పిఠాపురం గురించి జనసేన ఎమ్మెల్సీ సంచలన ప్రకటన
దాంతో ఏపీలో దీంతో ఏపీలో ఏ నియోజకవర్గానికి లేని పొలిటికల్ గ్లామర్ పిఠాపురానికి వచ్చేసింది.
By: Tupaki Desk | 1 Aug 2024 12:22 PM GMTపిఠాపురం అంటే ఇపుడు పొలిటికల్ గా వెరీ ఫ్యామస్ అని చెప్పాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలిచిన సీటు అది. ఆ మీదట పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా కూడా స్థానం అందుకుని కీలక బాధ్యతలు స్వీకరిస్తున్నారు. దాంతో ఏపీలో దీంతో ఏపీలో ఏ నియోజకవర్గానికి లేని పొలిటికల్ గ్లామర్ పిఠాపురానికి వచ్చేసింది.
పిఠాపురాన్ని దేశంలోనే అగ్ర స్థానంలో నిలబెడతామని జనసేన నేతలు ఎన్నికల వేళ చెప్పారు. ఇపుడు దానికి అనుగుణంగా పవన్ కళ్యాణ్ పిఠాపురంలోనే తన నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో అభివృద్ధి కార్యక్రమాల కోసం ఒక యాక్షన్ ప్లాన్ ని తయారు చేస్తున్నారు.
పవన్ తో పాటుగా పిఠాపురం బాధ్యతలు చూసుకునేందుకు జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో నాగబాబు ఉన్నారు. కాకినాడ జనసేన ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కూడా ఆ మధ్య దాకా పిఠాపురం పార్టీ ఇంచార్జిగా చేసినవారే. దాంతో పార్టీ అధినేత సొంత నియోజకవర్గం కాబట్టి అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఆయన కూడా ఎంపీగా తన వంతు బాధ్యతను నిర్వహిస్తూ పిఠాపురం మీద స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు.
ఇపుడు వీరికి తోడుగా జనసేన నుంచి తొలిసారి ఎమ్మెల్సీగా గెలిచి ఆ పార్టీకి శాసనమండలిలో మొదటి ప్రాతినిధ్యం అందించిన పిడుగు హరిప్రసాద్ కూడా జై పిఠాపురం అంటున్నారు. ఆయన పిఠాపురాన్ని దత్తత తీసుకుంటాను అని సంచలన ప్రకటన చేశారు. ప్రోటోకాల్ ప్రకారం ఒక ఎమ్మెల్సీకి ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గాన్ని సొంత నియోజకవర్గంగా చేసుకునే అవకాశం ఉంది.
అలా హరిప్రసాద్ కూడా పిఠాపురాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తాను అని చెబుతున్నారు. ఎమ్మెల్సీగా ఆయన తన పరపతిని పలుకుబడిని ఉపయోగించి పిఠాపురం అభివృద్ధికి తన వంతు గా పనిచేస్తాను అని చెప్పడంతో జనసైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పిఠాపురం ఎంతో అదృష్టం చేసుకుందని కూడా అంటున్నారు.
పిఠాపురం కోసం ఇంత మంది ఇన్ని రకాలుగా ముందుకు వచ్చి పనిచేస్తూంటే ఆ నియోజకవర్గం దేశంలోనే నంబర్ గా రానున్న అయిదేళ్ళలో ఎదగడం ఖాయమని అంటున్నారు. మొత్తం మీద ఒక్క పవన్ కళ్యాణ్ ని గెలిపించుకుంటే ఇంతలా నియోజకవర్గం కోసం తామూ ఉన్నామని తలా ఒక చేయి వేసి పనిచేసేందుకు రెడీ అవుతున్న జనసేన ప్రజా ప్రతినిధులను పార్టీ నేతలను చూసిన వారంతా పిఠాపురం ప్రజలకు మంచి రోజులు వచ్చాయని అంటున్నారు. మరి రానున్న అయిదేళ్లలో పిఠాపురం ఏ విధంగా అభివృద్ధి సాధిస్తుందో చూడాల్సి ఉంది.