అసెంబ్లీకి కొత్త ఆర్వోఆర్.. హరీశ్‌రావు ఏమన్నారంటే..?
కాగా.. మాజీమంత్రి హరీశ్ రావు తమకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సూచనలను కూడా బిల్లులో పొందుపరిచినట్లు పొంగులేటి తెలిపారు.
By: Tupaki Desk | 18 Dec 2024 9:50 AM GMTతెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా నేడు మరో కీలక బిల్లును ప్రవేశపెట్టారు. ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన తరువాత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ కీలక బిల్లును ప్రవేశపెట్టారు. అదే భూ భారతి-2024 బిల్లు.
భూభారతి-2024 బిల్లు పెట్టే క్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నాలుగు గోడల మధ్య కూర్చొని ధరణి పోర్టల్ తీసుకొచ్చారని, వేల పుస్తకాలు చదివిన మేధావి తెచ్చిన 2020 ఆర్వోఆర్ చట్టంతో లక్షలాది సమస్యలు వచ్చాయని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం ఇద్దరు వ్యక్తులు తయారుచేసిన ధరని దరిద్రాన్ని ప్రక్షాళన చేశామని చెప్పారు. కాగా.. మాజీమంత్రి హరీశ్ రావు తమకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సూచనలను కూడా బిల్లులో పొందుపరిచినట్లు పొంగులేటి తెలిపారు.
గడీల్లో కూర్చొని తయారు చేసిన 2020 చట్టాన్ని పూర్తిగా మార్చినట్లు మంత్రి స్పష్టం చేశారు. ముసాయిదా బిల్లును వెబ్‌సైట్‌లో పెట్టి 40 రోజులపాటు అభిప్రాయాలు సేకరించామని తెలిపారు. 33 జిల్లాల్లో ప్రజల అభిప్రాయాలను సైతం తీసుకున్నామన్నారు. అందులోభాగంగా కొత్తగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పారు. లక్షలాదిగా ఇబ్బందులు పడుతున్న బాధితులకు న్యాయం చేయడం కోసమే ఈ చట్టం తీసుకొచ్చామని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 18 లక్షల ఎకరాలు పార్ట్ బిలో ఉందని, గతంలో ఆ భూమికి పాస్‌బుక్కులు ఉంటే ఇప్పుడు ఎందుకు పార్ట్ బిలో చేర్చారని నిలదీశారు. తాము తెస్తున్న కొత్త చట్టం ద్వారా పార్ట్ బిలోని భూముల సమస్యలు పూర్తిగా పరిష్కారం అవుతాయని చెప్పారు.
ఆబాది, గ్రామ కంఠ భూములకు సైతం పరిష్కారాలను కొత్త చట్టం ద్వారా చూపిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. పొజిషన్‌కు, పాస్‌బుక్కులో ఉన్న భూ విస్తీర్ణంలో వ్యత్యాసాలు సరిచేసే అవకాశం ఉందని తెలిపారు. మ్యుటేషన్‌పై అభ్యంతరాలు ఉంటే ఆర్డీఓ ఆధ్వర్యంలో అప్పీల్ అథారిటీని సైతం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వారసత్వ ఆస్తుల అభ్యంతరాలపై కూడా అప్పీల్ అథారిటికీ వెళ్లే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. మ్యుటేషన్ చేసే అధికారం ఆర్డీఓకు కొత్త చట్టం ప్రకారం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మార్వో రిజిస్ట్రేషన్ చేస్తారని, ఆర్డీఓ, కలెక్టర్ అప్పీల్ అథారిటీగా ఉంటారని స్పష్టం చేశారు. సభ్యులు ఇంకా ఏమైనా మంచి సూచనలు చేస్తే.. వాటిని బిల్లులో చేర్చేందుకు తమకు ఎలాంటి బేషజాలు లేవని వెల్లడించారు.
దీనిపై మాజీమంత్రి హరీశ్ రావు స్పందిస్తూ.. ఇప్పుడే బిల్లు పెట్టి ఇప్పుడే చర్చ అంటే ఎలా అని ప్రశ్నించారు. బీఏసీ మినిట్స్ తమకు రాలేదని, ఏ బిల్లు ఎప్పుడు వస్తుందో కూడా తెలియదని పేర్కొన్నారు. బిల్లు ఇంకా తమ చేతికి కూడా అందలేదన్నారు. బిల్లును చదవకుండా చర్చలో ఎలా పాల్గొంటామని ప్రశ్నించారు. చర్చకు తగిన సమయం ఇవ్వాలని, రెండు రోజుల ముందు బిల్లు ప్రతులను సభ్యులకు ఇవ్వాల్సి ఉండేదని అన్నారు. ఇష్టం ఉన్నట్లు చేస్తామంటే తాము సభ నుంచి వెళ్లిపోతామని స్పష్టం చేశారు. కొత్త ఆర్వోఆర్ చట్టంపై రేపు చర్చ పెట్టాలని మరో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. తాము బిల్లును చదువుతామని, రేపు మాట్లాడుతామని తెలిపారు.