Begin typing your search above and press return to search.

న్యూటన్ కంటే ముందే వేదాల్లో గ్రావిటీ!

న్యూటన్ గురుత్వాకర్షణ శక్తి సూత్రాన్ని కనుగొనడంతో భౌతికశాస్త్ర రంగంలో పెను మార్పులు సంభవించాయి.

By:  Tupaki Desk   |   6 March 2025 12:30 PM IST
న్యూటన్ కంటే ముందే వేదాల్లో గ్రావిటీ!
X

న్యూటన్ గురుత్వాకర్షణ శక్తి సూత్రాన్ని కనుగొనడంతో భౌతికశాస్త్ర రంగంలో పెను మార్పులు సంభవించాయి. అప్పటిదాక ఓ లెక్క..న్యూటన్ గురుత్వాకర్షణ సూత్రాన్ని కనుగొన్న తర్వాత ఒక లెక్క అన్నట్టుగా సైన్సు లో పరిశోధనలు పెరిగాయి. న్యూటన్ సూత్రాలను బట్టే ఇప్పటికీ సైన్సు పరిశోధనలు కొనసాగుతున్నాయి. భౌతిక శాస్త్ర విద్యార్థులకు న్యూటన్ గమన సూత్రాలు, గురుత్వాకర్షణ సిద్ధాంతం భగవద్గీతలాంటివని చెప్పవచ్చు.

తాజాగా న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతంపై రాజస్థాన్ గవర్నర్ హరిబాపు బాగ్డే ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. జైపూర్ లోని ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీలో జరిగిన స్నాతకోత్సవంలో బాగ్డే ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..1687లో గురుత్వాకర్షణ సిద్ధాంతం గుర్తించడానికి చాలా పూర్వమే భారతీయ వేదాల్లో దాని ప్రస్తావన ఉందని చెప్పారు.

పురాతన కాలం నుంచి భారత దేశం విజ్ఞాన కేంద్రంగా ఉందన్నారు. నలంద యూనివర్సిటీ వంటి విద్య సంస్థలకు దేశవిదేశాల నుంచి విద్యార్థులు వచ్చేవారనన్నారు. డెసిమల్(దశాంశ) వ్యవస్థను భారత దేశమే ప్రపంచానికి అందించిందన్నారు. గురుత్వాకర్షణ సిద్దాంతాన్ని న్యూటన్ చాలా ఆలస్యంగా చెప్పారని, అంతకంటే చాలా పూర్వమే మన వేదాల్లో గురుత్వాకర్షణను ప్రస్తావించినట్టు తెలిపారు. ఇలా చాలా అంశాలు మన వేదాలు, చరిత్ర పుస్తకాలు, రుగ్వేదాల్లో ఉన్నాయని చెప్పుకొచ్చారు.

మన జ్ఞానాన్ని అణచివేసేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయని బాగ్డే తెలిపారు. భారత పురాతన విజ్ఞానాన్ని చెరిపేసేందుకు కొంత మంది కుట్రలు చేశారని, 1190ల్లో నలంద లైబ్రరీ దహనమే ఇందుకు ఉదాహరణ అని అన్నారు.

కాగా, గవర్నర్ హరిబాపు బాగ్డే వ్యాఖ్యలను పలువురు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. భారతీయ విజ్ఞాన ఔన్నత్యాన్ని చాటిచెప్పారని కొనియాడుతున్నారు. భారతీయ పురాతన గ్రంథాల్లో ఎంతో విలువైన సమాచారం ఉందని..దాన్ని వెలికితీయాలని అంటున్నారు. ఎన్నో సైన్స్ కు సంబంధించిన విషయాలు కూడా భారతీయ మత గ్రంథాల్లో ఉందని చెబుతున్నారు. పాశ్చాత్యులు కనిపెట్టకముందే ఎన్నో శాస్త్రీయ సిద్ధాంతాలను భారతీయులు ప్రపంచానికి అందించారని, కానీ వాటికి తగిన ప్రచారం కల్పించలేదన్నారు. ఇదెలా ఉండగా కొందరు మాత్రం పాత సిద్ధాంతాలకు కొత్త భాష్యాలు చెప్పవద్దని కామెంట్స్ చేస్తున్నారు. మన సిద్ధాంతాలు మనకు ఎంతో గొప్పవో, ఇతరులకు వారి సిద్ధాంతాలు అంతే గొప్ప అని అంటున్నారు.