తెలంగాణకు గుండు సున్నా: హరీష్‌రావు
ఇక, తాజా బడ్జెట్‌లో తెలంగాణ ప్రస్తావన లేకపోవడంపైనా హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు విలువ లేదా? అని ప్రశ్నించారు.
By: Tupaki Desk | 1 Feb 2025 12:19 PM GMTకేంద్రం ప్రవేశ పెట్టిన తాజా బడ్జెట్‌పై బీఆర్ ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు ఘాటుగా స్పందించారు. దీనిని రాజకీ య బడ్జెట్‌గా ఆయన అభివర్ణించారు. వికసిత భారత్ జపం చేస్తున్న కేంద్రం.. 'దేశ సమ్మిళిత వృద్ధి'ని ఏమాత్రం పట్టించుకు న్నట్లు లేదన్నారు. నిధులను కేంద్రీకృతం చేసి.. దేశాన్ని ఎలా డెవలప్ చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ బడ్జెట్ తెలంగాణకు గుండుసున్నా ఇచ్చిందన్నారు. ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు పెద్ద మొత్తంలో వరాలు ప్రకటించారని ఆయన దుయ్యబట్టారు. ఇక, ఇదే కొనసాగితే.. ప్రతి రాష్ట్రంలోనూ ఏటా ఎన్నికలు జరగాల్సి ఉంటుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
''దేశమంటే మట్టి కాదోయో దేశమంటే మనుషులోయ్ అంటూ ప్రసంగించిన నిర్మల సీతారామన్, దేశమంటే కొన్ని రాష్ట్రాలే అన్నట్లు బడ్జెట్ ప్రవేశ పెట్టడం బాధాకరం. మొదటి నుంచి ఇదే దోరణిని ప్రదర్శిస్తూ కేంద్రంలోని మోడీ సర్కారు రాజకీయ అవసరాలు తీర్చుకుంటోంది'' అని హరీష్ రావు వ్యాఖ్యానించారు. ''2024 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్, 2025 ఢిల్లీ, బిహార్ రాష్ట్రాల కోసం బడ్జెట్ పెట్టారు. 2026 యూపీ బడ్జెట్, 2027 గుజరాత్ కోసం బడ్జెట్ పెడుతారా? యావత్ దేశానికి సరిపోయే బడ్జెట్ ఎప్పుడు పెడతారు?'' అని నిప్పులు చెరిగారు.
ఇక, తాజా బడ్జెట్‌లో తెలంగాణ ప్రస్తావన లేకపోవడంపైనా హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు విలువ లేదా? అని ప్రశ్నించారు. కేవలం మూడు, నాలుగు రాష్ట్రాలకు కేటాయించారు తప్ప.. పూర్తి స్థాయి దేశం కోసం కాదన్నా రు. తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు, 8 మంది ఎంపీలు ఉండి తెలంగాణ రాష్ట్రానికి ఏం సాధించినట్లు? అని నిలదీశారు. తెలంగాణ నుంచి 5.1 శాతం జీడీపీ కేంద్రానికి వస్తోందని.. ఇప్పుడు బడ్జెట్‌లో కనీసం దానిలో సగం కూడా నిధులు కేటాయించ లేదన్నారు. తెలంగాణ సమాజం మరోసారి కేంద్రం చేతిలో ఘోరంగా మోసపోయిందని వ్యాఖ్యానించారు.
''ఏపీ విభజన చట్టం ప్రకారం గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకి ఇవ్వాల్సిన నిధులు కూడా ఇవ్వకపోవడం బాధాకరం.తెలంగాణకు నిధులు రాబట్టుకోవడంలో రేవంత్ సర్కారు పూర్తిగా విఫలమైంది. బడ్జెట్ కు పది రోజుల ముందు 40 వేల కోట్లు కావాలని లేఖ రాయడం తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదు'' అని హరీష్ రావు విమర్శించారు. బిజేపీ, కాంగ్రెస్ పార్టీల తీరు వల్ల తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.