Begin typing your search above and press return to search.

అప్పుడు 'సాక్షి'.. ఇప్పుడు నిందితురాలా: హ‌రీష్ రావు ఫైర్‌

బీఆర్ ఎస్ నాయ‌కురాలు, ఎమ్మెల్సీ క‌విత అరెస్టుపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్‌రావు ఫైర‌య్యారు

By:  Tupaki Desk   |   15 March 2024 4:31 PM GMT
అప్పుడు సాక్షి.. ఇప్పుడు నిందితురాలా:  హ‌రీష్ రావు ఫైర్‌
X

బీఆర్ ఎస్ నాయ‌కురాలు, ఎమ్మెల్సీ క‌విత అరెస్టుపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్‌రావు ఫైర‌య్యారు. ఈడీ అధికారులు త‌ప్పుల‌పై త‌ప్పులు చేస్తున్నార‌ని ఆయ‌న దుయ్య‌బ‌ట్టారు. ''ఏడాది కింద‌ట సాక్షి కింద ప‌రిగ‌ణించి నోటీసులు ఇచ్చారు. కాని, ఇప్పుడు నిందితురాలిగా పేర్కొంటూ అరెస్టు చేశారు. ఏడాదిలోనే సాక్షి.. నిందితురాలైందా? దీనివెనుక కుట్ర ఉంది'' అని ఆయ‌న అన్నారు. క‌విత‌ అక్రమ అరెస్టును రాజకీయంగా, న్యాయపరంగా ఎదుర్కొంటామని చెప్పారు. న్యాయవ్యవస్థపై తమకు నమ్మకం ఉందని తెలిపారు.

క‌విత అక్రమ అరెస్టుపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి చట్టపరంగా పోరాడుతామని హ‌రీష్‌రావు తెలిపారు. బీజేపీ తమపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, కవిత అరెస్ట్‌ను నిరసిస్తూ శ‌నివారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనల‌కు పిలుపునిస్తున్న‌ట్టు తెలిపారు. ''ఏడాదిన్నర క్రితం విట్‌నెస్(సాక్షి) కింద నోటీసులు ఇచ్చామని చెప్పిన ఈడీ... ఈరోజు వచ్చి అక్యూస్డ్(నిందితురాలు) కింద అరెస్ట్ చేస్తున్నామని చెప్పడం దారుణం. బీజేపీ, కాంగ్రెస్ కలిసి మా పార్టీపై కుట్రలు పన్నుతున్నాయి. కవిత అరెస్ట్ ద్వారా మా పార్టీ ప్రతిష్టను, కేసీఆర్ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారు'' అని హ‌రీష్ రావు మండిప‌డ్డారు.

తమది ఉద్యమాల పార్టీ అని... ఇవి తమకు కొత్త కాదని హ‌రీష్‌రావు అన్నారు. ఇలాంటి కుట్రలు, అణిచివేతలను, అక్రమ కేసులు ఎదుర్కోవడం ఉద్యమ కాలం నుంచి తెలిసిందేన‌ని చెప్పారు. కవిత అరెస్టుపై ముందే ప్లాన్ చేసుకొని ఈడీ అధికారులు వచ్చారని, ఈ విష‌యం త‌మ‌కు అర్ధ‌మైంద‌ని, అంతా పథకం ప్రకారమే జరిగిందని వ్యాఖ్యానించారు. ఈడీ అధికారులు ముందు గానే ఫ్లైట్ టిక్కెట్ బుక్ చేసుకున్నారని తెలిపారు. రేపు ఈసీ నోటిఫికేషన్ వస్తుందనగా ఈ రోజు అరెస్ట్ చేశారని విమర్శించారు. ఈ నెల 19న సుప్రీం కోర్టు తీర్పు రావడానికి మూడు నాలుగు రోజుల ముందు అరెస్ట్ ఏమిటి? అని ప్రశ్నించారు.

కోర్టుకు సెల‌వు చూసుకుని వ‌చ్చారు!

ఉద్దేశ పూర్వ‌కంగా త‌మ‌ను ఇబ్బంది పెట్టేందుకు ఈడీ ప్ర‌య‌త్నించింద‌ని హ‌రీష్‌రావు అన్నారు. కావాలనే శుక్రవారం వచ్చారని అన్నారు. అది కూడా మధ్యాహ్నమే వచ్చారని తెలిపారు. తద్వారా కోర్టుకు వెళ్లకుండా పథకం వేశారని మండిప‌డ్డారు. కోర్టు సమయం అయిపోయాక సాయంత్రం ఐదున్నరకు అరెస్ట్ చేస్తున్నట్లు చెప్పారని మండిపడ్డారు.