చేతబడి అనుమానం... 110 మంది వృద్ధుల హత్య
ఇటీవల హైతీ అనే దేశంలో అత్యంత దారుణ సంఘటన జరిగింది. మారుమూల ప్రాంతం కావడంతో సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
By: Tupaki Desk | 9 Dec 2024 8:30 PM GMTఈ కంప్యూటర్ యుగంలోనూ చాలా మంది మూడ నమ్మకాలతో కొట్టుకు చస్తున్నారు. ఇండియాలో మూడ నమ్మకాలు ఎక్కువ అనుకుంటే కొన్ని వెనకబడిన దేశాల్లో మరీ దారుణంగా పరిస్థితి ఉంది. అక్కడ చేతబడితో పాటు ఇంకా రకరకాల అనుమానాలతో కొట్టుకు చస్తున్న వారు చాలా మంది ఉన్నారు. కరేబియన్ దేశాల్లో ఇంకా పరిస్థితులు అత్యంత దయనీయంగా ఉన్నాయి. కొన్ని దేశాల్లో తిండి కోసం కొట్టుకుంటూ ఉంటే, కొన్ని దేశాల్లో మూడ నమ్మకాలతో కొట్టుకు చస్తారు. ఇటీవల హైతీ అనే దేశంలో అత్యంత దారుణ సంఘటన జరిగింది. మారుమూల ప్రాంతం కావడంతో సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
హైతీ అనే చిన్న దేశంలోని రాజధాని పోర్ట్ ఔ ప్రిన్స్‌లో సైట్ సోలైట్ అనే రద్దీ స్లమ్ ఏరియా ఉంది. ఆ ఏరియాలో ఒక గ్యాంక్‌కి లీడర్ ఉంటాడు. ఆ లీడర్ కను సన్నల్లో ఏరియాలో అన్ని పనులు జరుగుతూ ఉంటాయి. ఆ లీడర్ యొక్క కుమారుడు అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. చాలా కాలం నుంచి అతడి అనారోగ్య సమస్య కుదుట పడకపోవడంతో ఒక పూజారి వద్దకు తీసుకు వెళ్లగా ఆ పూజారి బాబుకు చేతబడి చేసినట్లుగా అనుమానం వ్యక్తం చేశాడు. ఆ చేతబడిని స్థానికంగా ఉన్న వృద్ధులు చేసి ఉంటారు అని కూడా ఆ పూజారి అనుమానంతో చెప్పాడట. దాంతో స్థానికంగా ఉన్న వృద్ధులు అందరిని చంపేయడం మొదలు పెట్టారు.
రెండు రోజుల పాటు ఆ ఏరియాలో ఉన్న మొత్తం వృద్ధులను ఏరిపారేసే విధంగా ఆ లీడర్ అనుచరులు అత్యంత పాశవికంగా ప్రవర్తించారు. చేతబడి చేశారు అనే అనుమానంతో ఏకంగా 110 మంది వృద్ధులను ఆ గ్యాంగ్‌కి చెందిన వారు హత్య చేశారు. కత్తులతో నరుకుతూ రక్తపాతం సృష్టించారు. అక్కడ ఇంటర్నెట్ కాదు కదా కనీసం ఫోన్ కాల్స్ చేసే పరిస్థితి కూడా ఉండదు. అందుకే సంఘటన జరిగిన తర్వాత లేటుగా వెలుగులోకి వచ్చింది. స్థానికంగా కేసు నమోదు అయినా పెద్దగా చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు.
ఈ విషయమై అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరగడంకు కారణం మానవ హక్కుల కమీషన్‌కి ఫిర్యాదు అందడం. అందిన ఫిర్యాదుతో ఇప్పటికే మానవ హక్కుల కమీషన్ విచారణ చేపట్టింది. అత్యంత దారుణంగా జరిగిన ఈ సంఘటన విషయంలో అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. ఈ కాలంలోనూ ఇంకా ఇలాంటివి నమ్మడం విడ్డూరంగా ఉందని, ఒక అనుమానంతో 110 మందిని చంపడం అనేది అమానుషమైన చర్య అంటూ చాలా మంది వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.