గుండెల్లో బుల్లెట్.. లేదంటే ఉరి..సొంత సభ్యులకు హమాస్ తీవ్ర శిక్షలు!
హమాస్ అంటే ఇప్పటివరకు భయంకర మిలిటెంట్ సంస్థగానే అందరికీ పరిచయం.. కానీ, అందులోనూ నైతిక విలువలను కచ్చితంగా పాటిస్తారనేది ఇప్పుడు బయటపడుతోంది.
By: Tupaki Desk | 6 Feb 2025 11:30 PM GMTహమాస్ అంటే ఇప్పటివరకు భయంకర మిలిటెంట్ సంస్థగానే అందరికీ పరిచయం.. కానీ, అందులోనూ నైతిక విలువలను కచ్చితంగా పాటిస్తారనేది ఇప్పుడు బయటపడుతోంది. 2023 అక్టోబరులో ఇజ్రాయెల్ పై దాడిచేసి తీసుకెళ్లిన బందీలపై లైంగిక హింసకు పాల్పడిన తమ సభ్యులను నిర్దాక్షణ్యంగా శిక్షించిందట హమాస్. వీరికి మరణ శిక్ష వేసిందట.
2023, అక్టోబరు 7న ఇజ్రాయెల్ పై హమాస్ భీకర దాడికి పాల్పడింది. 250 మంది వరకు ప్రజలను బందీలుగా తీసుకుని గాజాకు వెళ్లిపోయింది. వీరిలో పురుషులు, మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. అయితే, ఇజ్రాయెల్ పురుషులపై హమాస్ లోని కొందరు ఫైటర్లు అకృత్యాలకు పాల్పడ్డారట. స్వలింగ సంబంధాలు అనేవి హమాస్ లో తీవ్ర శిక్షకు కారణం అవుతాయి. కమాండర్ మహమ్మద్ ఇష్తివిని ఈ కారణం చేతనే 2016లో గుండెల్లో మూడు బుల్లెట్లు దించి హతమార్చారు. తొలుత జైలు శిక్ష కూడా విధించి, చిత్రహింసలు పెట్టారు.
తాజాగా బందీలపై అకృత్యాలకు పాల్పడ్డారన్న కారణంతో కొందరు మిలిటెంట్లపై హమాస్ కఠిన చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. హమాస్ కు చెందిన 94 మంది ఫైటర్స్ పై హోమో సెక్సువాలిటీకి సంబంధించిన సంభాషణలు, పరాయి మహిళలతో సన్నిహితంగా మెలగడం, చిన్నారులపై అత్యాచారం, చిత్రహింసలకు గురిచేయడం ఆరోపణలు వచ్చాయి. గాజాలో హోమో సెక్సువాలిటీ అనేది హమాస్ నిబంధనలకు విరుద్ధం. ఇలా చేస్తే జైలు లేక మరణశిక్ష విధిస్తారు.
ట్రంప్ మాటలకు అర్థం వేరట..
గాజాను స్వాధీనం చేసుకొని అభివృద్ధి చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంపై విమర్శలు రావడంతో వైట్ హౌస్ నష్ట నివారణ చేపట్టింది. ట్రంప్ వ్యాఖ్యల ఉద్దేశం.. గాజా ప్రజలను తాత్కాలికంగా మాత్రమే ఇతర ప్రాంతాలకు మార్చడం అని పేర్కొంది. పాలస్తీనా శరణార్థులకు తమ మిత్రదేశాలైన ఈజిప్ట్, జోర్డాన్ లు ఆశ్రయం ఇస్తాయని భావిస్తున్నట్లు పేర్కొంది. అలాగైతేనే వారి ఇళ్లను పునర్ నిర్మించగలమని తెలిపింది. నివాసానికి యోగ్యం కానంత దారుణంగా దెబ్బతిన్న గాజా నుంచి తాత్కాలికంగా మాత్రమే ప్రజలను బయటకు తరలిస్తారని వివరించారు. అమెరికా దళాలు అక్కడికి వెళ్లకూడదన్న దానికి ట్రంప్ కట్టుబడి లేరని.. గాజా పునర్నిర్మాణంలో భాగం కావాలని కోరుకుంటున్నారని చెప్పుకొచ్చింది. అమెరికా ప్రజల సొమ్మును అక్కడ పెట్టుబడి పెడతారని కాదని తెలిపింది.