Begin typing your search above and press return to search.

సవాలు విసరటం ఎస్కేవ్ కావటంలో హరీశ్ తోపు బాస్!

ఇలాంటి తీరును ఇప్పటికే పలుమార్లు ప్రదర్శించిన హరీశ్ మరోసారి తనలోని ఎస్కేప్ లక్షణాన్ని బయటపెట్టుకోవటం ఆసక్తికరంగా మారింది.

By:  Tupaki Desk   |   16 Aug 2024 7:30 AM GMT
సవాలు విసరటం ఎస్కేవ్ కావటంలో హరీశ్ తోపు బాస్!
X

ఊరించే అవకాశం ఉన్నట్లుగా కనిపించినంతనే చెలరేగిపోయే తత్త్వం మాజీ మంత్రి హరీశ్ రావుకు ఎక్కువే. వెనుకా ముందు చూసుకోకకుండా సవాలు విసిరే ఆయన.. సదరు సవాలులో తాను అనుకున్న దానికి భిన్నమైన ఫలితం వచ్చినంతనే ఆయన మరింత చెలరేగిపోతారు. తప్పంతా ఎదుటోడి మీదనే ఉన్నట్లుగా ఆయన మాటలు ఉంటాయి. ఇలాంటి తీరును ఇప్పటికే పలుమార్లు ప్రదర్శించిన హరీశ్ మరోసారి తనలోని ఎస్కేప్ లక్షణాన్ని బయటపెట్టుకోవటం ఆసక్తికరంగా మారింది.

తాము అధికారంలోకి వస్తే రూ.2 లక్షల రైతు రుణమాఫీని అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ ఇవ్వటం.. ఎన్నికల్లో విజయం సాధించటం తెలిసిందే. ప్రభుత్వ ఏర్పాటు అనంతరం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రుణమాఫీ కార్యక్రమానికి గ్యాప్ వచ్చింది. ఈ సందర్భంగా విపక్షాలు విరుచుకుపడగా.. వాటికి సమాధానంగా పంద్రాగస్టు నాటికి రుణమాఫీ హామీని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అధికార.. విపక్షాల మధ్య సవాళ్లు చోటు చేసుకున్నాయి. మిగిలిన వాటితో పోలిస్తే.. మాజీ మంత్రి హరీశ్ రావు నోటి నుంచి వచ్చిన సవాలే ముఖ్యమైనది. పంద్రాగస్టు వేళకు రుణమాఫీని అమలు చేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని పేర్కొన్నారు.

అంచనాలకు భిన్నంగా జూన్ చివరి నుంచే రుణమాఫీని అమలు చేయటం షురూ చేసిన రేవంత్ సర్కారు పంద్రాగస్టు ముందుకే రూ.2 లక్షల రుణమాఫీని చేపట్టినట్లుప్రకటించింది. ఈ క్రమంలో ఆగస్టు 15న ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడుతూ.. హరీశ్ రావు తన పదవికి రాజీనామా చేయాలని.. లేదంటే ముక్కునేలకు రాయాలని పేర్కొన్నారు. దీంతో.. తామిచ్చిన రుణమాఫీ హామీని పూర్తి చేసినట్లుగా ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యపై హరీశ్ రావు విరుచుకుపడ్డారు. రంకెలు వేస్తే అబద్ధాలు నిజాలు అయిపోవన్న ఆయన.. రేవంత్ మొక్కిన దేవుళ్ల వద్దకు తాను వెళ్లి.. రేవంత్ చేసిన మోసాన్ని చెబుతానని వ్యాఖ్యానించారు.

మిగిలిన విషయాలు ఎలా ఉన్నా.. రుణమాఫీ ఎపిసోడ్ లో రేవంత్ సర్కారు ముందుంటే.. సవాలు విషయంలో హరీశ్ వెనుకబడినట్లుగా చెప్పక తప్పదు. ఇలాంటి వేళ మౌనాన్ని ఆశ్రయిస్తే సరిపోతుంది. అందుకు భిన్నంగా సై అంటే సై అంటూ వ్యాఖ్యలు చేస్తే ఉన్న కాస్తపాటి పరువు పోవటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. నిజానికి.. సవాళ్లు విసరటం.. వాటి నుంచి ఎస్కేప్ కావటం హరీశ్ కు వెన్నతో పెట్టిన విద్యగా అభివర్ణిస్తున్నారు.

తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా తెలుగుదేశం పార్టీ లేఖ ఇస్తే.. తాను టీడీపీ ఆఫీసులో అటెండర్ గా పని చేస్తానని పలుమార్లు సవాళ్లు విసిరిన హరీశ్.. ఆ మాటను ఎంతలా నిలబెట్టుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదే కాదు.. పలుమార్లు ఆయన నోటి నుంచి సవాళ్లు రావటం.. వాటి విషయంలో ఆయన అంచనా తప్పినంతనే.. వాటి నుంచి ఎస్కేప్ అయ్యే తీరు తరచూ చర్చకు వస్తూనే ఉంటుంది. తాజా రుణమాఫీ ఎపిసోడ్ అందులో భాగమే తప్పించి మరొకటి లేదంటున్నారు. సవాళ్లు విసిరే వేళలోకాస్త వెనుకా ముందు చూసుకొని చేస్తే ఈ తిప్పలు తప్పుతాయి కదా హరీశ్?