హార్దిక్ పాండ్యా వాచ్ ఖరీదు 7 కోట్లు?
గాళ్స్ తో డేటింగ్ విషయంలో స్థబ్ధతతో ఉన్నాడు. అతడిపై గాసిప్పులు వస్తున్నా.. ప్రస్తుతం ఆటపైనే దృష్టి సారించినట్టు కనిపిస్తున్నాడు.
By: Tupaki Desk | 24 Feb 2025 12:47 PM GMTమైదానంలో బంతితో నిప్పులు చెరగడంలోనే కాదు.. ఖరీదైన యాక్సెసరీస్ ని ధరించి గాళ్స్ గుండెల్లో మంటలు పెట్టడంలోను హార్థిక్ పాండ్య పనితనం ఎప్పుడూ చర్చకు వస్తుంది. ఇప్పుడు అతడు ధరించిన ఓ ఖరీదైన బ్రాండెడ్ వాచ్ యువతరంలో హాట్ టాపిగ్గా మారింది. భార్య స్టాంకోవిక్ నుంచి విడిపోయిన తర్వాతా హార్థిక్ గందరగోళం నుంచి బయటపడేందుకు ఆటపై దృష్టి సారించాడు. అతడు రెట్టించిన ఉత్సాహంతో మైదానంలో చెలరేగుతున్నాడు. గాళ్స్ తో డేటింగ్ విషయంలో స్థబ్ధతతో ఉన్నాడు. అతడిపై గాసిప్పులు వస్తున్నా.. ప్రస్తుతం ఆటపైనే దృష్టి సారించినట్టు కనిపిస్తున్నాడు.
ఇంతలోనే ఇప్పుడు అతడు ధరించిన ఖరీదైన ఇంటర్నేషనల్ బ్రాండ్ వాచ్ అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షించింది. లక్ష వాట్ల మెరుపులాగా వికెట్ మీదికి దూసుకొచ్చే అతడి బంతి వాలును చూడటం కంటే, ఆ బంతిని డెలివరీ చేసే మణికట్టుని, ఆ మణికట్టును అలంకరించిన ఖరీదైన వాచ్‌ని గమనించేందుకే నిన్నటి ఇండియా-పాక్ మ్యాచ్ లో ఆడియెన్ ఎక్కువ ఆసక్తిని కనబరిచారు. దీనిని బట్టి ఆ వాచ్ ఎంత ఆకర్షణీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
కేవలం ఆకర్షణలోనే కాదు, ఆ వాచ్ ధర కూడా గుండెల్లో మంటలు పుట్టించేలా ఉంది. ప్రఖ్యాత ఇంటర్నేషనల్ బ్రాండ్ `రిచర్డ్ మిల్లె` నుంచి RM 27-02 వాచ్ ధరించిన హార్థిక్ పక్కా జెంటిల్‌మన్ లా కనిపించాడు. ఈ వాచ్ ధర (డాలర్లలో) $8,00,000. భారతీయ కరెన్సీలో సుమారు రూ.6.92 కోట్లు. ఇది పరిమిత ఎడిషన్ కళాఖండం. ఈ అరుదైన టైమ్‌పీస్‌ని టెన్నిస్ లెజెండ్ రాఫెల్ నాదల్ కోసం తొలిగా రూపొందించారు. ఈ వాచ్ తయారీ కోసం వినియోగించిన కార్బన్ టిపిటి యూనిబాడీ బేస్‌ప్లేట్ చాలా పాపులారిటీని కలిగి ఉంది. ఈ కార్బన్ ప్లేట్ తీవ్రమైన షాక్ నిరోధకత, మన్నికతో ఆకర్షణీయమైనది. ఇప్పటివరకూ ఇలాంటి వాచ్‌లను కేవలం 50 పీస్‌లు మాత్రమే తయారు చేయగా, దీనికోసం గ్రేడ్ 5 టైటానియం బ్రిడ్జ్‌లు, అస్థిపంజర కదలికతో గడియారం ముల్లు.. క్వార్ట్జ్ టిపిటి కేసును రూపొందించారు. డయల్ వైట్ అండ్ బ్లాక్ లుక్‌తో ఆకట్టుకుంటుంది. 70 గంటల పవర్ రిజర్వ్, యాంటీ గ్లేర్ నీలిరంగు క్రిస్టల్‌తో ఈ లగ్జరీ వాచ్ ప్రపంచంలో సాంకేతిక అద్భుతం అని చెబుతారు.
|
ఛాంపియన్స్ ట్రోఫీ- 2025 లో పాండ్యా ధరించిన బ్రాండెడ్ వాచ్‌ని అభిమానులు పదే పదే తరచి ఆసక్తిగా చూసారు. అతడు పాక్ బ్యాట్స్ మన్ బాబర్ అజామ్ (23) ను దూకుడుగా పెవిలియన్‌కు పంపాడు. బంతితో ప్రదర్శననే కాదు, మణికట్టును తిప్పుతూ వాచ్ సొగసును ప్రదర్శించాడు. హార్థిక్ 8 ఓవర్లలో కేవలం 31 పరుగులకు 2 వికెట్లు పడగొట్టాడు.