Begin typing your search above and press return to search.

ముగ్గురు ఖైదీలకు ఒక్కో బందీ... ఊ అంటారా ఊ ఊ అంటారా?

ఈ సమయంలో ఆయా దేశాల ప్రతినిధులు హమాస్‌ తో కొన్ని రోజులుగా జరుపుతున్న చర్చలు ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   22 Nov 2023 4:43 AM GMT
ముగ్గురు ఖైదీలకు ఒక్కో బందీ... ఊ అంటారా  ఊ ఊ అంటారా?
X

ఈ ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయేల్ పై హమాస్ మిలిటెంట్లు భీకర దాడులకు తెగబడిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో దేశంలోకి చొరబడిన హమాస్ ఉగ్రవాదులు... సుమారు 1200 మంది ఇజ్రాయేల్ ప్రజలను ఊచకోత కోశారు. నాటి నుంచి వితౌట్ గ్యాప్ వాయించి వదులుతుంది ఇజ్రాయేల్. దీంతో గాజా గజగజ వణికిపోతుంది. దీంతో... చర్చలకు తాము సిద్ధమని హమాస్ ప్రకటించినట్లు వార్తలొచ్చాయి.

ఈ సమయంలో ఆయా దేశాల ప్రతినిధులు హమాస్‌ తో కొన్ని రోజులుగా జరుపుతున్న చర్చలు ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో గాజా స్ట్రిప్ లో హమాస్‌ మిలిటెంట్ల చెరలో ఉన్న దాదాపు 240 మంది బందీలకు త్వరలోనే విముక్తి లభించే సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు. హమాస్ చెరలో ఉన్న బందీలలో ఇజ్రాయెల్‌ పౌరులతోపాటు విదేశీయులూ ఉన్న సంగతి తెలిసిందే.

దీంతో బందీలుగా ఉన్న వారందరినీ క్షేమంగా విడిపించడానికి ఇజ్రాయెల్, అమెరికా, ఖతార్‌ దేశాలు ప్రయత్నాలు వేగవంతం చేశాయి. దీంతో తమ వద్ద ఉన్న బందీలను విడుదల చేయాలంటే.. ఇజ్రాయెల్‌ సైన్యం తాత్కాలికంగా కాల్పుల విరమణ పాటించాలని, గాజాలో పెద్ద ఎత్తున మానవతా సాయం అందించాలని, ఇజ్రాయెల్‌ జైళ్లలో మగ్గుతున్న పాలస్తీనా ఫైటర్లను విడుదల చేయాలని హమాస్‌ షరతు విధించిందని అంటున్నారు.

దీంతో ఈ విషయాలపై అటు హమాస్, ఇటు ఖతర్ ప్రతినిధులు స్పందించారు. ఇందులో భాగంగా... బందీలకు స్వేచ్ఛ ప్రసాదించే విషయంలో అతి త్వరలో ఒప్పందం కుదిరే అవకాశం ఉందని హమాస్‌ సీనియర్‌ నాయకుడు ఇజ్జత్‌ రిష్క్‌ వెల్లడించారు. ఇజ్రాయెల్‌ జైళ్లలో ఉన్న పాలస్తీనియన్లను విడుదల చేస్తే.. తమవద్ద ఉన్న బందీలను వదిలిపెట్టడానికి సిద్ధమేనని స్పష్టం చేశారు.

ఇజ్రాయెల్‌ తో ఒప్పందానికి హమాస్ చాలా సమీపంలోకి వచ్చిందని.. ఒప్పందం చివరి దశలో ఉందని ఖతార్‌ తెలియజేసింది. అయితే ఈ ఒప్పందానికి ఇజ్రాయేల్ సైన్యం అంగీకరించడం లేదని అంటున్నారు. కానీ... ఈ అంశం రాజకీయంగా తనకు చాలా నష్టం కలిగించే ప్రమాదం ఉండడంతో ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ కాస్త తగ్గినట్లు తెలుస్తుంది.

దీంతో గాజాపై ఐదు రోజులపాటు వైమానిక, భూతల దాడులను ఇజ్రాయెల్‌ నిలిపివేస్తే.. బందీల్లో 50 మంది మహిళలు, చిన్నారులను వదిలేస్తామని హమాస్‌ తొలి షరతు విధించినట్లు చెబుతున్నారు. ఆ తర్వాత ముగ్గురు పాలస్తీనియన్‌ ఖైదీలకు బదులుగా ఒక్క బందీ చొప్పున విడిచిపెడతామని చెబుతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ షరతులపై ఇజ్రాయేల్ ఫైనల్ గా ఊ అంటుందా.. ఊ ఊ అంటుందా అనేది వేచి చూడాలి!