లాజిక్ మిస్సయ్యితే ఎలా రావు గారు ?
పాపం ఓటమి దెబ్బకు ఏమి మాట్లాడుతున్నారో కూడా బీఆర్ఎస్ నేతలకు తెలుస్తున్నట్లు లేదు
By: Tupaki Desk | 19 Jan 2024 3:30 PM GMTపాపం ఓటమి దెబ్బకు ఏమి మాట్లాడుతున్నారో కూడా బీఆర్ఎస్ నేతలకు తెలుస్తున్నట్లు లేదు. గజ్వేలులో హరీష్ రావు ఆధ్వర్యంలో కృతజ్ఞత సభ జరిగింది. ఈ సభలో హరీష్ మాట్లాడుతూ గజ్వేల్ లో కేసీయార్ ను ఓడించేందుకు అనేక కుట్రలు జరిగినట్లు ఆరోపించారు. అయితే ఎవరెన్ని కుట్రలు చేసినా కేసీయార్ భారీ మెజారిటితో గెలిచిన విషయాన్ని మాజీమంత్రి గుర్తుచేశారు. కేసీయార్ ను ఓడించేందుకు రెండు జాతీయ పార్టీలు పనిచేసినట్లు తెగ ఫీలైపోయారు.
ప్రాంతీయ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ ను కేసీయార్ జాతీయ పార్టీ బీఆర్ఎస్ గా మార్చిన విషయాన్ని హరీష్ మరచిపోయారేమో. ఇక్కడే హరీష్ మాటల్లోని డొల్లతనమంతా బయటపడింది. ఒక నియోజకవర్గంలో ముగ్గురు పోటీచేసినపుడు ముగ్గురు కూడా ఒకళ్ళకి మరొకళ్ళు ప్రత్యర్ధులే కదా. అప్పుడు ప్రతి ఒక్కళ్ళు మరొకరిని ఓడించేందుకు ప్రయత్నం చేసుకోవటం చాలా సహజం. ఇందులో కుట్ర ఏముందో హరీష్ కే తెలియాలి. గజ్వేలులో కేసీయార్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్, బీజేపీ అభ్యర్ధులు కూడా పోటీచేశారు. చివరి నిముషం వరకు గెలుపు కోసమే ప్రయత్నాలు చేసుకున్నారు.
ట్రయాంగిల్ పోటీలో కేసీయార్ గెలిచారంతే. ఇందులో పై రెండు పార్టీలు చేసిన కుట్రేమున్నది ? గెలుపుకోసం కాకపోతే అభ్యర్ధులు ఓడిపోవటానికి పోటీచేస్తారా ? భారీ మెజారిటితో కేసీయార్ గెలిచారని హరీష్ చెప్పింది నిజమే. అయితే కేసీయార్ ఓడిపోయిన కామారెడ్డి సంగతి ఎందుకు ప్రస్తావించలేదు ? ఎన్నికల్లో గెలుపోటములు చాలా సహజం. అంతేకానీ తాము గెలిస్తే గొప్పన్నట్లు ఓడిపోతే ప్రత్యర్ధులు కుట్రచేశారని అనటం అవివేకం.
సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్న హరీష్ కూడా కేసీయార్ ను ఎన్నికల్లో ఓడించటానికి కుట్ర జరిగిందని ఆరోపించటమే విచిత్రంగా ఉంది. ప్రత్యర్ధులను ఓడించటం కుట్ర ఎలాగవుతుందో హరీషే చెప్పాలి. గెలుపుకోసం ఎవరికి అందుబాటులో ఉన్నా మార్గాల్లో వాళ్ళు ప్రయత్నాలు చేసుకుంటారని హరీష్ కు తెలీదా ? ఓటమి దెబ్బ కేసీయార్, కేటీయార్ తో పాటు హరీష్ మీద కూడా బాగానే ప్రభావం చూపుతున్నట్లుంది. అందుకనే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. గజ్వేలులో ప్రత్యర్ధులపై కుట్రలు చేసే కేసీయార్ గెలిచారని ఎవరైనా రివర్సులో ఆరోపిస్తే హరీష్ అంగీకరిస్తారా ?