Begin typing your search above and press return to search.

హ‌రీశ్ రావు కొంచెం గ్యాప్ తీసుకుంటే మంచిదేమో

తాజాగా, పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కోరుతూ పోరుబాటకు పిలుపునిచ్చిన మాజీ సర్పంచ్‌ల విష‌యంలో హ‌రీశ్ రావు స‌మ‌య‌స్పూర్తితో స్పందించారు.

By:  Tupaki Desk   |   5 Nov 2024 11:30 AM GMT
హ‌రీశ్ రావు కొంచెం గ్యాప్ తీసుకుంటే మంచిదేమో
X

తెలంగాణ రాజ‌కీయాల గురించి మాట్లాడితే, త‌ప్ప‌కుండా ప్ర‌స్తావించాల్సిన టాప్ నాయ‌కుల పేర్ల‌లో ఉండేది బీఆర్ఎస్ ముఖ్య నేత‌, పార్టీ ర‌థ‌సార‌థి కేసీఆర్ మేన‌ల్లుడు హ‌రీశ్ రావు. బీఆర్ఎస్ పార్టీ ట్ర‌బుల్ షూట‌ర్‌గా పేరొందిన హ‌రీశ్ రావు ఆ పార్టీలోని రాజ‌కీయాల కార‌ణంగా ఎప్పుడు లైమ్ లైట్లో ఉంటారో... క‌రెక్టుగా చెప్పాలంటే ఉంచ‌బ‌డుతారో మ‌రెప్పుడు అడ్ర‌స్ కోసం వెతుక్కోవాల్సి వ‌స్తుందో ఊహ‌కు అంద‌ని ప‌రిస్థితి. అలాంటి హ‌రీశ్ రావు గురించి ఇప్పుడు మ‌ళ్లీ అదే టాపిక్ వినిపిస్తోంది. హ‌రీశ్ రావు కొంచెం గ్యాప్ తీసుకుంటే మంచిదేమో అనేది ఈ చ‌ర్చ యొక్క సారాంశం.

బీఆర్ఎస్ పార్టీ గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన త‌ర్వాత గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ ఆరోగ్య కార‌ణాల రీత్యా విశ్రాంతి తీసుకుంటుండ‌టం, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ర‌థసార‌థి హోదాలో రేవంత్ రెడ్డి దూకుడుగా ముందుకు సాగుతుండ‌టంతో ... గులాబీ పార్టీ బ‌ల‌హీన‌ప‌డుతోంది. ఈ స‌మ‌యంలోనే పార్టీని కాపాడే బాధ్య‌త‌ను హ‌రీశ్ రావు భుజాన వేసుకున్నారు. స‌మ‌యానుగుణంగా వివిధ అంశాల‌పై స్పందిస్తూ, ప్ర‌తిప‌క్ష హోదా పార్టీ పాత్ర‌ను పోషిస్తున్నారు. గ‌త కొద్దికాలంగా అయితే, నేరుగా క్షేత్ర‌స్థాయిలోకి వెళ్లి ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పై గ‌ళం ఎత్తున్నారు. అయితే, ఈ విష‌యంలోనే హ‌రీశ్ రావు ప్ర‌త్య‌ర్థులు ఆయ‌న‌పై ఆస‌క్తిక‌ర కామెంట్లు చేస్తున్నారు.

తాజాగా, పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కోరుతూ పోరుబాటకు పిలుపునిచ్చిన మాజీ సర్పంచ్‌ల విష‌యంలో హ‌రీశ్ రావు స‌మ‌య‌స్పూర్తితో స్పందించారు. ముఖ్యమంత్రి గారిని కలిసి వినతిపత్రం ఇవ్వాలని హైదరాబాద్ కు స‌ర్పంచులు బ‌య‌ల్దేరితే, వారిని అడ్డుకోవడం, నిర్బంధించడం చోటుచేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న మాజీ సర్పంచ్ ల అరెస్టులను, అక్రమ నిర్బంధాలను తీవ్రంగా ఖండించిన మాజీ మంత్రి హరీశ్‌ రావు ఏకంగా హైద‌రాబాద్ స‌మీపంలోని బొల్లారం పోలీసు స్టేషన్ కు వెళ్లి అరెస్టు చేసిన‌ మాజీ సర్పంచులను పరామర్శించారు. బ‌లవంతంగా డీసీఎం వ్యానులో ఎక్కించి, తరలిస్తున్న మాజీ సర్పంచులకు మద్దతుగా తిరుమల గిరి రోడ్డుపైన మాజీ మంత్రి హరీశ్ రావు నిరసన తెలిపారు.

