Begin typing your search above and press return to search.

కంగన, రాహుల్‌.. మధ్యలో హనుమంతు!

ఆమె చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ నేతలు మండిపడుతున్నారు.

By:  Tupaki Desk   |   29 Aug 2024 2:16 PM GMT
కంగన, రాహుల్‌.. మధ్యలో హనుమంతు!
X

కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నేత, లోక్‌ సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ చెత్తగా మాట్లాడతారని, డ్రగ్స్‌ తీసుకుంటారంటూ ప్రముఖ హీరోయిన్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆమె చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ నేతలు మండిపడుతున్నారు.

ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత వీహెచ్‌ హనుమంతరావు.. కంగనా రనౌత్‌ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పబ్లిసిటీ కోసం, పాపులర్‌ కావడానికి రాహుల్‌ గాంధీపై విమర్శలు చేస్తోందని ధ్వజమెత్తారు. అంతేకాకుండా ఎలాంటి ఆధారాలు లేకుండా రాహుల్‌ గాంధీ డ్రగ్స్‌ తీసుకుంటారంటూ అసత్య ఆరోపణలు చేస్తున్న కంగనాపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్‌ లోని అంబర్‌ పేట పోలీసులకు వీహెచ్‌ ఫిర్యాదు చేశారు.

కంగనా రనౌత్‌ వ్యాఖ్యలను ఖండించిన వీహెచ్‌... దేశవ్యాప్తంగా పాపులర్‌ కావడం కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ఆమె ఏదైనా ఉంటే పార్లమెంట్‌లో మాట్లాడాలని హితవు పలికారు. రాహుల్‌ పై చేసిన వ్యాఖ్యలకు ఆమె వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని వీహెచ్‌ హనుమంతరావు డిమాండ్‌ చేశారు. ఒక్క రాహుల్‌ గాంధీనే కాకుండా బడుగు, బలహీన వర్గాల ప్రజలందరినీ కంగన అవమానించిందని నిప్పులు చెరిగారు.

కంగనా రనౌత్‌ ను బీజేపీ కంట్రోల్‌ లో పెట్టాలని వీహెచ్‌ డిమాండ్‌ చేశారు. ఆమె రాహుల్‌ గాంధీని తిట్టి తప్పు చేసిందన్నారు. ఆమె తన మాటలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రాహుల్‌ మీద మాట్లాడితే పాపులర్‌ కావచ్చని కంగన భావిస్తోందని ఎద్దేవా చేశారు.

రాహుల్‌ గాంధీ పై కంగనా చేసిన వ్యాఖ్యలు తమకు బాధను కలిగించాయన్నారు. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు. ఎవరి గురించి.. ఏం మాట్లాడాలో ఆమె తెలుసుకుంటే మంచిదని హెచ్చరించారు.

రాహుల్‌ గాంధీ గురించి మాట్లాడితే క్రమశిక్షణ ఉల్లంఘన కాదా..? అని వీహెచ్‌ నిలదీశారు. కంగన సినిమా జీవితంలో ఎలా ఉన్నా.. ఆమెకు రాజకీయాలు ఒంట పట్టలేదన్నారు. రాహుల్‌ గాంధీకి కంగనా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

కాగా హైదరాబాద్‌ మహానగరంలో చెరువులు ఇతర జలవనరుల పరిరక్షణే ధ్యేయంగా రేవంత్‌ సర్కార్‌ తీసుకువచ్చిన హైడ్రా వ్యవస్థ పనితీరును వీహెచ్‌ హనుమంతరావు ప్రశంసించారు. హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చక్కగా పని చేస్తున్నారని కొనియాడారు. అయితే ఈ క్రమంలో ప్రభుత్వం పేదల ఇళ్లు కూల్చాల్సి వస్తే.. వారికి వేరే చోట డబుల్‌ బెడ్రూం ఇళ్లు కేటాయించాలని విన్నవించారు. సీఎం రేవంత్‌ తన కుటుంబ సభ్యుల నివాసాల్లో కూడా అక్రమాలు ఉన్నాయని తేలినా.. కూల్చేయాలని చెప్పడం ముదావహమని కొనియాడారు.