Begin typing your search above and press return to search.

"రివేంజ్ పోర్న్" కేసు... రూ.9900 కోట్లు జరిమానా!

అవును... లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తికి తాజాగా దిమ్మతిరిగి బొమ్మకనిపించే స్థాయిలో జరిమానా విధించింది కోర్టు.

By:  Tupaki Desk   |   16 Aug 2023 1:16 PM GMT
రివేంజ్ పోర్న్ కేసు... రూ.9900 కోట్లు జరిమానా!
X

లైంగిక వేధింపుల కేసులో ఇదొక సంచలనమే చెప్పుకోవాలి. ప్రైవేటు ఫోటోలు చూపిస్తూ బెదిరింపులకు పాల్పడటం.. లొంగకపోతే ఆన్ లైన్ లో పెట్టి అవమానాలకు గురిచేయడం వంటివి ఈ మధ్యకాలంలో ఎక్కువైపోతున్నాయి. ఈ సమయంలో తాజాగా ఇలా వేధించినందుకు గానూ నిందితుడికి 1.2 బిలియన్‌ డాలర్లు జరిమానా విధించింది కోర్టు!

అవును... లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తికి తాజాగా దిమ్మతిరిగి బొమ్మకనిపించే స్థాయిలో జరిమానా విధించింది కోర్టు. భాగస్వామితో విడిపోయిన తర్వాత ఆమె ప్రైవేటు ఫొటోలను ఆన్‌ లైన్‌ లో పెట్టి అవమానాలకు గురిచేసినందుకు కోర్టు ఈ మేరకు శిక్ష విధించింది.

వివరాల్లోకి వెళ్తే... అమెరికాకు చెందిన ఓ మహిళ జమాల్‌ జాక్సన్‌ అనే వ్యక్తితో 2016 నుంచి కలిసి జీవించింది. షికాగోలో కొంతకాలం గడిపిన తర్వాత అక్టోబర్‌ 2021న పరస్పర అంగీకారంతో వారిద్దరూ విడిపోయారు. అనంతరం అతడి నుంచి ఆ మహిళకు వేధింపులు మొదలయ్యాయి.

ఈ సమయంలో మరింత బరితెగించిన ఆ వ్యక్తి ఆమె ఇంట్లోని సీసీ కెమెరాలు, మొబైల్‌, ఈ-మెయిల్‌ నుంచి వ్యక్తిగత ఫొటోలను సేకరించి.. ఆమె అనుమతి లేకుండా సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనికోసం మొక నకిలీ ఖాతాలను క్రియేట్ చేశాడు. ఇదే సమయంలో గతంలో ఆమెతో సన్నిహితంగా ఉన్నప్పుడు తీసుకున్న ఫొటోలను బయటపెట్టాడు.

వాటిలో కొన్ని ఫోటోలను పోర్న్ వెబ్ సైట్స్ లో పెట్టిన ఆ వ్యక్తి... వాటికి సంబంధించిన లింకులను అమ్మాయి స్నేహితులు, కుటుంబ సభ్యులకూ పంపించడం మొదలుపెట్టాడు.

దీంతో విసుగు చెందిన ఆ మహిళ చివరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై 2022 ఏప్రిల్‌ లో టెక్సాస్‌ లోని హ్యారీస్‌ కౌంటీ సివిల్‌ కోర్టులో దావా వేశారు. ఈ సమయంలో ఇరుపక్షాల వాదనలూ విన్న అనంతరం కోర్టు సంచలన తీర్పు వెలువరింది.

ఇందులో భాగంగా... మహిళను మానసికంగా వేధించినందుకు 200 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.1600కోట్లు) తోపాటు.. ఆమెకు నష్టాన్ని కలిగించినందుకు శిక్షగా మరో బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.8300 కోట్లు) చెల్లించాలని ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది. అంటే మొత్తంగా సుమారు రూ.9900 కోట్లు బాధిత మహిళకు చెల్లించాలని తీర్పు ఇచ్చింది!

కాగా... అమెరికాలో అనేక రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్న చట్టాల ప్రకారం.. ఓ వ్యక్తి అంగీకారం లేకుండా వారి వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను ఇంటర్నెట్‌ లో షేర్‌ చేయడం నేరం. అక్కడ ఇటువంటి చర్యలను "రివెంజ్‌ పోర్న్‌"గా వ్యవహరిస్తారు.