Begin typing your search above and press return to search.

గాజాలో హమాస్ వర్క్ ఫ్రం హోం... ఐరాసకు భారీ షాక్!

అవును... గాజాను ఖాళీ చేయాలనే ఇజ్రాయెల్‌ హెచ్చరికల నేపథ్యంలో ఉత్తర, మధ్య గాజా నుంచి లక్షల మంది పౌరులు దక్షిణ గాజాకు చేరుకున్నారు

By:  Tupaki Desk   |   17 Oct 2023 3:59 AM GMT
గాజాలో హమాస్ వర్క్ ఫ్రం హోం... ఐరాసకు భారీ షాక్!
X

ఇజ్రాయెల్‌ సైన్యం చేస్తున్న భీకర దాడులతో గాజా కుప్పకూలుతోన్న సంగతి తెలిసిందే. గాజాను అష్టదిగ్భందనం చేసిన ఇజ్రాయేల్ దాడితో ఇప్పటికే వందల సంఖ్యలో భవనాలు నేలమట్టం కాగా వేల సంఖ్యలో ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇదే సమయంలో వందల మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో హమాస్ కు ఐక్యరాజ్య సమితి తోడుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆ ఐక్య రాజ్య సమితి(ఐరాస)కే హమాస్ మిలిటెంట్లు షాకిచ్చారు.

అవును... గాజాను ఖాళీ చేయాలనే ఇజ్రాయెల్‌ హెచ్చరికల నేపథ్యంలో ఉత్తర, మధ్య గాజా నుంచి లక్షల మంది పౌరులు దక్షిణ గాజాకు చేరుకున్నారు. ఒకేసారి ఇంతమంది ఇలా తరలిరావడంతో వారికి నీరు, ఆహారం, ఆరోగ్యం విషయంలో ఐక్యరాజ్య సమితి వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ సమయంలో యునైటెడ్‌ నేషన్స్‌ రిలీఫ్‌ అండ్‌ వర్క్స్‌ ఏజెన్సీ (యూ.ఎన్‌.ఆర్‌.డబ్ల్యూ.ఏ) ని ఏర్పాటుచేసి వారికి తగిన సహాయ సహకారాలు అందిస్తోంది ఐరాస.

ఈ నేపథ్యంలో... తాజాగా గాజాలోని ఐక్య రాజ్య సమితి క్యాంపస్ ను హమాస్‌ ఉగ్రవాదులు లూటీ చేశారు. పాలస్తీనా ప్రజల కోసం ఐరాస ఒక క్యాంపస్ ను ఏర్పాటు చేస్తే... అదే క్యాంపస్ ను హమాస్ ఉగ్రవాదులు లూటీ చేయడం గమనార్హం. ఇందులో భాగంగా గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యకర్తల ముసుగులో ఐరాస క్యాంపస్ లోకి చొరబడ్డ హమాస్‌ మూకలు.. ఇంధనం, ఔషధాలు, ఆహారం, దుస్తులు, డబ్బును తస్కరించారని తెలుస్తుంది.

మరోవైపు ఇజ్రాయెల్‌ దాడుల్లో గాజా వ్యాప్తంగా సుమారు 2,750 మంది చనిపోగా 9,700 మంది గాయపడ్డారని తెలుస్తుంది. అటు ఇజ్రాయెల్‌ లోనూ మరణాల సంఖ్య 1,400కు పైగా ఉందని అంటున్నారు. దీంతో మొత్తంగా మరణాలు 4 వేలను దాటాయని నివేదికలు వెల్లడించాయి. గడిచిన 24 గంటల్లోనే సుమారు 455 మంది పాలస్తీనా వాసులు మరణించగా.. 856 మంది గాయపడ్డారు.

ఆ సంగతి అలా ఉంటే... హమాస్ ఉగ్రవాదుల చెరలో బందీలుగా ఉన్న ఇజ్రాయేల్ ప్రజలను విడిపించడం కోసం ఆ దేశం గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సరిహద్దులో మోహరించిన 3,60,000 మంది ఇజ్రాయెల్‌ రిజర్విస్టులు గాజాలో ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. వారు ఏ క్షణమైనా ఆపరేషన్‌ చేపట్టే అవకాశముందని తెలుస్తుంది.

ఇజ్రాయేల్ - గాజా సరిహద్దుల వద్ద పరిస్థితి అలా ఉంటే... మరోవైపు ఇజ్రాయేల్ - లెబనాన్ సరిహద్దుల్లో పరిస్థితి మరోలా ఉంది. దక్షిణ లెబనాన్‌ లోని కఫార్‌ కిలా ప్రాంతంలో రెండు క్షిపణులను ఇజ్రాయెల్‌ డ్రోన్లు కూల్చివేయడంతో.. తాము హెచ్చరికగానే దాడులు చేస్తున్నామని, యుద్ధంలోకి దిగలేదని హెజ్బొల్లా తెలిపింది. దీంతో... ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా లెబనాన్‌ సరిహద్దులోని 28 ప్రాంతాల్లోని తమ పౌరులను ఖాళీ చేయించాలని ఇజ్రాయెల్‌ నిర్ణయించింది.

ఇక హమాస్ కు మద్దతుగా మాట్లాడుతున్న ఇరాన్ తాజాగా ఒక ప్రకటన చేసింది. ఇందులో భాగంగా... గాజాపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులను ఆపితే బందీలను విడుదల చేయడానికి హమాస్‌ సిద్ధంగా ఉందని ప్రకటించింది. అలా కాకుండా గాజాపై ఇలా రోజూ దాడులు జరుగుతుంటే వారి విడుదల అసాధ్యమని హమాస్‌ తెలిపినట్లు ఇరాన్‌ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి నాజర్‌ కనానీ వెల్లడించారు.

దీంతో... హమాస్ కాళ్లబేరానికి వచ్చిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో... గాజాపై భూతల దాడులకు ఇజ్రాయెల్‌ సైన్యం మూడున్నర లక్షలకుపైగా సిద్ధంగా ఉండటంతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో వీరంతా భూతల దాడులకు దిగితే యుద్ధంలోకి తామూ ప్రవేశిస్తామని ఇరాన్ హెచ్చరిస్తుంది.