రాక్షస మూక కాదు.. తమకు మనసు ఉందన్నట్లుగా వ్యవహరించిన హమస్
అక్టోబరు ఏడున ఇజ్రాయెల్ లోని పలు ప్రాంతాలపై మెరుపుదాడి చేసిన హమస్ ఉగ్రమూక సుమారు 200 మందిని బందీలుగా చేసుకొని వారిని తమ భూభాగంలోని (గాజా) బంకర్లలో దాచి ఉంచటం తెలిసిందే.
By: Tupaki Desk | 21 Oct 2023 4:37 AM GMTఇప్పుడు మేం చెప్పే విషయంలో మాకు పాలస్తీనా మీద వ్యతిరేకం లేదు. అలా అని ఇజ్రాయెల్ ను నెత్తిన పెట్టుకోవట్లేదు. అలా అని హమస్ తీరును తప్పు పడుతూనే మద్దతు ఇచ్చే ధోరణి అసలే కాదు. విషయాన్ని విషయం మాదిరి చెప్పటం మాత్రమే మా ఉద్దేశం. అంతుకు మించి మరింకేమీ లేదన్న విషయాన్ని మర్చిపోవద్దు. పెద్ద ఎత్తున అమాయక ప్రజల్ని బంధీలుగా చేసుకొని.. తమ డిమాండ్లను నెరవేర్చుకోవాలని భావిస్తున్న హమస్.. అనూహ్య రీతిలో అగ్రరాజ్యం అమెరికాకు చెందిన తల్లీకూతుళ్లను విడుదల చేసిన వైనం ఆసక్తికరంగా మారింది.
అక్టోబరు ఏడున ఇజ్రాయెల్ లోని పలు ప్రాంతాలపై మెరుపుదాడి చేసిన హమస్ ఉగ్రమూక సుమారు 200 మందిని బందీలుగా చేసుకొని వారిని తమ భూభాగంలోని (గాజా) బంకర్లలో దాచి ఉంచటం తెలిసిందే. ఈ బందీల్లో ఇజ్రాయెల్ తో పాటు వివిధ దేశాలకు చెందిన పౌరులు ఉన్న విషయం తెలిసిందే. దీంతో.. హమస్ ను మట్టుబెట్టేందుకు గాజాను టార్గెట్ చేసింది ఇజ్రాయెల్. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున వైమానిక దాడులకు పాల్పడుతోంది.
అదే సమయంలో గాజాలో బందీలుగా ఉన్న వారిని విడుదల చేసేందుకు వీలుగా గాజా భూభాగంలో గ్రౌండ్ ఆపరేషన్ కు ప్లాన్ చేస్తోంది. ఇలాంటి వేళ.. హమస్ చెరలో ఉన్న బందీల్లో పలువురు సజీవంగా ఉన్నట్లు ఇజ్రాయెల్ పేర్కొంది. హమస్ బందీల్లో 20 మందికి పైగా మైనర్లు.. 10-20 మంది 60 ఏళ్లకు పైన ఉన్న వారిగా పేర్కొంది. హమస్ దాడిలో 1400 మందికి పైగా ఇజ్రాయెల్ పౌరులు మరణించగా.. ఇజ్రాయెల్ దాడుల్లో 4 వేలకు పైగా పాలస్తీనా పౌరులు మరణించారు. ఈ దాడులపై పలు ముస్లిం వర్గాలు బయటకు వచ్చి నిరసన చేస్తున్నాయి.
ఇలాంటి వేళ.. తమ వద్ద బందీలుగా ఉన్న వారిలో ఇద్దరు అమెరికన్లను విడుదల చేస్తూ హమస్ నిర్ణయం తీసుకుంది. మానవాతా కోణంలో అమెరికాకు చెందిన తల్లీకూతుళ్లను తాము విడుదల చేశామని టెలిగ్రామ్ పోస్టులో హమస్ పేర్కొంది. ఈ చర్య ద్వారా అగ్రరాజ్య అనుగ్రహాన్ని హమస్ మూక కోరుతున్నట్లుగా చెబుతున్నారు. బందీలుగా ఉన్న వారిలో ఇద్దరు అమెరికన్లను విడుదల చేయటం ద్వారా.. అగ్రరాజ్యానికి తామిచ్చే ప్రాధాన్యత వేరే అన్న విషయాన్ని చెప్పకనే చెప్పేసిందని చెప్పాలి. రాక్షస మూకగా అభివర్ణించే హమస్ ఉగ్రవాదుల నోట మానవతా కోణం లాంటి మాటలు ఆసక్తికరంగా మారాయి. వ్యూహాత్మకంగానే ఈ చర్యను వారు చేపట్టినట్లుగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.