Begin typing your search above and press return to search.

'వీహెచ్' పెద్ద ప్లాన్లే వేస్తున్నాడే.. కాంగ్రెస్ నే షేక్ చేశాడుగా!

వీహెచ్ అసమ్మతి రాజేస్తున్నాడా? కాపులను ఏకం చేసి పోరాటం చేస్తున్నాడా? అన్న విషయాలు హాట్ టాపిక్ గా మారాయి.

By:  Tupaki Desk   |   2 March 2025 9:56 AM IST
వీహెచ్ పెద్ద ప్లాన్లే వేస్తున్నాడే.. కాంగ్రెస్ నే షేక్ చేశాడుగా!
X

ఎనిమిది పదుల వయసు.. ఈ వయసులో ఏ నేత అయినా కృష్ణా రామా అనుకుంటూ వృద్ధాప్య జీవితాన్ని వెళ్లదీస్తారు. రాజకీయాల్లో రిటైర్ అయిపోయి తన అనుభవాన్ని తన వారసులకు పంచుతుంటారు. ఆయన పని కూడా అయిపోయిందనుకున్నారు. కానీ కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు అందరికీ షాక్ ఇస్తున్నాడు. ఇటీవల సడెన్ గా ఏపీ సీఎం చంద్రబాబును కలవడం.. తర్వాత తెలంగాణలో తన మున్నురు కాపు కులం నేతలను సీక్రెట్ గా మీటింగ్ పెట్టి పెద్ద ప్లానింగ్ చేయడం చూసి కాంగ్రెస్ వర్గాల్లో అంతా షాక్ అయిన పరిస్థితి నెలకొంది. వీహెచ్ అసమ్మతి రాజేస్తున్నాడా? కాపులను ఏకం చేసి పోరాటం చేస్తున్నాడా? అన్న విషయాలు హాట్ టాపిక్ గా మారాయి.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు (వీహెచ్) తన రాజకీయ భవిష్యత్తుపై అందరి అంచనాలను తలకిందులు చేస్తూ మళ్ళీ చురుకుగా వ్యవహరిస్తున్నారు. వయసు పైబడిన కారణంగా ఆయన ఇకపై యాక్టివ్ గా లేకపోవచ్చని భావించిన వారి ఊహలకు అందనంతగా ఆయన శనివారం తన ఇంటిలో నిర్వహించిన సమావేశం ద్వారా పెద్ద రాజకీయ చర్చకు తెరలేపారు.

- మున్నూరు కాపుల ఐక్యత కోసం సమావేశం

వీహెచ్ తన సామాజిక వర్గమైన మున్నూరు కాపు నాయకులను సమావేశానికి పిలిపించగా, వివిధ పార్టీలకు చెందిన నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కాంగ్రెస్ తో పాటు బీఆర్‌ఎస్, బీజేపీకి చెందిన మున్నూరు కాపు నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా మున్నూరు కాపుల ఐక్యతపై దృష్టి సారించడంతో పాటు, వారికి రాజకీయంగా సముచిత ప్రాతినిధ్యం లభించేలా చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

-ఒకతాటి మీదకు అన్ని పార్టీల నేతలు

సమావేశంలో మున్నూరు కాపుల ఐక్యత కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కమిటీలో అన్ని పార్టీలకు చెందిన మున్నూరు కాపు నేతలు భాగస్వామ్యం కలిగి ఉంటారు. అంతేకాకుండా, కుల గణనపై కూడా చర్చించగా, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రేవంత్ సర్కారును సన్మానించాలన్న ప్రతిపాదన తీసుకొచ్చారు. అయితే, మున్నూరు కాపులకు ప్రాతినిధ్యం లేని ప్రస్తుత మంత్రివర్గాన్ని గమనించి, నేతలు రేవంత్ సర్కారు మంత్రి పదవి ఇస్తే మాత్రమే సన్మానిద్దామని నిర్ణయించుకున్నారు.

- ఎమ్మెల్సీ కోటాలో మున్నూరు కాపులకు ప్రాధాన్యం

త్వరలో జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మున్నూరు కాపులకో సీటు కేటాయించాలని సమావేశంలో డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానంలో మంచి పలుకుబడి ఉన్న వీహెచ్, ఈ సమావేశం ద్వారా మళ్ళీ క్రియాశీలకంగా మారాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో మున్నూరు కాపుల కోటాలో ఎమ్మెల్సీ సీటు వీహెచ్‌కి ఇవ్వడంతో పాటు, మంత్రివర్గంలో కూడా ఆయనకు స్థానం కల్పించాలని మున్నూరు కాపు నేతలు తీర్మానించారు.

- వి.హనుమంతరావు వ్యూహం ఫలిస్తుందా?

తన సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందన్న భావనను నొక్కి చెబుతూ, తన పేరును నేతల ద్వారా తెరపైకి తీసుకురావడంలో వీహెచ్ సక్సెస్ అయ్యారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆయన వ్యూహం ఎంతవరకు ఫలిస్తుంది, కాంగ్రెస్ అధిష్ఠానం దీనిపై ఎలా స్పందిస్తుంది అన్నది చూడాల్సిన విషయం. ఏది జరిగినా, వీహెచ్ మళ్ళీ తన రాజకీయ ప్రయాణంలో కీలక మలుపు తిరిగినట్టే.