ఇలా మాజీ సర్పంచుల నిరసనకు మద్దతు తెలిపిన మాజీ మంత్రి హరీశ్‌ రావు, ఆ మ‌రుస‌టి రోజే రాహుల్ గాంధీ ప‌ర్య‌ట‌న‌పై ఆస‌క్తిక‌రంగా రియాక్ట‌య్యారు. అ`శోక` నగరాన్ని సందర్శించండి రాహుల్ గాంధీ గారు అంటూ ట్విట్ట‌ర్లో రియాక్ట‌య్యారు. రాహుల్ గాంధీ గారు, మీరు ఎన్నికల ముందు అశోక్ నగర్‌లో నిరుద్యోగ యువతను కలిసిన ప్రదేశంలోనే, మీ సో-కాల్డ్ ప్రజా పాలన విద్యార్థులపై కర్కశంగా వ్యవహరించింది. లాఠీ చార్జ్ చేసి వీపులు పగలగొట్టింది. ఈ దారుణాలు మీకు తెలుసా? హైదరాబాద్‌కు వస్తున్న మీరు ఒకసారి అశోక్ నగర్‌ని సందర్శించి ఆ విద్యార్థులతో మాట్లాడి, వారి ఆవేదనను వినండి, శోక నగర్‌గా మార్చిన మీ ప్రభుత్వ తీరును చూడండి.

మీరు వాగ్దానం చేసిన 2 లక్షల ఉద్యోగాల్లో కనీసం 10% ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా ఇవ్వలేదు. టీఎస్పీఎస్సీని యూపీఎస్సీ తరహాలో ప్రక్షాళన చేస్తామని ప్రకటించారు, ప్రక్షాళన సంగతి దేవుడెరుగు, టీఎస్పీఎస్సీని టీజీపీఎస్‌గా పేరు మార్చి చేతులు దులుపుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు, కానీ అది కేవలం జాబ్‌లెస్ క్యాలెండర్‌గా మిగిలిపోయింది. పది నెలల కాలంలో నిరుద్యోగ భృతి, 5 లక్షల రూపాయల యువ వికాసం పథకం వంటి హామీల ఊసు కూడా లేదు. నిరుద్యోగుల పట్ల, విద్యార్థుల పట్ల మీరు మీ పార్టీ చూపిన కపట ప్రేమ బట్టబయలైంది. కాంగ్రెస్ ప్రభుత్వ కర్కశ పాలనను నిరుద్యోగ యువత తప్పకుండా గుర్తుపెట్టుకుంటుంది. అంటూ స్పందించారు.

అయితే, హ‌రీశ్ రావు ఇలా ప్ర‌తిపక్ష పార్టీ నేత‌గా స్పందిస్తుంటే ఆయ‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు మాత్రం ఈ ఎపిసోడ్‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ప్ర‌జాస‌మ‌స్య‌లు లేదా మ‌రే రూపంలో అయినా దూకుడుగా స్పందిస్తున్న హ‌రీశ్ రావు కొంచెం ఓపిక ప‌ట్ట‌డం, బ్రేక్ తీసుకోవ‌డం మంచిది అంటూ... కేటీఆర్‌కు పోటీగా, పార్టీకి భ‌విష్య‌త్తుగా నాయ‌కుడిగా ప‌గ్గాలు చేప‌ట్టేందుకే ఇలా చేస్తున్నారంటూ విశ్లేషిస్తున్నారు. కాగా, పార్టీ ప‌ద‌వి కంటే పార్టీ భ‌విష్య‌త్తు కోసం త‌మ నాయ‌కుడి మాట జ‌వదాట‌కుండా ముందుకు సాగ‌డ‌మే త‌న విధానమ‌ని ఇప్ప‌టికే హ‌రీశ్ రావు క్లారిటీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.