ఏపీ కొత్త డీజీపీగా మళ్లీ హరీశ్ కుమార్ గుప్తా?
ప్రస్తుతం దావోస్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి తిరిగి రాగానే డీజీపీ నియామకంపై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
By: Tupaki Desk | 23 Jan 2025 6:28 AM GMTఏపీ డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా మరోసారి బాధ్యతలు చేపట్టే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావు ఈ నెల 31న రిటైర్ కానున్నారు. ఆయన స్థానంలో హరీశ్ కుమార్ గుప్తాను డీజీపీగా నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం దావోస్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి తిరిగి రాగానే డీజీపీ నియామకంపై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
డీజీపీ ద్వారకా తిరుమలరావు ఈ నెల 31న రిటైర్ కానున్నారు. ప్రస్తుతం డీజీపీతోపాటు ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టరుగా ద్వారాకా తిరుమలరావు వ్యవహరిస్తున్నారు. ఆయన పదవీకాలం మరోసారి పొడిగించాలనే ప్రతిపాదన కూడా పరిశీలిస్తున్నారని అంటున్నారు. అయితే ఇప్పటివరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల పదవీకాలాన్ని పొడిగించారే తప్ప, డీజీపీల పదవీకాలాన్ని ఎప్పుడూ ఎక్స్ టెంట్ చేయలేదు. దీనివల్ల డీజీపీగా ద్వారకా తిరులమరావు రిటైర్ కావడం దాదాపు ఖాయమంటున్నారు. ఇక ఆర్టీసీ మేనేజిండ్ డైరెక్టరుగా ఆయన సేవలను పొడిగించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. దీంతో కొత్త డీజీపీని నియమించడం అనివార్యంగా మారింది.
ఐపీఎస్ సీనియార్టీ జాబితాలో అంజనీకుమార్, మాదిరెడ్డి ప్రతాప్, హరీశ్ కుమార్ గుప్తా మొదటి మూడుస్థానాల్లో ఉంటారు. అంజనీకుమార్ ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. దీంతో అగ్నిమాపక డీజీ మాదిరెడ్డి ప్రతాప్, హరీశ్ కుమార్ గుప్తా పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఎన్నికల సమయంలో అప్పటి డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని ఎన్నికల సంఘం తప్పించింది. ఆయన స్థానంలో కొత్తవారి నియామకానికి సీనియార్టీ జాబితా ప్రకారం పేర్లు పంపాలని ఈసీ ఆదేశించింది. అప్పట్లో ద్వారకాతిరుమలరావు, మాదిరెడ్డి ప్రతాప్, హరీశ్ కుమార్ గుప్తా పేర్లను సీఎస్ సూచించగా, ఈసీ హరీశ్ కుమార్ గుప్తాకు అవకాశం ఇచ్చింది.
ఈసీ ఆదేశాల ప్రకారం మే నెలలో డీజీపీగా బాధ్యతలు చేపట్టిన హరీశ్ కుమార్ గుప్తా జూన్ వరకు బాధ్యతలు చేపట్టారు. జూన్ 12న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణస్వీకారం సందర్భంగా ట్రాఫిక్ ఇక్కట్లు ఎక్కువయ్యాయి. వీఐపీల భద్రతపై డీజీపీ హరీశ్ కుమార్ సరిగా వ్యవహరించలేదని విమర్శలు వచ్చాయి. దీంతో ఆయనను తప్పించిన సీఎం చంద్రబాబు సీనియార్టీ ప్రకారం తొలిస్థానంలో ఉన్న ద్వారకా తిరుమలరావుకు అవకాశమిచ్చారు. ఇక ఇప్పుడు ఆయన రిటైర్ కావడం, హరీశ్ కుమార్ గుప్తా కూడా ఈ ఆగస్టులో రిటైర్ కానుండటంతో ఆయనకు తప్పనిసరిగా అవకాశం ఇవ్వాలని సీఎం ఆలోచిస్తున్నారని చెబుతున్నారు. ఇప్పుడు ఆయనకు అవకాశం ఇవ్వకపోతే ఆ తర్వాత చాన్స్ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో హరీశ్ కుమార్ గుప్తా నియామకం దాదాపు ఖాయమని ప్రభుత్వ వర్గాల సమాచారం. జమ్మూ కశ్మీరుకు చెందిన హరీశ్ కుమార్ గుప్తా 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. సీనియార్టీ ప్రకారం ఆయన తర్వాత స్థానంలో పీఎస్ఆర్ ఆంజనేయులు, కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి ఉన్నారు. వీరిలో కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి ఇప్పటికే డీజీపీగా పనిచేశారు. ఇక పీఎస్ఆర్ పై ఆరోపణలు ఉండటంతో ఆయనకు చాన్స్ ఇచ్చే అవకాశాలు లేవంటున్నారు.