Begin typing your search above and press return to search.

హరీష్ రావు... సీనియారిటీని తగ్గించుకోకు ....మేధావుల మాట !

అయితే బీఆర్ ఎస్ ఓడాక మాజీ మంత్రిగా హరీష్ రావు హుందాగా ఉంటే బాగుంటుంది అన్న సూచనలు మేధావుల నుంచి వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   10 Dec 2023 10:52 AM GMT
హరీష్ రావు...  సీనియారిటీని తగ్గించుకోకు ....మేధావుల మాట  !
X

బీఆర్ ఎస్ లో సీనియర్ మోస్ట్ నేత హరీష్ రావు అని చెప్పాలి. టీడీపీని వదిలి ఆ పార్టీ ద్వారా సంక్రమించిన డిప్యూటీ స్పీకర్ పదవిని వదిలి బయటకు వచ్చిన తరువాత మేనమామ కే చంద్రశేఖరరావుకు చేదోడు వాదోడుగా ఉన్నది ఒక్క హరీష్ రావు మాత్రమే. బీఆర్ఎస్ పునాదిలో ఆయన ఉన్నారు. ఆయనది దాదాపుగా రెండు దశాబ్దాల రాజకీయ అనుభవం. సుదీర్ఘ ప్రస్థానం.

అలాంటి హరీష్ రావు కేసీఆర్ మంత్రివర్గంలో పలు కీలక శాఖలు కూడా నిర్వహించారు. ఆయన సిద్ధిపేటలో వరసబెట్టి గెలుస్తూ మంచి మెజారిటీని కూడా తెచ్చుకుంటున్నారు. ఇక మంచి వాగ్దాటి కలిగిన నేతగా ప్రజా నాయకుడుగా కేసీఆర్ కి సిసలైన వారసుడిగా హారీష్ రావుకు మంచి పేరు ఉంది.

అయితే బీఆర్ ఎస్ ఓడాక మాజీ మంత్రిగా హరీష్ రావు హుందాగా ఉంటే బాగుంటుంది అన్న సూచనలు మేధావుల నుంచి వస్తున్నాయి. తెలంగాణాలో బీఆర్ఎస్ ఇలా దిగింది అలా రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఇదంతా జరిగి జస్ట్ రోజుల వ్యవధే అయింది. కనీసం నాలుగు రోజులు కూడా పట్టుమని కాలేదు. ఇంతలో విమర్శలు సంధించడం మొదలెడుతున్నారు బీఆర్ఎస్ నాయకులు.

ముఖ్యంగా చూస్తే అన్నీ తెలిసిన ఆర్ధిక మంత్రిగా పనిచేసిన హరీష్ రావు అయితే విమర్శించాలని విమర్శలు చేస్తున్నారని మేధావులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ తాజాగా హరీష్ రావు ఏమన్నారు అంటే రైతు బంధు ఎపుడు చెల్లిస్తారు అని. దీని మీదనే కాంగ్రెస్ నుంచి మాత్రమే కాక మేధావుల నుంచి కూడా సెటైర్లు పడుతున్నాయి.

పదేళ్ల పాటు తెలంగాణాను బీఆర్ఎస్ పాలించింది. ఇపుడు కాంగ్రెస్ కొత్తగా పవర్ లోకి వచ్చింది. మరి ఇంకా ఏమీ సర్దుకోలేదు అంతలోనే పీక మీద కత్తి పెట్టినట్లుగా రైతు బంధు ఎపుడు అంటూ హరీష్ రావు నిగ్గదీయడం పట్ల చర్చ అయితే సాగుతోంది. ఇక కాంగ్రెస్ మంత్రి జూపల్లి క్రిష్ణారావు అయితే హరీష్ రావుకు గట్టిగానే కౌంటర్ వేశారు.

హరీష్ రావు ఏ మాత్రం జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని జూపల్లి ఫైర్ అయ్యారు. పదేళ్ళ పాటు అధికారంలో ఉండి ఇచ్చిన మాటను బీఆర్ఎస్ పెద్దలు నిలబెట్టుకోలేదని జూపల్లి మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారం చేపట్టి కేవలం రెండు రోజులు మాత్రమే అయింది. ఇంతలోనే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఏమనాలి అంటూ జూపల్లి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయినా సరే కేవలం రెండు రోజుల వ్యవధిలోనే పధకాల అమలుకు శ్రీకారం చుట్టామని జూపల్లి అంటున్నారు. ఇక కేసీఆర్ ప్రభుత్వంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయింది అని జూపల్లి తీవ్ర ఆరోపణలు చేశారు. మొత్తానికి హరీష్ రావు చేసిన కామెంట్స్ ఇపుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతునాయి.

ఏ ప్రభుత్వానికి అయినా హానీమూన్ పీరియడ్ అని ఒకటి ఉంటుంది. అంతవరకూ ఎవరూ ఏమీ మాట్లాడరు. ఇక కాంగ్రెస్ అధికారంలో గట్టిగా కుదురుకోలేదు కానీ అపుడే అన్నీ చేయాలని అనడం ద్వారా హరీష్ రావు తన స్థాయిని సీనియారిటీని తగ్గించుకుంటున్నారని కూడా మేధావి వర్గాల నుంచి వినిపిస్తోంది. మరి హరీష్ రావు ఇలాగే నిలదీస్తూ పోతారా లేక కొన్నాళ్ళు అయినా సంయమనం పాటిస్తారా అన్నది చూడాల్సి ఉంది.