సిద్దిపేటలో అర్ధరాత్రి హైడ్రామా.. హరీశ్ ఇంటి దగ్గర అలా!
ఈ ఉదంతంపై తాజాగా హరీశ్ రావు స్పందించారు. తన అధికారిక నివాసంపై అర్థరాత్రి కాంగ్రెస్ గూండాలు దాడి చేసి తాళాలు పగలగొట్టి.. ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేశారన్నారు.
By: Tupaki Desk | 17 Aug 2024 4:45 AM GMTరైతులకు రుణమాఫీ ఇచ్చే విషయంలో రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యిందన్న వాదనను వినిపిస్తున్న మాజీ మంత్రి హరీశ్ పై కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సవాలులో భాగంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి రావటంతో.. ఈ అంశం నుంచి తప్పించుకోవటానికి హరీశ్ రావు లేని నిందల్ని రేవంత్ సర్కారు మీద వేస్తున్నట్లుగా చెబుతున్నారు. పంద్రాగస్టు లోపు రుణమాఫీని అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటిస్తే.. చేయలేరని.. అలా చేసిన పక్షంలో తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తామని హరీశ్ సవాలు విసిరారు.
అయితే.. రైతు రుణమాఫీని తాము చెప్పినట్లే పూర్తి చేశామని.. హరీశ్ రావు రాజీనామానే మిగిలిందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయటం.. దీనిపై హరీశ్ తీవ్రంగా రియాక్టు కావటం తెలిసిందే. రుణమాఫీ అమలు చేయకుండానే అమలు చేశారని ఎలా చెబుతారని.. ఇలాంటి ముఖ్యమంత్రిని తామెప్పుడూ చూడలేదని మండిపడ్డారు. ఇలా మాటల యుద్ధానికి ఫ్లెక్సీయుద్ధం తోడైంది. గడువు లోపు రైతు రుణమాఫీ అమలు చేయటం పూర్తైందని.. హరీశ్ రావు రాజీనామానే మిగిలి ఉందంటూ హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి.
ఇదిలా ఉంటే.. శుక్రవారం అర్థరాత్రి వేళ సిద్ధిపేటలోని హరీశ్ రావు క్యాంప్ కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు చేరుకున్నారు. ఎమ్మెల్యే పదవికి హరీశ్ రావు రాజీనామా చేయాలని నినాదాలు చేశారు.దీంతో.. బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడికి చేరుకోవటంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అదే సమయంలో.. హరీశ్ రావు క్యాంప్ ఆఫీసు వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని కాంగ్రెస్ కార్యకర్తలు కొందరు చించేశారు. దీంతో.. అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఈ ఉదంతంపై తాజాగా హరీశ్ రావు స్పందించారు. తన అధికారిక నివాసంపై అర్థరాత్రి కాంగ్రెస్ గూండాలు దాడి చేసి తాళాలు పగలగొట్టి.. ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేశారన్నారు. ఈ దాడిని అడ్డుకోవాల్సిన పోలీసులే దుండగులకు రక్షణ కల్పించారన్నారు. ఒక ఎమ్మెల్యే నివాసంపైనే ఇంత దారుణంగా దాడి జరిగిందంటే, ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి? అని ప్రశనించారు. పోలీసుల సమక్షంలో ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం కాంగ్రెస్ మార్క్ పాలనకు నిదర్శనమని, ఈ ఘటనపై తెలంగాణ డీజీపీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కీలక అంశాల్లో సవాలు విసరటం.. ఆ తర్వాత దాన్ని పట్టించుకోని హరీశ్ రావు.. ఈసారి అందుకు భిన్నమైన అనుభవం ఎదురవుతుందన్న వాదన వినిపిస్తోంది.