Begin typing your search above and press return to search.

కులం పేరుతో ఇదెక్కడి దరిద్రపుగొట్టు రాజకీయం హరీశ్ ?

ఈ ఉదంతాన్ని మర్చిపోకముందే.. ఆయన మరోసారి ప్రదర్శించిన 'తీరు' వేలెత్తి చూపేలా మారింది. గవర్నర్ ను అడ్డుపెట్టుకొని బీజేపీ నీచ రాజకీయాల్ని చేస్తోందన్నది హరీశ్ ఆరోపణ.

By:  Tupaki Desk   |   6 Oct 2023 4:30 PM GMT
కులం పేరుతో ఇదెక్కడి దరిద్రపుగొట్టు రాజకీయం హరీశ్ ?
X

గులాబీ పార్టీలో మంత్రి హరీశ్ తీరు రోటీన్ కు భిన్నంగా ఉంటుంది. రాజకీయ ప్రయోజనం కోసం ఆయన ఎంతకైనా తెగిస్తుంటారు. తనకు రక్షణ కవచంలా భావోద్వేగాల్ని వాడేస్తుంటారు. తన స్థాయికి ఏ మాత్రం సరిపోని రాజకీయాల్ని చేయటంలో ఆయన తర్వాతే ఎవరైనా. మొన్నటికి మొన్న తన నియోజకవర్గంలో కొత్త రైలు ప్రారంభోత్సవం వేళ.. స్టేషన్ లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటో లేదన్న కారణంగా ఆయన చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. గడిచిన పదేళ్ల కాలంలో తమ ప్రభుత్వం చేపట్టే అధికారిక కార్యక్రమాల్లో ప్రోటోకాల్ ప్రకారంగా ఏర్పాటు చేయని ఫోటోలు.. పేర్ల జాబితాపై ఒక్కసారి కూడా మాట్లాడని ఆయన.. తమ అధినేత ఫోటో లేకపోవటంపై తనకున్న ఆగ్రహాన్ని చేతల్లో చూపించేందుకు సైతం వెనుకాడలేదు.

అక్కడ ఏర్పాటు చేసిన ఎల్ ఈడీ టీవీని కాలితో తన్నేయటం.. తన సమక్షంలోనే ప్రధాని ఫోటోను తన వర్గీయులు చించేస్తున్నా వారించకపోవటం లాంటివి చూసినప్పుడు హరీశ్ లోని పరిణితి లేని నాయకుడి లక్షణం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. ఈ ఉదంతాన్ని మర్చిపోకముందే.. ఆయన మరోసారి ప్రదర్శించిన 'తీరు' వేలెత్తి చూపేలా మారింది. గవర్నర్ ను అడ్డుపెట్టుకొని బీజేపీ నీచ రాజకీయాల్ని చేస్తోందన్నది హరీశ్ ఆరోపణ.

ఎరుకల జాతికి చెందిన సత్తయ్యకు ఎమ్మెల్సీ పదవిని తిరస్కరించిన గవర్నర్ తమిళ సై తీరును ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. నామినేటెడ్ పదవుల కేటాయింపులో యూపీలో ఒక నీతి? తెలంగాణలో మరో నీతా? అంటూ ఆయన ధ్వజమెత్తారు. హరీశ్ మాటల్నే తీసుకుందాం. నిజంగానే యూపీలో ఇష్టారాజ్యంగా వ్యవహరించి ఉంటే.. జాతీయ పార్టీ హోదాలో ఆ దుర్మార్గాన్ని ఎత్తి చూపి.. జాతీయ స్థాయిలో తీవ్ర స్థాయిలో విరుచుకుపడే అవకాశాన్ని బీఆర్ఎస్ ఎందుకు వదులుకున్నట్లు?

యూపీ గవర్నర్ చేసింది తప్పే అయినప్పుడు.. వేలెత్తి ఎందుకు చూపనట్లు? దేశంలో ఎక్కడైనా విధానల పరంగా మంచి సంప్రదాయంలో జరగటం మంచిదే కదా? అలా జరగనప్పుడు వాటిని తప్పు పట్టాల్సిన బాధ్యత ఒక జాతీయ రాజకీయ పార్టీగా ఉంది కదా? అదే సమయంలో.. తప్పును తప్పుగా చూపించే సంప్రదాయాన్ని పాటిస్తూ ఉన్నప్పుడు అలాంటి తప్పులను తాము చేయకూడదు కదా?

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేసే వ్యక్తులకు ఉండాల్సిన కనీస అంశాలపై ఫోకస్ పెట్టకుండా.. తాము పంపిన ప్రపోజల్ ను రిజెక్టు చేశారన్న విషయాన్ని హైలెట్ చేస్తూ.. అందుకు కులాన్ని తెర మీదకు తీసుకురావటం ఎంతవరకు సరైనది అన్నది ప్రశ్న. రూల్ ప్రకారం రిజెక్టు చేసి ఉంటే.. దానికి సంబంధించిన లాజిక్ ను తీసుకొస్తే ప్రజలు సైతం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారు కదా? ప్రభుత్వం పంపిన ప్రపోజల్ ను తిరస్కరించినప్పుడు.. అందుకున్న కారణాల్ని ప్రస్తావిస్తూ నోట్ పంపుతారు కదా? అలాంటి అవకాశాన్నికేసీఆర్ సర్కారు గవర్నర్ కు ఎందుకు ఇచ్చినట్లు? అన్నది ప్రశ్న.

ఎమ్మెల్సీ పదవికి ఎరుకల వర్గానికి చెందిన ఒకరిని.. విశ్వబ్రాహ్మణుల వర్గం నుంచి మరొకరిని బీఆర్ఎస్ నామినేట్ చేయటం గవర్నర్ కు నచ్చలేదన్న ఆయన.. ఆ రెండు సామాజిక వర్గాల వారు బీజేపీకి బుద్ధి చెప్పాలని పిలుపునివ్వటం గమనార్హం. కులాల ప్రస్తావన తీసుకొచ్చి భావోద్వేగాన్ని తట్టి లేపేలా వ్యవహరిస్తున్న హరీశ్ తీరును తప్పు పట్టాల్సిందే. కులం ఏదైనా సరే.. అందరూ అందరిని గౌరవించాల్సిందే. ఆ విషయంలో తప్పులు జరిగితే.. వాటిని ప్రస్తావించటం బాగుంటుంది. అంతే తప్పించి.. తామేం చేసినా.. అందరూ ఆమోదించాల్సిందేనన్న మొండితనం మంచిదికాదు కదా? అన్నది ప్రశ్న. ఇలాంటి విషయాల్ని హరీశ్ ఎప్పటికి అర్థం చేసుకుంటారు?