Begin typing your search above and press return to search.

ట్రాక్ మార్చవా హరీశ్? చెప్పిందే చెప్పి అలారంగా మారుడేంది?

తమ చేతి నుంచి అధికారం చేజారిపోయిందన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేని రీతిలో హరీశ్ ఉన్నట్లుగా కనిపిస్తోంది.

By:  Tupaki Desk   |   5 Feb 2024 4:52 AM GMT
ట్రాక్ మార్చవా హరీశ్? చెప్పిందే చెప్పి అలారంగా మారుడేంది?
X

మాట్లాడితే అందులో కాస్త అర్థం పరామర్థం ఉండాలి. సామాన్యుల సంగతిని పక్కన పెడదాం. కీలక రాజకీయ నేతగా పేరున్న మాజీ మంత్రి హరీశ్ రావు లాంటోళ్లు ఎంత జాగ్రత్తగా ఉండాలి. తమ నోటి నుంచి వచ్చే మాటల్ని ఆచితూచి అన్నట్లుగా నిర్ణయాలు తీసుకోవాలే తప్పించి.. తొందరపాటు పనికిరాదు. గులాబీ పార్టీకి ట్రబుల్ షూటర్ గా పేరున్న ఆయనకు.. ఏ టాస్కు ఇచ్చినా ఇట్టే పూర్తి చేస్తారని చెబుతారు. చేతిలో అధికారం ఉన్న వేళ.. ఏమైనా చేయొచ్చు కానీ పవర్ లేనప్పుడు మాత్రమే సమస్యలన్ని.

తమ చేతి నుంచి అధికారం చేజారిపోయిందన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేని రీతిలో హరీశ్ ఉన్నట్లుగా కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డిని అదే పనిగా అలెర్టు చేస్తున్న వైనం విస్మయానికి గురి చేస్తోంది. సాధారణంగా ఒక కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత వారు కుదురుకోవటానికి కనీసం ఆర్నెల్ల సమయాన్ని ఇవ్వటం చేస్తుంటారు. కానీ.. హరీశ్ కానీ.. మరో మాజీ మంత్రి కేటీఆర్ కానీ మొదటి వారం నుంచే ఎదురుదాడి మొదలు పెట్టారు.

నిద్ర లేచింది మొదలు నోరు తెరిస్తే చాలు రేవంత్ రెడ్డి సర్కారు హామీలు అమలు చేయలేదంటూ అదే పనిగా విమర్శిస్తున్న వైనంపై ప్రజలు సైతం హర్షించటం లేదు. ఆ మాటకు వస్తే చెవిలో జోరీగ మాదిరి ఆరు గ్యారెంటీ హామీల్ని అమలు చేయలేదని విరుచుకుపడటం ఎక్కువైంది. ప్రభుత్వం కొలువు తీరి రెండు నెలలు కాలేదు.

ఎన్నికల ప్రచారంలోనే వంద రోజుల్లో ఆరు హామీల్ని కచ్ఛితంగా అమలు చేస్తామని చెప్పినప్పుడు.. కనీసం వంద రోజుల పాటు మౌనంగా ఉండి.. రేవంత్ సర్కారు తప్పొప్పులను మదింపు చేయాల్సిన అవసరం ఉంది. అలాంటిదేమీ లేకుండా డైలీ బేసిస్ లో ఘాటు విమర్శలు చేయటం బాగోలేదన్న మాట వినిపిస్తోంది.

ఒకవిధంగా చెప్పాలంటే హరీశ్ మాటలు రేవంత్ సర్కారుకు శాపంగా కంటే వరంగా మారుతున్నాయి. నిత్యం హామీల అమలు గురించి మాట్లాడుతుంటే.. అదో టైం అలెర్టుగా మారిన పరిస్థితి. తాను ఇచ్చిన హామీల్ని అమలు చేసేందుకు ఉన్న గడువును గుర్తుకు తెస్తున్న తీరుతో రేవంత్ కు లాభమే అవుతుందని చెప్పాలి. ప్రభుత్వానికి పని చేసేందుకు అవసరమైన టైంను ఇస్తే.. ఆ లోపు ఏమేం చేస్తారో అర్థమవుతుంది. కానీ.. హరీశ్ మాత్రం ఏ రోజుకు ఆ రోజు అలారం లెక్కన అలెర్టు చేస్తున్న వైనం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. ట్రబుల్ షూటర్ లాంటి పెద్ద పేర్లు.. బిరుదులు సొంతం చేసుకునే వారు.. పేరుకు తగ్గట్లుగా వ్యవహరించాలన్న సోయి లేకపోవటం దేనికి నిదర్శనం?