సెంట్రల్ గాజా.. బెరూత్ లో ఇజ్రాయెల్ దాడుల తీవ్రత ఎంతంటే?
రాత్రి.. పగలు అన్న తేడా లేకుండా సాగుతున్న ఈ దాడులతో పశ్చిమాసిలో ఉద్రిక్తతలు అంతకంతకూ పెరిగిపోతున్న పరిస్థితి.
By: Tupaki Desk | 7 Oct 2024 4:45 AM GMTమొదలు పెట్టం.. మొదలుపెడితే ఆపేది లేదన్నట్లుగా మారింది ఇజ్రాయెల్ తీరు. తమపై విరుచుకుపడి.. తమ ప్రజల ప్రాణాల్ని తీసిన వారందరికి జీవితంలో మర్చిపోలేని గుణపాఠాన్ని చెప్పటమే లక్ష్యమన్నట్లుగా ఇజ్రాయెల్ వ్యవహరిస్తోంది. ఇందుకోసం ఎంతమంది ప్రాణాలతో పాటు.. దేశాలకు దేశాలకు కంటి మీద కనుకు లేకుండా చేస్తోంది. ఇరాన్ ప్రాయోజిత ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించివేయటమే లక్ష్యమన్న రీతిలో చెలరేగిపోతున్న ఆ దేశ సైన్యం దెబ్బకు అగ్నిగోళాలు బద్ధలైనట్లుగా బాంబుల వర్షాన్ని కురిపిస్తోంది. రాత్రి.. పగలు అన్న తేడా లేకుండా సాగుతున్న ఈ దాడులతో పశ్చిమాసిలో ఉద్రిక్తతలు అంతకంతకూ పెరిగిపోతున్న పరిస్థితి.
లెబనాన్ రాజధాని బీరూట్ (బెరూత్) చరిత్రలో అత్యంత దారుణమైన రోజుగా చెబుతున్నారు. రాత్రివేళ చిమ్మ చీకట్లు చిక్కగా ఉన్న వేళ.. లెబనాన్ రాజధాని మీద జరిగిన దాడుల్ని చూస్తే.. ఎడతెగని బాంబుల వర్షంతో అగ్నిగోళాలు బద్ధలైనట్లుగా మారి.. ఆకాశం మొత్తం ఎర్రటి మంటలతో నిండింది. తమ దాడులకు ముందు సౌత్ బెరూత్ వాసుల్ని ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని హుకుం జారీ చేసింది. అనంతరం రాత్రంతా బాంబుల దాడికి తెల్లవారిన తర్వాత కూడా ఈ ప్రాంతం మొత్తం పొగమేఘాలతో నిండిపోయింది. నాన్ స్టాప్ బాంబుల పేళ్లుళ్ల వేళ.. భారీ విస్పోటనం చోటు చేసుకుంది.
అయితే పెట్రోల్ బంక్ కానీ లేదంటే ఆయుధగారం అయి ఉంటుందని చెబుతున్నారు. బేరూత్ మీద ఇజ్రాయెల్ దాడి మొదలైన తర్వాత ఇప్పటివరకు ఎప్పుడూ లేనంత భారీగా పేలుళ్లు చోటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు. అయితే.. తాము హిజ్బుల్లా స్థావరాల మీదనే దాడులకు పాల్పడినట్లుగా ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. ఇరాన్ నాయకత్వంలోని అనాగరిక శక్తుల మీద తాము పోరాటం చేస్తున్నట్లుగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తన టీవీ స్పీచ్ లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే లెబనాన్ నుంచి దూసుకొచ్చిన 30 రాకెట్లను మధ్యలోనే కూల్చేసినట్లుగా ఇజ్రాయెల్ ప్రకటించింది.
ఇజ్రాయెల్ దాడుల్లో లెబనాన్ లో గడిచిన 2 వారాల్లో 1400 మంది మరణించగా.. 10 లక్షలకు పైగా నిరాశ్రయులయ్యారు. 3.75 లక్షల మంది సిరియాకు చేరుకున్నారు. మరోవైపు గాజాలోని ఒక మసీదు మీద జరిపిన దాడుల్లో 21 మంది చనిపోయారని హమస్ నాయకత్వం పేర్కొంది. గాజాలోని దెయిర్ అల్ బలాహ్ ప్రాంతంలో ఈ మసీదు ఉంది. ఇందులో హమస్ మిలిటెంట్లు తలదాచుకొని ఉన్నారని.. అందుకే బాంబులతో నేలమట్టం చేసినట్లుగా ఇజ్రాయెల్ పేర్కొంది. తాము హమస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లను నాశనం చేశామని.. సాధారణ పౌరులకు ఎలాంటి గాయాలు కాకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నట్లుగా ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది.
ఇదిలా ఉంటే యుద్ధంలో మరో దశలోకి ప్రవేశించినట్లుగా జబాలియాలో ఇజ్రాయెల్ కరపత్రాల్ని జారవిడిచింది. ఉత్తర గాజాలో ఆదివారం భీకర దాడులు జరిగినట్లుగా స్థానిక అధికారులు స్పష్టం చేస్తున్నారు. చాలా భవనాలు ధ్వంసమైనట్లుగా.. పెద్ద ఎత్తున ప్రాణనష్టం వాటిల్లినట్లుగా పేర్కొన్నారు. ఉత్తర గాజాలో 3 లక్షల మంది పాలస్తీనా పౌరులు ఉన్నారు. వారందరిని తక్షణమే దక్షిణ గాజాకు వెళ్లిపోవాలంటూ ఇజ్రాయెల్ సైన్యం వార్నింగ్ ఇచ్చేసింది.
ఇజ్రాయెల్ మీద హమస్ దాడికి ఏడాది పూర్తి అవుతున్న సందర్భంగా.. ఆ దేశం మీద మరికొన్ని దాడులు జరిగే అవకాశం ఉందని.. అప్రమత్తంగా ఉండాలంటూ అమెరికన్ నిఘా సంస్థలు వెల్లడించాయి. ఇదిలా ఉంటే గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంలో ఇప్పటివరకు 42 వేల మంది మరణించినట్లుగా ఐక్యరాజ్య సమితి వెల్లడించింది.