బాబు కంటే ముందు జైల్లో రేవంత్ ... హరీష్ హాట్ కామెంట్స్...!
రేవంత్ రెడ్డిని ఎపుడో అరెస్ట్ చేసేవాళ్లను, జైల్లో పెట్టేవాళ్ళమని హరీష్ చేసిన కామెంట్స్ తెలంగాణా కాంగ్రెస్ కి కూడా గట్టిగానే తగులుతున్నాయి.
By: Tupaki Desk | 21 Oct 2023 3:01 PM GMTఏపీలో చంద్రబాబు నెలన్నర రోజులుగా జైలులో మగ్గుతున్నారు. తెలంగాణాలో ఎన్నికలు వచ్చిపడ్డాయి. తెలంగాణా రాజకీయాల్లో బాబు అరెస్ట్ జైలు జీవితం గురించి కూడా ప్రతీ రోజూ ఎక్కడో ఒక చోట చర్చకు వస్తోంది. చంద్రబాబుని అన్యాయంగా అరెస్ట్ చేశారు అని బీయారెస్ లోని మంత్రులు కొందరు అంటున్నారు. ఏపీలో కక్షపూరితమైన రాజకీయం సాగుతోంది అని విమర్శిస్తున్నారు. బాబు క్యాబినేట్ లో పనిచేసి ప్రస్తుతం బీయారెస్ లో మంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాస యాదవ్ లాంటి వారు అయితే చంద్రబాబుని అరెస్ట్ చేసి జైలులో పెట్టడం తప్పే అంటున్నారు.
ఇతర మంత్రులు అయితే ఇది పూర్తిగా బీజేపీ వైసీపీల కుట్ర రాజకీయం అని కూడా విమర్శిస్తున్నారు. చంద్రబాబు జైలు ఎపిసోడ్ తెలంగాణా రాజకీయాలలో ఎందుకు ఇష్యూ అవుతోంది అంటే అక్కడ సెటిలర్స్ ఓట్ల కోసం అని అంటున్నారు. మొదట్లో కేటీయార్ బాబు అరెస్ట్ జైలు మీద ఐటీ ఉద్యోగులు నిరసనను హైదరాబాద్ లో చేయడాన్ని తప్పు పట్టారు. రాజమండ్రీలో చేసుకోమని సూచించారు. అయితే ఆ తరువాత మాత్రం ఆయన నాలిక కరచుకున్నారు. టీడీపీ పట్ల తాము పూర్తిగా సాఫ్ట్ కార్నర్ తో ఉన్నామని పలు చోట్ల చెప్పుకుంటూ వచ్చారు.
ఇక మరో మంత్రి హరీష్ రావు అయితే మొదటి నుంచి వైసీపీ వైఖరిని తప్పు పడుతూనే ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్ అన్నది అక్రమం అని హరీష్ రావు గట్టిగానే మాట్లాడుతూ వస్తున్నారు. దాని మీద వైసీపీకి చెందిన నేతలు సైతం హరీష్ రావుకు కౌంటర్ ఇచ్చే రేంజిలో ఆయన విమర్శల వేడి ఉంది. ఇదిలా ఉంటే లేటెస్ట్ గా హరీష్ రావు బాబు అరెస్ట్ జైలు మీద మరోసారి హాట్ కామెంట్స్ చేశారు.
ఏపీలో పనితనం లేదు పగతనం మాత్రమే ఉంది అంటూ హరీష్ రావు చేసిన కామెంట్స్ సంచలనంగా మారుతున్నాయి. బీయారెస్ ప్రభుత్వానికి కానీ కేసీయార్ కి కానీ పనితనమే వచ్చు తన పగతనం గురించి అసలు ఏ మాత్రం తెలియదు అని హరీష్ రావు అంటున్నారు. కేసీయార్ కనుక పగ పడితే బాబు కంటే ముందే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో జైలులో ఉండేవారు అని ఆయన అంటున్నారు.
తాము పగ ఎవరి మీద పట్టమని, అలాగే ఎవరి మీద అకారణమైన ద్వేషాన్ని పెంచుకోమని హరీష్ రావు అంటున్నారు. రాజకీయాలను రాజకీయంగా చూస్తామని ఆయన చెబుతున్నారు. తమ ప్రభుత్వానికి పనిచేయడం మాత్రమే తెలుసు అని తొమ్మిదిన్నరేళ్ల కాలంలో తాము చేసిన అభివృద్ధి అన్నది ఎక్కడ చూసినా కనిపిస్తోంది అని ఆయన అంటున్నారు.
అదే పొరుగున ఉన్న రాష్ట్రంలో కక్ష రాజకీయాలు కనిపిస్తున్నాయని ఇండైరెక్ట్ గా వైసీపీ మీద హరీష్ రావు సీరియస్ గానే కామెంట్స్ చేశారు. చంద్రబాబుని వైసీపీ ప్రభుత్వం జైలులో పెట్టడాన్ని ఆయన పగతనంగా చూస్తున్నారు. అదే చెబుతున్నారు. ఏపీ ప్రభుత్వానిది పగతనం అని హరీష్ రావు డిక్లేరు చేస్తున్నారు.
అంటే కేసీయార్ ది పనితనం అని చెప్పుకోవడం వరకూ ఓకే అయినా వైసీపీని హరీష్ రావు విమర్శించడంలో అంతరార్ధం ఏంటి అంటే టీడీపీ సానుభూతిపరుల ఓట్ల కోసమే అని అంటున్నారు. తెలంగాణాలోని కొన్ని సెగ్మెంట్లలో టీడీపీ ఓట్లు కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తున్న నేపధ్యంలో మొదటి నుంచి హరీష్ రావు వైసీపీని విమర్శిస్తున్నారు చంద్రబాబు అరెస్ట్ ని తప్పు పడుతున్నారు ఇపుడు కూడా ఆయన ఎన్నికల ప్రచారంలో కేసీయార్ ని జగన్ తో పోలుస్తూ ఈ హాట్ కామెంట్స్ చేసారు.
రేవంత్ రెడ్డిని ఎపుడో అరెస్ట్ చేసేవాళ్లను, జైల్లో పెట్టేవాళ్ళమని హరీష్ చేసిన కామెంట్స్ తెలంగాణా కాంగ్రెస్ కి కూడా గట్టిగానే తగులుతున్నాయి. అంటే రేవంత్ రెడ్డిని కేసీయార్ చూసీ చూడనట్లుగా వదిలేసారా ఆధారాలు ఉన్నా ఎందుకు అరెస్ట్ అని పగతనం చూపకుండా పక్కన పెట్టారా అన్నది కూడా చర్చకు వస్తోంది.
కాంగ్రెస్ గ్రాఫ్ తెలంగాణాలో నానాటికీ పెరుగుతున్న వేళ రేవంత్ రెడ్డిని కట్టడి చేయలేకపోయామన్న ఆందోళన కూడా ఏమైనా హరీష్ మాటలలో కనిపిస్తోందా అన్నది కూడా చర్చకు వస్తోంది. ఏది ఏమైనా కేసీయార్ ని జగన్ని ముడిపెట్టి చంద్రబాబు రేవంత్ రెడ్డిలను కలుపుతూ హరీష్ రావు చేసిన కామెంట్స్ మాత్రం ఇపుడు మంట పుట్టించేలాగానే ఉన్నాయి. దీనికి కాంగ్రెస్ తరఫున రేవంత్ రెడ్డి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. అలాగే వైసీపీ కూడా హరీష్ మీద మాటల దాడి చేసే అవకాశాలు ఉన్నాయా అన్నది చూడాల్సి ఉంది.