Begin typing your search above and press return to search.

లోక్‌స‌భ‌లో టీడీపీ విప్‌గా గంటి త‌న‌యుడు

అయితే.. 2014లో ఓడిపోయారు. త‌ర్వాత‌.. పార్టీలో ఐటీడీపీ నాయ‌కుడిగా ప‌నిచేశారు. జిల్లా టీడీపీ కార్య‌ద‌ర్శిగా బాధ్య‌త‌లు చూశారు.

By:  Tupaki Desk   |   23 Jun 2024 1:19 PM GMT
లోక్‌స‌భ‌లో టీడీపీ విప్‌గా గంటి త‌న‌యుడు
X

లోక్‌స‌భ‌లో 16 మంది స‌భ్యులు ఉన్న టీడీపీ పార్టీకి విప్‌గా అమ‌లాపురం ఎంపీ, యువ నాయ‌కుడు గంటి హ‌రీష్ మాథుర్‌ను చంద్ర‌బాబుఎంపిక చేశారు. పార్టీలో ఎంతో మంది సీనియ‌ర్లు ఉన్నా.. గ‌తంలో హ‌రీష్ మాథుర్ తండ్రి.. మాజీ స్పీక‌ర్ గంటి మోహ‌న‌చంద్రబాల‌యోగి అందించిన సేవ‌ల‌కు గుర్తుగా ఇప్పుడు హ‌రీష్‌ను కీల‌క ప‌ద‌వికి చంద్ర‌బాబు ఎంపిక చేశారు. హ‌రీష్ మాథుర్‌.. 2014లోనే రాజ‌కీయ అరంగేట్రం చేశారు. అప్ప‌ట్లోనూ అమ‌లాపురం ఎంపీగానే పోటీ చేశారు.

అయితే.. 2014లో ఓడిపోయారు. త‌ర్వాత‌.. పార్టీలో ఐటీడీపీ నాయ‌కుడిగా ప‌నిచేశారు. జిల్లా టీడీపీ కార్య‌ద‌ర్శిగా బాధ్య‌త‌లు చూశారు. ఐటీ రంగంలో మంచి ప్ర‌వేశం ఉండ‌డంతో నారా లోకేష్ బృందంలోనూ కీల‌క నాయ‌కుడిగా ఎదిగారు. ఈ క్ర‌మంలో మ‌రోసారి 2019లోనూ ఆయ‌న‌కు అమ‌లాపురం టికెట్‌ను ఇచ్చారు. అయితే.. ఆ ఎన్నిక‌ల్లోనూ మాథుర్ ఓడిపోయారు. అయిన‌ప్ప‌టికీ.. నిరాశ ప‌డ‌కుండా.. పార్టీలోనే ఉన్నారు. ఒకానొక ద‌శ‌లో వైసీపీ నుంచి ఆహ్వానం అందినా.. ఆయ‌న టీడీపీలోనే ఉన్నారు.

తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో 3 ల‌క్ష‌ల పైచిలుకు ఓట్ల మెజారిటీతో అమ‌లాపురం నుంచి విజ‌యం ద‌క్కించు కున్నారు. తొలుత ఆయ‌న‌కు కేంద్ర మంత్రి ప‌ద‌వి ఇస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. కానీ, చంద్ర‌బాబు విప్ ప‌ద‌విని ఇచ్చారు. పార్ల‌మెంటు స‌మావేశాల స‌మ‌యంలో సభ్యుల ప‌నితీరును అంచ‌నా వేయ‌డం.. పార్టీ ఆదేశాల‌ను వారికి తెలియ‌జేసి.. ప్రాధాన్యం క‌ల్పించ‌డం.. వారు మాట్లాడుతున్న తీరును గ‌మ‌నించ‌డం.. నివేదిక‌లు ఇవ్వ‌డం.. కీల‌క స‌మ‌యాల్లో విప్ గాముఖ్య భూమిక పోషించ‌నున్నారు.

కాగా, మోహ‌న చంద్ర‌బాల‌యోగి.. వాజ‌పేయి హ‌యాంలో స్పీక‌ర్‌గా ప‌నిచేశారు. అప్ప‌ట్లో కూడా ఎన్డీయేతో టీడీపీ కూట‌మిగా ఏర్ప‌డింది. అప్ప‌ట్లో ఊహించ‌ని విధంగా వాజ‌పేయి.. స్పీక‌ర్ ప‌ద‌విని ఆఫ‌ర్ చేయ‌డంతో ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన మోహ‌న్‌చంద్ర‌బాల‌యోగిని చంద్ర‌బాబు ఈ ప‌ద‌వికి ఎంపిక చేశారు. వాస్త‌వానికి ఆయ‌న‌కు హిందీ , ఇంగ్లీష్ భాష‌లు పెద్ద‌గా రావు. అయినా.. అప్ప‌ట్లో ట్యూష‌న్ పెట్టించుకుని..త న ప‌నితీరును అన‌తికాలంలో నే మెరుగు ప‌రుచుకున్నారు. హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో సొంత జిల్లాలోనే మృతి చెందిన విష‌యం తెలిసిందే.