పవన్ కి జోగయ్య హాట్ లెటర్ : బాబుని గెలిపిస్తామంటే కాపులు ఓటేయరు...!
మాజీ మంత్రి కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరి రామజోగయ్య తాజాగా మరోసారి ఘాటు లేఖ రాశారు
By: Tupaki Desk | 5 Feb 2024 3:28 PM GMTమాజీ మంత్రి కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరి రామజోగయ్య తాజాగా మరోసారి ఘాటు లేఖ రాశారు. అందులో చాలా అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా కాపుల ఆకాంక్షలు ఏమిటో ఆయన వివరించారు. వైసీపీని గద్దె దించడం అంటే చంద్రబాబుని గద్దెనెక్కించడం కాదు అన్న సంగతిని పవన్ అర్ధం చేసుకోవాలని సూచించారు.
కాపులు ఎంతో ఆశగా పవన్ వైపు చూస్తున్నారని అలాగ బడుగు బలహీన వర్గాలు కూడా రాజ్యాధికారం కోసం చూస్తున్నారు అని జోగయ్య గుర్తు చేశారు. 2024 ఎన్నికల్లో అధికారంలో జనసేన భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు. అందుకోసం కనీఅంగా యాభై సీట్లు అయినా పవన్ టీడీపీ నుంచి తీసుకోవాల్సిందే అని ఆయన స్పష్టం చేశారు.
ఈ సీట్లు తీసుకోకపోతే మాత్రం రెండు పార్టీల మధ్య ఓట్ల బదిలీ జరగదని ఆయన అంటున్నారు. ఎల్లో మీడియాలో సీట్ల సర్దుబాటు విషయంలో వస్తున్న కధనాలను కూడా ఆయన ప్రస్తావించారు. అంత తక్కువ సీట్లు జనసేనకు ఇస్తున్నట్లుగా ప్రచారం జరగడం పట్ల జోగయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు.
టీడీపీ జనసేనకు సీట్లు ఇవ్వడం కాదు జనసేన టీడీపీకి ఎన్ని సీట్లు ఇస్తుంది అన్న ప్రశ్న రావాలని జోగయ్య అనడం విశేషం. 2019 ఎన్నికల్లో టీడీపీ జనసేన తోడు లేకుండా ఒంటరిగా వెళ్లి ఓడిందని ఆయన గుర్తు చేశారు. అందువల్ల పరస్పరం అవసరాలు ఉన్నాయని దాని దృష్టిలో పెట్టుకుని సీట్ల పంపిణీ జరగాలని కూడా జోగయ్య సూచించారు. జనాభా ప్రాతిపదికన సామాజిక న్యాయం సూత్రాల మీద సీట్ల పంపిణీ జరగాల్సిన అవసరం ఉందని అన్నారు.
పెద్ద ఎత్తున బడుగు బలహీన వర్గాల వారికి సీట్లు దక్కాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇదిలా ఉంటే స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఈ రోజు వరకూ చూస్తే ఒక్క దామోదరం సంజీవయ్య తప్ప ముఖ్యమంత్రులుగా ఏపీకి చేసిన వారు అంతా కూడా అగ్ర వర్ణాలే అన్నారు. అది కూడా ఆరు శాతం ఓట్ల షేర్ ఉన్న రెడ్లు, నాలుగు శాతం ఓట్లు ఉన్న కమ్మలు మాత్రమే అని జోగయ్య గుర్తు చేశారు. ఇలా అయితే రాజ్యాధికారం కాపులకు ఎపుడు దక్కుతుంది అని ఆయన ప్రశ్నించారు.
ఏపీలో పాతిక శాతం ఉన్న కాపులు బలిజలు, ఒంటరి, తెలగ సామాజిక వర్గాలు రాజకీయంగా సామాజికంగా ఆర్ధికంగా ఎంతో నష్టపోయారు అని ఆయన వివరించారు. అందువల్ల యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి కాపులతో సహా బడుగు బలహీన వర్గాలు రావాల్సిన అవసరం ఉందని జోగయ్య పేర్కొన్నారు.
