Begin typing your search above and press return to search.

హజ్ యాత్రలో భారీగా పెరిగిన మృతులు.. కారణాలివే!

అవును... ఈ ఏడాది హజ్ యాత్రలో మృతులు భారీగా పెరిగినట్లు చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   24 Jun 2024 7:58 AM GMT
హజ్ యాత్రలో భారీగా పెరిగిన మృతులు.. కారణాలివే!
X

సౌదీ అరేబియాలో భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇటీవల అత్యధికంగా 51.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యిందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. దీంతో హజ్ యాత్రకు వెళ్లిన వారిలో వందలాదిమంది వడదెబ్బ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సంఖ్య భారీగా పెరిగినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడిస్తున్నాయి.

అవును... ఈ ఏడాది హజ్ యాత్రలో మృతులు భారీగా పెరిగినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా... మృతుల సంఖ్య 1,300కు చేరినట్లు సౌదీ అధికారిక వర్గాలు ప్రకటించాయి. తీవ్రమైన ఎండలు, వడగాలులే దీనికి కారణమని వెల్లడించాయి. అయితే ఇక్కడ చనిపోయినవారిలో సుమారు 83శాతం మంది చట్టవిరుద్ధంగా వచ్చినవారేనని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో వారిలో చాలా మంది సుదూర ప్రాంతాల నుంచి భగభగమండే ఎండల్లో నడుచుకుంటూ వచ్చారని.. ఫలితంగా తీవ్ర వడదెబ్బకు గురయ్యారని సౌదీ ఆరోగ్యశాఖ మంత్రి ఫహద్ బిన్ అర్దుర్ర్హ్మాన్ అల్ జలజెల్ వెల్లడించారు. వీరిలో సుమారు 95 మంది యాత్రికులకు చికిత్స అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.

వీరిలో కొంతమందిని మెరుగైన చికిత్స కోసం విమానాల ద్వారా రాజధాని రియాద్ కు తర్లిస్తున్నట్లు వెల్లడించారు. మృతుల్లో అత్యధికులు అనధికారికంగా వచ్చినవారు కావడంతో వారి వద్ద సరైన పత్రాలు లేక గుర్తించడం కష్టమవుతుందని తెలిపారు. అయితే ఇప్పటికే కొంతమందికి సంప్రదాయం ప్రకారం మక్కాలోనే అంత్యక్రియలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.

ఇక మృతుల్లో అత్యధికులు ఈజిప్టు వాసులేనని తెలిపిన మంత్రి... వారి సంఖ్య సుమారు 660 వరకూ ఉందని అన్నారు! వీరిలో 31 మంది మినహా మిగిలినవారంతా చట్టవిరుద్ధంగా హజ్ యాత్రకు వెళ్లినవారే నని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యలో వీరి రాకకు కారణమైన 16 ట్రావెల్ ఏజెన్సీల లైసెన్సులను అక్కడి ప్రభుత్వం రద్దు చేసింది.

ఈజిప్టు తర్వాత మృతుల్లో అత్యధికంగా 165 మంది ఇండోనేషియా దేశస్తులు ఉండగా.. సుమారు 98 మంది భారతీయులు, పదుల సంఖ్యలో జోర్డాన్, అల్జీరియా, మొరాకో, మలేషియా సహా ఇతర దేశాలకు చెందినవారని చెబుతున్నారు. ఇదే క్రమంలో ఇద్దరు అమెరికా పౌరులు కూడా ఉన్నట్లు వెల్లడించారు.