Begin typing your search above and press return to search.

అమెరికాపై 9/11లా.. ఇజ్రాయెల్ పై 10/7.. భారీ కుట్రనే..

నాటి భయానక ఉగ్రదాడుల్లో అమెరికాలో మొత్తం 3 వేలమంది పైగా చనిపోయారని అంచనా. 23 ఏళ్లు గడిచినా.. ప్రపంచ చరిత్రలో ఇవొక భయానక దాడులుగా నిలిచిపోయాయి.

By:  Tupaki Desk   |   14 Oct 2024 11:01 AM GMT
అమెరికాపై 9/11లా.. ఇజ్రాయెల్ పై 10/7.. భారీ కుట్రనే..
X

చరిత్రలో అమెరికాపై నేరుగా జరిగిన దాడులు తక్కువే. అయితే.. అంతటి అగ్రరాజ్యాన్ని 2001 సెప్టెంబరు 11న వణికించారు ఆల్ ఖైదా ఉగ్రవాదులు. ప్రయాణికుల విమానాలను హైజాక్ చేసి నేరుగా న్యూయార్క్ లోని ట్విన్ టవర్స్ పైకి పోనిచ్చారు. అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్ పైనా విమానాలతో దాడులు చేసేందుకు ప్రయత్నించినా విఫలమయ్యారు. కానీ, అమెరికాకే కాదు ప్రపంచానికి ఆర్థిక రాజధానిగా భావించే న్యూయార్క్ లోని ట్విన్ టవర్స్ కుప్పకూలాయి. ఆ ప్రదేశం తర్వాతి కాలంలో గ్రౌండ్ జీరోగా మారిపోయింది. నాటి భయానక ఉగ్రదాడుల్లో అమెరికాలో మొత్తం 3 వేలమంది పైగా చనిపోయారని అంచనా. 23 ఏళ్లు గడిచినా.. ప్రపంచ చరిత్రలో ఇవొక భయానక దాడులుగా నిలిచిపోయాయి.

ఆ తరహాలోనే..

ఇజ్రాయెల్ పై నిరుడు అక్టోబరు 7న ఒక్కసారిగా విరుచుకుపడింది ఉగ్ర మూక హమాస్. అప్పటివరకు హమాస్ గురించి మిగతా ప్రపంచానికి తెలిసింది వేరు. అక్టోబరు 7న తెలిసింది వేరు. ఇజ్రాయెల్ లోకి దూసుకొచ్చిన హమాస్ ఉగ్రవాదులు.. కనిపించినవారినల్లా కాల్చేశారు. ఇజ్రాయెల్ కిబుట్జ్ లోకి ప్రవేశించి నానా విధ్వంసం రేపారు. 250 మందిని బందీలుగా పట్టుకెళ్లారు. కొన్ని గంటల్లోనే 1,200 మందిని చంపేశారంటే హమాస్ ల అరాచకం ఏ స్థాయిలో ఉందో ఊహించవచ్చు. కాగా, నిరుటి దాడులుకు సంబంధించి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) కీలక విషయాలను బయటపెట్టింది.

టెల్ అవీవ్ లోని భవనాలు లక్ష్యంగా..

ఇజ్రాయెల్ రాజధాని టెల్‌ అవీవ్‌ లో 70 అంతస్తుల్లో ఉంటాయి ‘మోషె అవివ్‌’,ఇజ్రాయిల్‌ టవర్‌ లు. వీటిని అమెరికాపై జరిగిన 9/11 తరహా దాడులతో కూల్చేయాలని హమాస్ ప్రణాళిక వేసిందట. రైళ్లు, బోట్లు, గుర్రపు బగ్గీలతో హమాస్ ఈ బహుళ అంతస్తుల భవనాలను లక్ష్యంగా చేసుకోవాలని చూసిందని ఐడీఎఫ్‌ పేర్కొంటోంది. ఈ మేరకు కుట్రకు సంబంధించిన రికార్డులను గాజాలోని ఖాన్‌ యూనిస్‌ లో ఉన్న హమాస్‌ కమాండ్‌ సెంటర్‌ నుంచి స్వాధీనం చేసుకుంది. వాటిని విశ్లేషించగా.. మోషె అవివ్, అజ్రాయిల్ టవర్లను నేలమట్టం చేయాలనే హమాస్ పన్నాగం బయటపడిందని ఇజ్రాయెల్ చెబుతోంది. ఈ మేరకు ‘వాషింగ్టన్‌ పోస్ట్‌’ కథనం ప్రచురించింది. ఇజ్రాయెల్‌ కీలక ప్రాంతాల భారీ డేటా బేస్‌ ఉన్నట్లు బయటపడింది. దీనిలో సుమారు 17,000 ఫొటోలున్నాయి. వీటిని డ్రోన్లు, శాటిలైట్లతో తీసినట్లు తెలుస్తోంది. కొన్నింటిని సోషల్ మీడియా నుంచి సేకరించినట్లు సమాచారం.

రెండేళ్ల డేటా బట్టబయలు..

ఖాన్ యూనిస్ లో హమాస్ సెంటర్ ను ఇజ్రాయెల్ జల్లెడ పట్టగా హమాస్‌ రాజకీయ, సైనిక విభాగాల గుట్టుమట్లన్నీ బయటపడ్డాయి. రెండేళ్లుగా వారు వరుసగా జరిపిన సమావేశాల సమాచారంతో పాటు.. ఇరాన్‌ అధికారులతో హమాస్‌ అగ్ర నాయకుడు యాహ్యా సిన్వార్‌ జరిపిన సంభాషణలూ దొరకడం గమనార్హం. సిన్వార్‌ తో పాటుతో పాటు అతడి సోదరుడు, మహమ్మద్‌ డెయిఫ్, మార్వన్‌ ఇస్సా తదితరులు పాల్గొన్న ఇలాంటి పది సమావేశాల వివరాలను ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ ప్రచురించింది. ఇక 2021లోనే ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ సహా పలువురు కీలక నాయకులను సిన్వార్‌ కలిసినట్లు పత్రాల ద్వారా స్పష్టమైంది. ఆర్థిక, సైనిక సాయం కూడా సిన్వార్‌ కోరినట్లు సమాచారం.