పార్లమెంట్ లో దుమ్ములేపిన మహిళా ఎంపీ... డ్యాన్స్ వీడియో వైరల్!
ఇటీవల కాలంలో అసెంబ్లీలో తన్నుకోవడాలో, పార్లమెంట్ లో కుమ్ములాటలు కామన్ అయిపోయాయనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 15 Nov 2024 8:23 AM GMTఇటీవల కాలంలో అసెంబ్లీలో తన్నుకోవడాలో, పార్లమెంట్ లో కుమ్ములాటలు కామన్ అయిపోయాయనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతుండగా.. వీటికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతుంటాయి. ఈ సమయంలో తాజాగా న్యూజిలాండ్ పార్లమెంట్ లో ఓ మహిళా ఎంపీ వ్యవహారం ఇప్పుడు వైరల్ గా మారింది.
అవును.. న్యూజిలాండ్ పార్లమెంట్ లో ఎంపీ హనా రాహితి మైపీ క్లార్క్ రచ్చ చేశారు. ఇందులో భాగంగా... పార్లమెంట్ లో సంప్రదాయ మావోరీ తెగకు చెందిన "హాకా" నృత్యం చేశారు. ఈ నృత్యం.. రౌద్రం, పరాక్రమం కలగలిపిన హావభావాలను ప్రదర్శిస్తూ సాగుతుంది. ఆ నృత్యాన్ని పార్లమెంట్ లో ప్రదర్శించారు. దీనికి సంబంధించిన వీడియో హల్ చల్ చేస్తోంది.
వివరాళ్లోకి వెళ్తే... బ్రిటీష్, స్వదేశీ మావోరీల మధ్య 184 ఏళ్ల నాటి ఒప్పందాన్ని పునర్నిర్వచించే స్వదేశీ ఒప్పంద బిల్లును గురువారం న్యూజిలాండ్ పార్లమెంట్ లో అక్కడి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనిపై ఓటింగ్ జరిగింది. ఈ సమయంలో.. 22ఏళ్ల హనా రాహితీతో పాటు మావోరీ తెగకు చెందిన ఎంపీలు ఈ బిల్లు కాపీలను చించేశారు.
ఈ సందర్భంగా వారి సీట్లలో నుంచి లేచి నాట్యం చేస్తూ తమ నిరసనను తెలిపారు. దీంతో ఈ విషయం, దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా కావడంతో పాటు.. ఈ బిల్లుకు సంబందించిన చర్చ బలంగా తెరపైకి వచ్చింది.
వాస్తవానికి... 1840 వైతాంగి ఒప్పందంలో నిర్దేశించిన సూత్రాల ప్రకారం... బ్రిటీష్ వారికి పాలనను అప్పగించినందుకు ప్రతిగా గిరిజనులకు వారి భూములను నిలుకోవడానికి, వారి ప్రయోజనాలను పరిరక్షించడానికి విస్తృత హక్కులను కల్పిస్తూ వాగ్ధానం చేశారు. ఈ సమయంలో ఆ హక్కులను న్యూజిలాండ్ దేశస్తులందరికీ వర్తింపచేయాలని బిల్లులో చేర్చారు.
దీంతో... ఈ బిల్లు కారణంగా జాతి వైషమ్యాలకు, రాజ్యాంగ విధ్వంసానికీ ముప్పు కలుగుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో.. దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. 5.3 మిలియన్ల న్యూజిలాండ్ జనాభాలో 20శాతం మంది వరకూ మావోరీలు ఉన్నారు. వారంతా ఈ బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు.
కాగా... గత ఏడాది పార్లమెంట్ లో తన తొలి ప్రసంగం సందర్భంగా తన మాతృభాష మావోరీలో పార్లమెంట్ దిక్కులు పిక్కటిల్లేలా, చేతులు సంజ్ఞలు చేస్తూ ఈ యంగ్ ఎంపీ హనా రాహితి మైపీ క్లార్క్ గంభీరంగా ప్రసంగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి నెట్టింట వైరల్ గా మారారు!