రేవంత్ లాంటి వారివల్లే.. తెలంగాణ బలిదానాలు: హరీష్‌రావు
రేవంత్‌రెడ్డికి ఇప్పుడు పదవులు దక్కడం.. కేసీఆర్ పుణ్యమేనని హరీష్‌రావు చెప్పారు. ఆయన తెలంగాణ తీసుకురాకుండా ఉండి ఉంటే.. ఇప్పుడు పీసీసీ చీఫ్ కానీ, ముఖ్యమంత్రి కానీ అయి ఉండేవారా? అని ప్రశ్నించారు.
By: Tupaki Desk | 30 July 2024 12:30 AM GMTరేవంత్‌రెడ్డి వంటి నాయకుల కారణంగానే తెలంగాణ కోసం బలిదానాలు జరిగాయని మాజీ మంత్రి, బీఆర్ ఎస్ సీనియర్ నేత హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యమ సమయంలో అనేక సార్లు కేసీఆర్ రాజీనామాలు చేశారని..కానీ, రేవంత్‌రెడ్డి వంటివారు.. నకిలీ రాజీనామాలు కూడా చేయలేదని.. అందుకే తెలంగాణ వస్తుందో రాదో అనే బెంగతో ఎంతో మంది బలిదానాలు చేశారని .. దీనికి కారణం ఇలాంటి వారేనని చెప్పారు.
రేవంత్‌రెడ్డికి ఇప్పుడు పదవులు దక్కడం.. కేసీఆర్ పుణ్యమేనని హరీష్‌రావు చెప్పారు. ఆయన తెలంగాణ తీసుకురాకుండా ఉండి ఉంటే.. ఇప్పుడు పీసీసీ చీఫ్ కానీ, ముఖ్యమంత్రి కానీ అయి ఉండేవారా? అని ప్రశ్నించారు. కేసీఆర్ పూనుకొని ఉద్యమా లు, దీక్షలు చేయబట్టే.. తెలంగాణ తీసుకురాబట్టే.. ఇప్పుడు పదవులు అనుభవిస్తున్నారని చెప్పారు. తెలంగాణ రాకపోయి ఉంటే.. రేవంత్ రెడ్డి ఇంకా చంద్రబాబు చెంతనే ఉండేవారని వ్యాఖ్యానించారు. ''తెలంగాణ కోసం ఉద్యమిస్తున్నవారిపై రైఫిల్ దూసింది ఎవరో అందరికీ తెలుసు'' అని హరీష్ అన్నారు.
తెలంగాణ ఛాంపియన్‌నని తనకు తానే సర్టిఫికేట్లు ఇచ్చుకోవడం అంటే రేవంత్ రెడ్డి దయ్యాలు వేదాలు వల్లించినట్టేనని వ్యాఖ్యా నించారు. ఈ సందర్భంగా దివంగత జైపాల్ రెడ్డిని కూడా హరీష్‌రావు విమర్శించారు. తెలంగాణ సాధన కోసం ఆయన ఎవరినైనా ఒప్పించారా? అని ప్రశ్నించారు. కేసీఆర్ ఏకంగా జాతీయ ప్రాంతీయ పార్టీలైన 36 పార్టీలను ఒప్పించారని తెలిపారు. తెలంగాణ ఏర్పాటు ఖాయమని అనుకున్నాకే.. రేవంత్ రెడ్డి తెలంగాణకు అనుకూలంగా మాట్లాడారని దుయ్యబట్టారు.
బీఆర్ ఎస్ పని అయిపోలేదు!
బీఆర్ ఎస్ పని అయిపోయిందని కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారని.. కానీ.. ఆ పార్టీ సజీవమని హరిష్ చెప్పారు.కాంగ్రెస్ రెండు సార్లు ఓడిపోయిందని.. మరి ఆ పార్టీ పని అయిపోయిందని అనుకోవాలా? గతంలో ఒకసారి ప్రతిపక్ష హోదా కూడారాలేదని.. ఈ విషయాలు గుర్తు పెట్టుకోవాలని సూచించారు. జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ ఒకప్పుడు 18 రాష్ట్రాల్లో కనీసం గెలవలేదన్నారు. ఇండియా కూటమి 28 పార్టీలతో ఏర్పడిందన్న హరీష్‌రావు.. ఇప్పుడు కాంగ్రెస్ గెలిచింది కేవలం 99 సీట్లేనని.. బీఆర్ ఎస్ పని అయిపోలేదని, పుంజుకుంటామని తేల్చి చెప్పారు.