మనలో మన మాట హరీశ్.. అత్యాచారాలకు సర్కారుకు లింకేంటి?
గడిచిన కొద్ది రోజులుగా రేవంత్ రెడ్డి సర్కారును బద్నాం చేయటమే లక్ష్యంగా ఆయన పెట్టుకున్నారు.
By: Tupaki Desk | 31 July 2024 9:30 AM GMTప్రభుత్వాన్ని నడిపిన అనుభవం ఉన్నోళ్లు సైతం ఇష్టారాజ్యంగా మాట్లాడటం తప్పు. అధికారం లేనంత మాత్రాన ప్రతిది ప్రభుత్వ వైఫల్యమనే విషయాన్ని ఎలా ముద్ర వేయగలుగుతాం. ప్రభుత్వాన్ని నిందించే సందర్భంలో సంయమనం అవసరం. అదేమీ లేకుండా.. ప్రతి విషయానికి ప్రభుత్వాన్ని నిందించటం ఒక అలవాటుగా చేసుకున్న మాజీ మంత్రి హరీశ్ రావు తీరు చూస్తే.. ఆయన మీద ఉన్న గౌరవం తగ్గే పరిస్థితి. గడిచిన కొద్ది రోజులుగా రేవంత్ రెడ్డి సర్కారును బద్నాం చేయటమే లక్ష్యంగా ఆయన పెట్టుకున్నారు.
హైదరాబాద్ మహానగరంలో మంగళవారం ఒక్కరోజులో వెలుగు చూసిన నాలుగు అత్యాచార ఉదంతాలపై మాజీ మంత్రి హరీశ్ చేసిన వ్యాఖ్యల్ని చూసినప్పుడు విస్మయానికి గురి చేసేలా ఉంటాయి. ఎందుకుంటే.. ఈ నాలుగు అత్యాచారాలు వేర్వేరు చోట్లే..వేర్వేరు నేపథ్యాలున్న.. వేర్వేరు వ్యక్తులు చేసినవి. అది కూడా ఒకే రోజున జరగలేదు. కాకుంటే.. ఒకే రోజున బయటకు వచ్చాయి.
వనస్థలిపురంలోని ఒక హోటల్ కు చిన్ననాటి స్నేహితుడితో పార్టీకి వెళ్లిన మహిళ అత్యాచారానికి గురి కావటానికి ప్రభుత్వానికి లింకేంటి? ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో ప్రయాణించే మహిళను.. సదరు బస్సుడ్రైవర్ అత్యాచారం చేయటానికి సర్కారుకు సంబంధం ఏమిటి? అలా అని ప్రభుత్వం తప్పేమీ లేదని చెప్పలేం. తప్పు అన్నది ఎప్పుడు వస్తుందంటే.. అత్యాచార ఉదంతం బయటకు వచ్చిన తర్వాత అధికార యంత్రాంగం సరైన రీతిలో స్పందించని పక్షంలో అది ప్రభుత్వ తప్పుగా మారుతుంది. అంతేతప్పించి..ఒక రోజులో వెలుగు చూసిన నాలుగు అత్యాచారాలను పట్టుకొని ప్రభుత్వాన్ని ఇష్టారాజ్యంగా తిట్టేయటంలో అర్థం లేదని చెప్పాలి.
మరెవరో ఇలాంటి మాటలు మాట్లాడితే పోనీలో వారికి.. పాలన మీద అవగాహన లేదని సరిపెట్టుకోవచ్చు. కానీ.. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక భూమిక పోషించిన హరీశ్.. అత్యాచార ఉదంతాల్లో ప్రభుత్వం చేయగలిగిందేమిటి? ఎలా రియాక్టు కావాలన్న దానిపై పూర్తిస్థాయి అవగాహన ఉంది. అన్నీ తెలిసిన హరీశ్ లాంటి వారు సైతం ఇష్టారాజ్యంగా మాట్లాడటమే అసలుసిసలు రాజకీయంగా చెప్పాలి. అందుకే.. అత్యాచారాల ఉదంతాన్ని చూపించి ప్రభుత్వాన్ని వేలెత్తి చూపే ప్రయత్నం చేయటం హరీశ్ ఇమేజ్ నే డ్యామేజ్ చేస్తుందన్న విషయాన్ని ఆయన గుర్తిస్తే మంచిది.