బాబు, పవన్ లకు జోగయ్య లేఖ... తెరపైకి జనసేన సౌభాగ్య పథకం!
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు, ప్రధానంగా టీడీపీ - జనసేన అలయన్స్ పై కథనాలు వస్తున్న సమయంలో నిత్యం వార్తల్లో నిలిచారు హరిరామ జోగయ్య.
By: Tupaki Desk | 3 Aug 2024 7:45 AM GMTఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు, ప్రధానంగా టీడీపీ - జనసేన అలయన్స్ పై కథనాలు వస్తున్న సమయంలో నిత్యం వార్తల్లో నిలిచారు హరిరామ జోగయ్య. ఎన్నికలకు ముందు పవన్ ని నిత్యం తన లేఖలతో అలర్ట్ చేసేవారు! ఈ నేపథ్యంలో తాజాగా ఆయన చంద్రబాబు, పవన్ కల్యాణ్ లకు ఓ లేఖ రాశారు. ఇందులో కీలక విషయాలు ప్రస్థావించారు.
అవును.. ఏపీ రాజకీయాల్లో.. ప్రధానంగా జనసేన ప్రస్థానం, ప్రయాణంలో జోగయ్య లేఖలు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం నెలకొంది. ఈ ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు పూర్తవుతోంది! ఈ క్రమంలో... ఎన్నికల వేళ టీడీపీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు ఒక్కొక్కటీ అమలుచేసేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోంది.
మరికొన్ని పథకాలు ఈ ఏడాదికి లేవు, వచ్చే ఏడాది నుంచే అమలు అనే సంకేతాలు పంపించింది! మరోపక్క.. టీడీపీ సూపర్ సిక్స్ హామీలు సరేకానీ, ఎన్నికల సమయంలో జనసేన ఇచ్చిన హామీలపై మాత్రం ఎవరూ, ప్రధానంగా పవన్ కూడా నోరు మెదపడం లేదు అనే చర్చ ఏపీ ప్రజానికంలో.. ప్రధానంగా జనసైనికుల్లో మొదలైన పరిస్థితి.
సరిగ్గా ఈ సమయంలో హరిరామ జోగయ్య స్పందించారు. ఈ మేరకు ఆయన సీఎం చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు లేఖ రాశారు. ఇందులో భాగంగా... కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న టీడీపీ సూపర్ సిక్స్ పథకాలతో పాటు జనసేన ఇచ్చిన షణ్ముఖ వ్యూహం పథకాలనూ అమలు చేయాలని తన లేఖలో కోరారు.
ఈ సందర్భంగా సూపర్ సిక్స్ పథకాలతో పాటు జనసేన ప్రకటించిన షణ్ముఖ వ్యూహం పథకాలు కూడా ప్రజలకు ఎంతో ప్రయోజనకంగా ఉన్నట్లు తెలిపారు జోగయ్య. ఇందులో భాగంగా ప్రధానంగా యువకులకు రూ.10 లక్షల వరకూ సబ్సిడీ ఇచ్చే సౌభాగ్య పథకాన్ని గుర్తుచేసిన జోగయ్య.. ఇది ఎంతో బృహత్తరమైనదని కొనియాడారు. ఈ పథకంపై యువత ఎన్నో ఆశలుపెట్టుకున్నట్లు గుర్తుచేశారు!
దీంతో... మరోసారి జనసేన షణ్ముఖ వూహం పథకాలపై చర్చ మొదలైంది. జోగయ్య ప్రస్థావించినట్లు ప్రధానంగా సౌభాగ్య పథకంపై చర్చ పెద్ద ఎత్తున జరుగుతోందని తెలుస్తోంది. మరి ఈ పథకాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లు స్పందిస్తారా.. లేక, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఈ ఏడాదికి జనసేన షణ్ముఖ వ్యూహాన్ని వాయిదా వేస్తారా అనేది వేచి చూడాలి!