Begin typing your search above and press return to search.

కెనడా-భారత్.. రగడ.. రగడ.. ఏం జరుగుతోంది అసలు?

చూస్తూ ఉంటే.. కెనడా-భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు అత్యంత తీవ్రమైన సంక్షోభం లోకి జారినట్లే కనిపిస్తోంది

By:  Tupaki Desk   |   19 Sep 2023 6:50 AM GMT
కెనడా-భారత్.. రగడ.. రగడ.. ఏం జరుగుతోంది అసలు?
X

చూస్తూ ఉంటే.. కెనడా-భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు అత్యంత తీవ్రమైన సంక్షోభం లోకి జారినట్లే కనిపిస్తోంది. ప్రశాంత దేశమైన కెనడాతో భారత్ కు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవరూ ఊహించకపోవచ్చు. వాస్తవానికి కెనడాతో భారత్ కు మొదటినుంచి సత్సంబంధాలే ఉన్నాయి. మన దేశ విద్యార్థులకు అమెరికా తర్వాత చదువులకు గమ్యస్థానం కెనడానే.

ఎందుకొచ్చిందీ గొడవ..?

కెనడాలో సిక్కులు ఎక్కువ. 50 ఏళ్ల కిందటే భారత్ నుంచి వారు వలస వెళ్లడం ప్రారంభించారు. అసలే పెద్ద దేశం.. తక్కువ జనాభా ఉండే దేశం కావడంతో కెనడా పౌరసత్వం సులువుగా దక్కంది. కెనడాలో సిక్కులు ఇప్పుడు రాజకీయంగా అత్యంత ప్రభావశీల శక్తులు. దీనికితోడు వ్యాపార రంగంలోనూ రాణిస్తున్నారు. సహజంగానే ఇటీవల కాలంలో ఖలిస్థానీ వాదం కెనడాలో ఎక్కువగా వినిపిస్తోంది. ఇదే రెండు దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీస్తోంది.

మూడు నెలల కిందటి జరిగిన హత్యతో..

జూన్ 15న ఖలిస్థానీ సానుభూతిపరుడు, ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు గురయ్యాడు. 45 ఏళ్ల నిజ్జర్.. భారత్ పట్ల తీవ్ర వ్యతిరేకంగా ఉండేవాడు. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది కూడా. నిషేధిత ఖలిస్థాన్‌ టైగర్‌ ఫోర్స్‌ చీఫ్‌, 'గురునానక్‌ సిక్‌ గురుద్వారా సాహిబ్‌' అధిపతి ఇతడు. నిజ్జర్ పై రూ.10లక్షల రివార్డు ఉంది. అలాంటి వ్యక్తి హత్య వెనుక భారత్ ఏజెంట్ల పాత్ర ఉన్నట్లు నమ్ముతున్నామని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. ఓ దేశం పట్ల మరో దేశం ప్రధాని ఇలా వ్యాఖ్యానించడం అంటే అసాధారణమే. అంతేగాక ట్రూడో కెనడాలోని భారత దౌత్యకార్యాలయంలోని రీసెర్చి అండ్‌ ఎనాలసిస్‌ వింగ్‌ అధిపతిని బహిష్కరించారు. కాగా, నిజ్జర్.. నాడు బ్రిటిష్‌ కొలంబియాలోని సర్రే ప్రాంతంలో గురుద్వారా సాహిబ్‌ ప్రాంగణంలో గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు.

భారత్ నుంచి వెళ్లిన కొన్ని రోజులకే..

ఈ నెల 9, 10 తేదీల్లో జి20 సమావేశాలకు భారత్ వచ్చిన ట్రూడో విమానం విషయంలో ఇబ్బంది ఎదుర్కొని 12వ తేదీన కెనడా వెళ్లారు. అంటే దాదాపు నాలుగు రోజులు భారత్ లో ఉండిపోయారు. 13వ తేదీకి కెనడా చేరారు. అయితే, సోమవారం నిజ్జర్‌ హత్యపై పార్లమెంట్‌ దిగువ సభలో మాట్లాడారు. భారత్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ''కెనడా పౌరుడు హర్‌దీప్‌ సింగ్ నిజ్జర్‌ హత్య వెనుక భారత ప్రభుత్వ ఏజెంట్ల పాత్ర ఉండొచ్చనేందుకు విశ్వసనీయమైన ఆరోపణలు వచ్చాయి.'' అని పేర్కొన్నారు. తమ గడ్డపై తమ దేశ పౌరుడి హత్యలో విదేశీ ప్రభుత్వాల జోక్యాన్ని సహించం. అది మా సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమే. ఈ ఘటనలో దర్యాప్తునకు భారత ప్రభుత్వం సహకరించాలని కోరుతున్నామని కూడా అన్నారు.

నిజ్జర్ కెనడా పౌరుడు

హర్దీప్ సింగ్ నిజ్జర్ కెనడా పౌరుడు. దీంతోనే ఆ దేశ ప్రభుత్వం తీవ్రంగా స్పందించినట్లు తెలుస్తోంది. ట్రూడో పార్లంమెటులో చేసిన ప్రకటనలోనూ ఇదే విషయం పేర్కొన్నారు. కాగా, నిజ్జర్ హత్యపై కొన్ని వారాలుగా కెనడా భద్రతా ఏజెన్సీలు వివరాలను సేకరిస్తున్నాయి. తాజాగా వివరాలు సమర్పించడంతో ప్రభుత్వం కెనడాలోని భారత దౌత్యకార్యాలయ ఇంటెలిజెన్స్‌ విభాగం అధిపతి పవన్‌ కుమార్‌ రాయ్‌ను బహిష్కరించారు. నిజ్జర్ హత్యకు సంబంధించి ట్రూడో వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. అసంబద్ద, ప్రేరేపిత ఆరోపణలుగా పేర్కొంది.

భారత్ గట్టి కౌంటర్

కెనడా చర్యకు ప్రతి చర్య అన్నట్లుగా.. భారత్ గట్టిగా స్పందించింది. భారత్ లోని కెనడా సీనియర్ దౌత్యవేత్తపై వేటువేసింది. కెనడా హై కమిషనర్ కామెరూన్ మాకయేవ్ పై వేటు వేసింది. ఐదు రోజుల్లో దేశాన్ని వీడి వెళ్లాలని ఆదేశించింది.