాల నుంచి స్పందన లభించింది అని అంటున్నారు.
ఒక విధంగా ఈ రకమైన హిందూ చైతన్యం ఏ రాజకీయ పునరేకీకరణకు సూచిక అన్న చర్చ మొదలైంది. ఇప్పటికే ఏపీలో పొత్తుతో ప్రభుత్వంలో చేరిన బీజేపీ అంతకంతకు తాను బలపడాలని చూస్తోంది. దానికి తోడు అన్నట్లుగా హిందూ చైతన్యం కనుక పెద్ద ఎత్తున వ్యాపిస్తే మాత్రం ఏపీలో రాజకీయ మార్పులు సంభవిస్తాయని అంటున్నారు. ఇప్పటికే జనసేన అధినేత సనాతన ధర్మం అంటూ జనంలోకి వచ్చారు.
అది కూడా చర్చగా మారింది. ఈ నేపథ్యంలో నుంచి చూస్తే ఏపీలో కూడా రాజకీయంగా సామాజికంగా పునరేకీకరణకు దారులు ఏర్పడుతున్నాయా అన్నదే అంతటా చర్చగా ఉంది. ఈ హిందూ చైతన్యం ఏ వైపునకు మళ్ళుతుంది. ఎవరి దీనిని అంది పుచ్చుకుంటారు ఎవరిని మేలు అన్నది భవిష్యత్తులో తేలనుంది. అయితే ఈ సభ సక్సెస్ తో వీహెచ్ పీ అయితే పూర్తి ఉత్సాహంతో ఉంది. రానున్న కాలంలో ఇలాంటి సభలను మరిన్ని నిర్వహించాలని చూసినా ఆశ్చర్యం లేదు. మరి ఇదే వైఖరి కొనసాగితే మాత్రం ఏపీలో పూర్తి మార్పు కనిపిస్తుంది అని అంటున్నారు.