పాపం... చంద్రబాబు అరెస్టుపై హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు!
"పాపం ఈ వయసులో ఆయన్ను అరెస్ట్ చేశారు.. ఇది దురదృష్టకరం.. ఈ వయసులో ఆయనను చేయడం మంచిది కాదు" అని అన్నారు హరీశ్.
By: Tupaki Desk | 30 Sep 2023 12:48 PM GMTస్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు గత 21 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో బాబు అరెస్ట్ పై స్పందనలు, ఖండనలు ఆశించిన స్థాయిలో రాలేదని కొంతమంది, ఊహించిన స్థాయిలో రాలేదని ఇంకొంతమంది వ్యాఖ్యానిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హరీశ్ రావు స్పందించారు.
అవును... చంద్రబాబు అరెస్ట్ పై చెదురుమదురుగా బీజేపీ నేతలు, కొంతమంది కాంగ్రెస్ నేతలు స్పందించిన నేపథ్యంలో... అధికార బీఆరెస్స్ నేతలు కూడా స్పందిస్తున్నారు. ఈ విషయంలో ముందుగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పందించిన సంగతి తెలిసిందే. తెలిసో తెలియకో తప్పులు జరుగుతాయి.. కక్ష సాధింపు కంటే క్షమాభిక్ష గొప్పదని చెప్పుకొచ్చారాయన.
అనంతరం మాజీ టీడీపీ నేత మోత్కుపల్లి స్పందిస్తూ... "74 ఏళ్ల చంద్రబాబు లాంటి పెద్దమనిషిని, దేశానికే నాయకుడిగా ఉన్నటువంటి నాయకుడిని, ఎన్డీయేలో నాడు కన్వీనర్ గా పనిచేసిన నాయకుడిని, వాజపేయి ప్రభుత్వంలో పెద్దమనిషిగా ఉన్న నాయకుడిని తీసుకపోయి జైల్లో పెడతారండీ" అని ప్రశ్నిస్తూ అనంతరం జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. అనంతరం కర్నాటక కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యారు.
ఆ సంగతి అలా ఉంటే... తాజాగా చంద్రబాబు అరెస్ట్ పై మంత్రి హరీశ్ రావు స్పందించారు. సిద్దిపేట్ జిల్లా నంగునూరు మండలం నర్మెట్టలో ఆయిల్ ఫాం కర్మగారానికి మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో చంద్రబాబు అరెస్ట్ పై స్పందించారు హరీష్ రావు. ఇందులో భాగంగా... ఈ వయసులో చంద్రబాబుని అరెస్ట్ చేయడం దురదృష్టకరమన్నారు.
"పాపం ఈ వయసులో ఆయన్ను అరెస్ట్ చేశారు.. ఇది దురదృష్టకరం.. ఈ వయసులో ఆయనను చేయడం మంచిది కాదు" అని అన్నారు హరీశ్. గతంలో ఏపీలో ఎకరం అమ్మితే తెలంగాణలో పదెకరాలు వచ్చేవి కానీ... ఇప్పుడు తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రలో వంద ఎకరాలు వస్తున్నాయని చంద్రబాబు అన్నారు అని చెప్పే సందర్భంలో హరీశ్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆ సంగతి అలా ఉంటే... ఈ రోజు సాయంత్రం 7 గంటలకు ఐదు నిమిషాల పాటు గిన్నెలపై గరిటెలతో కొట్టడం, గంటలు వాయించడం, విజిల్స్ వేయడం, హారన్లు మోగించడం వంటి శబ్ధాలు చేయాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి "మోత మోగిద్దాం" అనే నామకరణం చేశారు.