ఆ గాడ్ ఫాదర్ పేరు ఏదో చెప్పేయొచ్చుగా హరీశ్?
ఇందులో భాగంగా తాజాగా హరీశ్ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 18 Aug 2024 3:30 PM GMTరైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్.. కాదు.. అసలు కాలేదంటూ మాజీ మంత్రి హరీశ్ లు వాదులాడుకోవటం తెలిసిందే. చెప్పినట్లే.. చెప్పిన సమయానికి రుణమాఫీని అమలు చేశామని.. సవాలులో భాగంగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలంటూ మాజీ మంత్రి హరీశ్ పై వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే.. ఆయన మాటలకు స్పందించిన హరీశ్.. లక్షలాది మంది రైతులకు రుణమాఫీ ఇవ్వకుండా ఎగ్గొట్టారని.. రుణమాఫీ అసలే అమలు కాలేదని హరీశ్ తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో మాటల యుద్ధం రెండు రోజులుగా సాగుతోంది.
ఈ క్రమంలో హరీశ్ రాజీనామా కోరుతూ ఫ్లెక్సీలు తెర మీదకు వస్తే.. అందుకు ప్రతిగా ముఖ్యమంత్రి రేవంత్ రాజీనామా చేయాలని.. ఆయన మాట తప్పారంటూ హరీశ్ వర్గం ఎదురుదాడికి దిగింది. ఈ క్రమంలో పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి. రుణమాఫీ అమలు విషయానికి వస్తే.. నూటికి నూరు శాతం జరగలేదు. కాకుంటే.. సాంకేతిక సమస్యలతో కొందరి రుణమాఫీ జరగనప్పటికీ.. మెజార్టీ రుణమాఫీ కార్యక్రమం పూర్తైంది. రుణమాఫీ కాని వారి వెతలు తీర్చేందుకు ఇప్పటికే అధికార యంత్రాంగం రంగంలోకి దిగి.. వారి డేటాను సేకరించి.. సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ ప్రయత్నాల్ని పట్టించుకోని ప్రతిపక్షం మాత్రం రాజకీయదాడిని ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా హరీశ్ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బూతులు తిడితే రుణమాఫీ జరిగి.. రైతుల ఖాతాల్లో డబ్బులు పడతాయా? అని ప్రశ్నిస్తున్నారు. దమ్ముంటే.. రైతుల రుణమాఫీ ఎంత మందికి జరిగిందో శ్వేతపత్రాన్ని విడుదల చేస్తారా? అని ముఖ్యమంత్రి రేవంత్ ను సవాలు విసిరారు.
అయితే.. ఒక సవాలుకు దిక్కులేదని.. ఇప్పుడు మరో సవాలు ఎలా విసురుతారు? అంటూ హరీశ్ తీరుపై మండిపాటు వ్యక్తమవుతోంది. తప్పు జరిగిందని.. రైతులకు క్షమాపణలు చెప్పి.. ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రాజీనామా చేయాలంటూ హరీశ్ డిమాండ్ చేస్తున్నారు. "రుణమాఫీలో కోతలపై ప్రశ్నిస్తే మేం చావాలని రోత మాటలు మాట్లాడుతున్నారు. నీ గాడ్ ఫాదర్ కే భయపడలేదు. తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదు" అంటూ మండిపడ్డారు.
హరీశ్ మాటలన్ని బాగున్నాయి కానీ.. ఆయన మధ్యలో తీసుకొచ్చిన ఈ గాఢ్ ఫాదర్ ఎవరు? ఆయన ప్రస్తావన ఎందుకు? అన్నది ప్రశ్న. ఒకవేళ.. రేవంత్ ను టార్గెట్ చేయాలనే అనుకుంటే.. ఓపెన్ గా రేవంత్ గాఢ్ ఫాదర్ పేరును చెప్పేస్తే సరిపోతుంది కదా? దానికో ఫజిల్ ఎందుకు? అన్నది ప్రశ్న. అవసరమైన అంశాల్ని ప్రస్తావించాల్సిన వేళలో.. అనవసర అంశాల ప్రస్తావన అవసరమా? అన్న ప్రశ్నను హరీశ్ కు సంధిస్తున్నారు. పాయింట్ వదిలేసి.. చర్చ పక్కదారి పట్టే మాటలు హరీశ్ తగ్గించుకుంటే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.