గులాబీ కోటలో సూపర్ పవర్ గా మారనున్న హరీశ్!
ఎక్కడా వెనక్కి చూసుకోకుండా.. ప్రతి రౌండ్ ముగిసేసరికి ఆయన అధిక్యత అంతకంతకూ ఎక్కువ అవుతున్న పరిస్థితి
By: Tupaki Desk | 3 Dec 2023 6:51 AM GMTతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటివరకు వెలువడిన వివరాలన్నీ కూడా అధిక్యతలే కానీ.. అధికారిక గెలుపు ఎవరిది లేదు. ఇంకా.. ఓట్ల లెక్కింపు సాగుతూనే ఉంది. ఉదయం పదకొండున్నర గంటల సమయానికి కాంగ్రెస్ అధిక్యత మెజార్టీ స్థానాల్లో ఉండగా.. అధికార బీఆర్ఎస్ పార్టీ ఓట్ల వేటలో వెనుకబడి ఉంది. గ్రేటర్ పరిధిలోని 15 స్థానాలు మినహాయిస్తే.. తెలంగాణ వ్యాప్తంగా ఆ పార్టీ సత్తా చాటిన జిల్లాలు పెద్దగా లేవనే చెప్పాలి.
ఇదిలా ఉంటే.. మొదటి రౌండ్ నుంచి ఇప్పటివరకు వెలువడిన ఓట్లవివరాల్ని చూసినప్పుడు.. ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా.. గులాబీ నేతలు ఎవరు కూడా దూసుకెళుతున్న పరిస్థితి లేదు. ఆ లెక్కలోకి వెళ్లినప్పుడు సీఎం కేసీఆర్ మేనల్లుడు కమ్ మంత్రి హరీశ్ రావు ఒక్కరు మాత్రమే దూసుకెళుతున్నారని చెప్పాలి. ఓట్ల లెక్కింపు మొదలైన నాటి నుంచి ఉదయం పదకొండున్నర వరకు కూడా ఆయన బరిలో ఉన్న సిద్దిపేటలో దూసుకెళుతున్నారు.
ఎక్కడా వెనక్కి చూసుకోకుండా.. ప్రతి రౌండ్ ముగిసేసరికి ఆయన అధిక్యత అంతకంతకూ ఎక్కువ అవుతున్న పరిస్థితి. హరీశ్ తో పోలిస్తే.. ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేసిన రెండు స్థానాలతో పాటు.. మంత్రి కేటీఆర్ పోటీ చేసిన సిరిసిల్లతో సహా.. అప్ అండ్ డౌన్లు కనిపిస్తున్నాయి. కానీ.. హరీశ్ మాత్రం మాంచి జోరుతో ముందుకు సాగుతున్నారు. 2018 ఎన్నికల్లో ఆయన రికార్డు మెజార్టీనిసొంతం చేసుకోవటం తెలిసిందే.
2009 ఎన్నికల్లో 64వేల మెజార్టీతో విజయం సాధించగా.. 2010 ఉప ఎన్నికల్లో ఆయన 95వేలకు పైచిలుకు ఓట్ల మెజార్టీని సొంతం చేసుకున్నారు. రాష్ట్రవిభజన నేపథ్యంలో జరిగిన ఎన్నికల్లో 93వేలకు పైగా మెజార్టీ సాధించిన హరీశ్ రావు.. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 1,20,650 ఓట్లతో విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ స్థాయి మెజార్టీ ఇప్పుడు వచ్చే అవకాశం లేకున్నా.. గులాబీ పార్టీలో మిగిలిన వారందరికంటే కూడా మెరుగైన మెజార్టీతో పాటు.. ఆయనే అత్యధిక ఆధిక్యతను సొంతం చేసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని చెప్పాలి.
నిజానికి ఉద్యమ సమయం నుంచి మేనమామ కేసీఆర్ తోడు నిలిచి.. ఆయన వెన్నంటి ఉన్న హరీశ్ అధిక్యత గులాబీ పార్టీలో ఒక రేంజ్ లో ఉండేది. ఎప్పుడైతే కేటీఆర్ పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారో.. అంతకంతకూ ఎదుగుతూ వచ్చారు. చూస్తుండగానే హరీశ్ తో పోటీ పడే స్థాయి నుంచి.. ఆయన్ను తప్పుకోమనే వరకు వెళ్లారు. ఈ సమయంలో పార్టీలో కాసింత అధిపత్య పోరు నడించింది. ఇలాంటి వేళలో ఎంట్రీ ఇచ్చిన కేసీఆర్.. కొడుకు అధిక్యతకు పచ్చజెండా ఊపేయటమే కాదు.. తన రాజకీయ వారసుడు మేనల్లుడు కాదు కొడుకే అన్నవిషయాన్ని ఘనంగా చెప్పేశారు.
దీంతో.. నాటి టీఆర్ఎస్.. నేటి బీఆర్ఎస్ లో సెకండ్ పొజిషన్ కేటీఆర్ చేతికి వచ్చేసింది. అది మొదలు ఇప్పటివరకు ఆయన అధిక్యతే నడుస్తోంది. పేరుకు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ.. కేటీఆర్ డిఫ్యాక్టో సీఎంగా వ్యవహరిస్తుంటారన్న పేరున్న సంగతి తెలిసిందే. తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో కేటీఆర్ ప్రభావం కంటే హరీశ్ రావు చతురతే పార్టీని ఈ మాత్రం సీట్లు వచ్చేలా చేసిందంటున్నారు. ఇక.. ఎన్నికల ఫలితాల్లోనూ హరీశ్ తిరుగులేని అధిక్యతను ప్రదర్శిస్తున్నట్లుగా చెప్పాలి. మెజార్టీ పరంగానూ కేటీఆర్ కంటే హరీశ్ రావే ముందుంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తంగా చూస్తే.. ఈ ఎన్నికల ఫలితాల అనంతరం గులాబీ కోటలో హరీశ్ సూపర్ పవర్ గా మారతారన్న మాట వినిపిస్తోంది.