Begin typing your search above and press return to search.

హస్తం చేతికి గాలిపటం.. ఎందుకిలా?

అంతేకాదు.. అక్బరుద్దీన్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వానికి తమ మద్దతు ఇచ్చామని.. కొన్నిసార్లు తప్పు పట్టామని.. మొత్తంగా వారితో కలిసి ప్రయాణించినట్లు చెప్పారు.

By:  Tupaki Desk   |   18 Dec 2023 3:00 AM GMT
హస్తం చేతికి గాలిపటం.. ఎందుకిలా?
X

అనుకున్నదే జరుగుతోంది. అంచనాలే నిజమవుతున్నాయి. ఇంతకాలం గులాబీ కారులో తిరిగిన గాలిపటం.. ఇప్పుడు హస్తం చేతిలోకి వచ్చేసినట్లే కనిపిస్తోంది. ఆనవాయితీ మిస్ కాకుండా అధికార పక్షంతో కలిసి ఉండే మజ్లిస్ పార్టీ.. రేవంత్ ప్రభుత్వంలోనూ అదే అలవాటును ఫాలో అయ్యేట్లుగా కనిపిస్తుంది. తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ విషయం స్పష్టమైంది. అంతేకాదు.. అక్బరుద్దీన్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వానికి తమ మద్దతు ఇచ్చామని.. కొన్నిసార్లు తప్పు పట్టామని.. మొత్తంగా వారితో కలిసి ప్రయాణించినట్లు చెప్పారు.

అదే రీతిలో ప్రస్తుతం రేవంత్ సర్కారుతోనూ అదే తరహాలో ప్రయాణిస్తామని చెప్పారు. ప్రభుత్వం తీసుకునే మంచి నిర్ణయాలతోతాము కలిసి నడుస్తామని చెప్పటం చూస్తే.. హస్తంతో దోస్తీ పక్కా అయినట్లుగా చెప్పక తప్పదు. కొత్త అసెంబ్లీ కొలువు తీరిందో.. సభ్యులను ప్రమాణస్వీకారం చేయటానికి ప్రోటెం స్పీకర్ ఎంపికను అక్బరుద్దీన్ ను చేయటంతోనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. నిజానికి.. విపక్షానికి చెందిన హరీశ్ ఉన్నప్పటికీ.. ఆయన్ను వదిలేసి అక్బరుద్దీన్ ను ఎంపిక చేయటాన్ని కొందరు తప్పు పట్టారు. కానీ.. వ్యూహాత్మకంగా చూస్తే.. రేవంత్ సర్కారుకు ఉన్న బలం అత్తెసరు మాత్రమే. ఇలాంటివేళ.. మజ్లిస్ కు ఉన్న ఏడుగురు ఎమ్మెల్యేల బలం వారికి కొండంత అండను ఇస్తుందని చెప్పాలి.

ఈ విషయాన్ని గుర్తించిన రేవంత్.. మజ్లిస్ ను అప్రకటిత మిత్రపక్షంగా వ్యవహరించేలా ఒక అడుగు ముందుకు వేశారని చెప్పాలి. ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ను ఎంపిక చేయటం ద్వారా.. స్నేహహస్తాన్ని చాచిన రేవంత్ కు సానుకూల స్పందన లభించిందని చెప్పాలి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు పలికే సంరద్భంగా సభలో మాట్లాడిన అక్బరుద్దీన్.. కాంగ్రెస్ ప్రభుత్వానికి తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేయటం.. దానికి ప్రతిగా సీఎం రేవంత్ రెడ్డి సైతం తన ప్రసంగంలో మజ్లిస్ ను తమ మిత్రపక్షంగా పేర్కొనటం చూస్తే.. రానున్న రోజుల్లో ఈ బలం మరింత బలోపేతం కావటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మొదట్నించి కూడా మజ్లిస్ ఎవరు అధికారంలోఉంటే వారితో కలిసి ఉండే పాలసీని ఫాలో అవుతూ ఉంటుంది. చంద్రబాబు హయాంలోనూ మద్దతు సాగిందని చెప్పాలి. మధ్యలో కొంత ఇబ్బందికర వాతావరణం ఉన్నప్పటికీ.. వైఎస్ హయాంలో మజ్లిస్ తో దోస్తానా ఎక్కువగా ఉండేది. వైఎస్ మరణం తర్వాత రోశయ్య ముఖ్యమంత్రి అయిన వేళ.. స్టేటస్ కో మొయింటైన్ అయినప్పటికీ.. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో మాత్రం అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.

మజ్లిస్ అధినేత అసద్.. ఆయన సోదరుడు అక్బరుద్దీన్ ఇద్దరిని రోజుల వ్యవధిలో జైలుకు పంపిన ఉదంతంతో కాంగ్రెస్ - మజ్లిస్ మధ్య పూడ్చలేని అగాధం ఏర్పడింది. అది అలానే కొనసాగింది. రాష్ట్ర విభజన జరగటం.. గులాబీ పార్టీ అధికారంలోకి రావటంతో మజ్లిస్ వారికి సహజసిద్ధ మిత్రపక్షంగా మారారు. రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తర్వాత కాంగ్రెస్ చేతికి అధికారం రావటం.. డెవలప్ మెంట్ యాక్టివిటీస్ తో పాటు.. ఇతర అంశాల విషయంలో ప్రభుత్వ మద్దతు అవసరమైన వేళ.. రేవంత్ సర్కారుతో స్నేహానికి సిద్ధమయ్యారు. అదే సమయంలో తమకు బలం అంతగా లేని నేపథ్యంలో మజ్లిస్ తో కలిసి నడిచేందుకు రేవంత్ సైతం రెఢీ అయ్యారు. ఉభయకుశలోపరిగా మారిన ఈ వ్యవహారం ఇప్పుడు అంతకంతకూ ముందుకు వెళుతున్న పరిస్థితి. రానున్న రోజుల్లో మరింత ఓపెన్ గా ఇచ్చి పుచ్చుకునే ధోరణి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.