అందుకోసమే ప్రజలలో మంచి చరిష్మా కలిగిన పవన్ కళ్యాణ్ వైపు ఆయా వర్గాలు ఆశగా ఎదురుచూస్తున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. ఈసారి ఎన్నికల్లో పాతిక శాతం ఉన్న ఎనభై శాతం బడుగు బలహేన వర్గాలు పాతిక శాతం ఉన్న కాపులకు రాజ్యాధికారం దక్కాల్సిందే అని జోగయ్య అంటున్నారు.
కాపులు అంతా తాము రాజ్యాధికారం దిశగా సాగుతున్నామన్న పిచ్చి నమ్మకంతో పవన్ వెంట నడుస్తున్నారు అన్ జోగయ్య అంతున్నారు.వారి నమ్మకనాని వమ్ము చేయకూడదు అంటే కనీసంగా యాభై సీట్లు అయినా జనసేన దక్కించుకోవాలని జోగయ్య పవన్ కి సూచించారు. అపుడే పూర్తి స్థాయిలో కాకపోయిన పాక్షికంగా అయినా అధికారం జనసేనకు దక్కుతుందని అన్నారు.
అలాగే తనకు పదవులు ముఖ్యం కాదు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అని పవన్ కళ్యాణ్ అంటున్నారని అధికారం అంతా టీడీపీకే ధారపోస్తే అపుడు పవన్ రాష్ట్ర ప్రయోజనాలను ఏ విధంగా సాధిస్తారు అని కూడా జోగయ్య లాజిక్ పాయింట్ ని తీశారు. అసలు దీన్ని ఎలా సమర్ధించుకుంటారు, ఏ విధంగా మీరు జవాబు చెప్పగలుగుతారు అని జోగయ్య ప్రశ్నించడం గమనార్హం.
ఒకవేళ సీట్ల పంపిణీలో జనసేనకు సీట్లు తగ్గినా అధికారంలో జనసేనకు సగం అంటే రెండున్నరేళ్ల పాటు ఇస్తామని చంద్రబాబు చేత బహిరంగ ప్రకటన చేయించగలరా అని జోగయ్య పవన్ని ప్రశ్నించారు. తాను అడిగిన అన్ని ప్రశ్నలకు సవ్యమైన సమాధానాలు పవన్ నుంచి వచ్చినపుడే ఎన్నికలు సవ్య దిశగా సాగుతాయని జోగయ్య చెప్పడం విశేషం.
ఒకవేళ జనసేనకు 40 నుంచి 60 సీట్ల మధ్యలో పొత్తు సీట్లు దక్కకపోయినా కాపు సామాజిక వర్గానికి ఎస్సీ బీసీ, మైనారిటీలకు తగిన మోతాదులో సీట్లు దక్కకపోయినా ఓట్ల బదిలీ రెండు పార్టీల మధ్య సవ్యంగా సాగదని జోగయ్య హెచ్చరించారు. అపుడు మీరు అనుకుంటున్నట్లుగా సాధించలేరు అని జోగయ్య అంటున్నారు.
అంటే ఏపీలో వైసీపీని ఓడించడం అపుడు కష్టమవుతుందని, దానికి బాధ్యులుగా చంద్రబాబు పవన్ మాత్రమే మిగలాల్సి వస్తుందని హెచ్చరిస్తూ సారీ చెబుతూనే జోగయ్య లేఖ ముగించడం విశేషం. చంద్రబాబును గద్దెనెక్కించడానికి కాపులు సిద్ధంగా లేరని, బాబు గెలిపించడం కోసం పవన్ వెంట కాపులు నడవడం లేదని, ఈ రోజున సీట్లు సాధించలేని వాడివి రేపు రాష్ట్ర ప్రయోజనాలు ఏరకంగా కాపాడతావంటూ గట్టిగానే ఇచ్చేశారు.