కేరళలో ఏం జరుగుతోంది? ఏనుగుల మీద హమస్ నేతల ఫోటోలతో ఊరేగింపు
కేరళలోని పాలక్కడ్ లో ప్రతి ఏడాది త్రిథాల సాంస్క్రతిక ఉత్సవాన్ని నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా త్రిథాల పట్టణంలో ఏనుగుల ఊరేగింపును నిర్వహిస్తుంటారు.
By: Tupaki Desk | 18 Feb 2025 10:30 AM GMTకేరళలో ఏం జరుగుతోంది? ఎవరికి నచ్చినట్లు వారు చేసుకుంటూ పోవటమేనా? అక్కడో ప్రభుత్వం ఉందన్న విషయాన్ని కొందరు అర్థం చేసుకోవట్లేదా? సంబంధం లేని అంశాల్ని ప్రజల మీద రుద్దే ఇలాంటి చర్యలపై పోలీసులు సైతం సీరియస్ గా తీసుకోవాల్సి ఉంది. అయినప్పటికీ అదేమీ లేని ఈ వ్యవహారం బయటకు రావటంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి ఏటా సంప్రదాయంగా నిర్వహించే త్రిథాల ఉత్సవంలో కొందరు చేసిన అతి ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.
కేరళలోని పాలక్కడ్ లో ప్రతి ఏడాది త్రిథాల సాంస్క్రతిక ఉత్సవాన్ని నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా త్రిథాల పట్టణంలో ఏనుగుల ఊరేగింపును నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది ఆదివారం సాయంత్రం నిర్వహించిన ఈ ఊరేగింపు సందర్భంగా కొందరు యువకులు హమస్ నేతల ఫోటోల్ని పట్టుకొని ఏనుగులపైకి ఎక్కి కూర్చున్నారు. ఈ ఉత్సవంలో స్థానిక ఎమ్మెల్యే.. మంత్రి రాజేశ్ తో పాటు కాంగ్రెస్ నాయకులు.. మాజీ ఎమ్మెల్యే పాల్గొనటాన్ని పలువురు తప్పు పడుతున్నారు.
ఈ పట్టణంలోని శివాలయంలో నిర్వహించే ఈ ఉత్సవాన్ని ఇలా ఎలా మారుస్తారు? అని ప్రశ్నిస్తున్నారు. మతపరమైన ఈ వేడుకల్లో ఇలాంటి చర్యలు ఎలా ప్రోత్సహిస్తారు? అన్నది ప్రశ్న. ఈ సందర్భంగా గత ఏడాది జరిగిన ఒక ఉదంతాన్ని ప్రస్తావిస్తున్నారు. గత ఏడాది కేరళలో జరిగిన ర్యాలీలో హమస్ నేతలు వర్చువల్ గా పాల్గొన్న వైనం అప్పట్లో తీవ్ర విమర్శలకు తావిచ్చింది. అయినప్పటికీ అక్కడి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నది లేదు.
తాజాగా హమస్ ఉగ్రవాదుల్ని పొగుడుతూ ఏనుగుల మీద ఊరేగించిన వైనం ద్వారా ఎలాంటి సందేశాన్ని ఇవ్వాలని భావిస్తున్నారంటూ బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ వివాదంపై కేరళ ముఖ్యమంత్రి విజయన్ ఇప్పటివరకు స్పందించింది లేదు. మరోవైపు ఈ ఉత్సవంతో మతపరమైన సంబంధం లేదని అంటున్నారు. ఒకవేళ.. అదే నిజమని అనుకుందాం. అలాంటప్పుడు హమస్ నేతల ఫోటోల్ని ప్రదర్శించటానికి ఒక ఉత్సవాన్ని వేదికగా తీసుకోవాల్సిన అవసరం ఏమిటి? అన్నది మరో ప్రశ్న.
ఈ వివాదాన్ని జాతీయ స్థాయిలో ముస్లిం సమాజాన్ని.. కేరళను టార్గెట్ చేసుకుంటున్నట్లుగా కాంగ్రెస్ నేత బలరామ్ వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి.. ఈ వివాదానికి తెర తీయకుండా ఉంటే సరిపోయే అంశాన్ని.. హమస్ నేతల ఫోటోలతో ఊరేగించాల్సిన అవసరం ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది. ఈ వ్యవహారానికి సంబంధించి వీడియో వైరల్ గా మారటమే కాదు.. పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.