అసెంబ్లీకి రాని హరీశ్.. నిరసనతో ఆగమాగం చేసుడా?
నల్లబాడ్జీ పెట్టుకున్న ఆయన.. మహిళా నేతల్ని అవమానానికి గురి చేసిన ముఖ్యమంత్రి సారీ చెప్పాలని డిమాండ్ చేశారు
By: Tupaki Desk | 1 Aug 2024 6:29 AM GMTఅవకాశం లభించాలే కానీ రేవంత్ సర్కారును అడ్డంగా బుక్ చేయటానికి ఎదురుచూస్తున్న బీఆర్ఎస్ నేతలు.. బుధవారం సభలో ముఖ్యమంత్రి.. ఉప ముఖ్యమంత్రులు చేసిన వ్యాఖ్యల్ని పట్టుకొని రాష్ట్ర వ్యాప్త నిరసన.. ఆందోళనలకు తెర తీయటం తెలిసిందే. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. అక్కల్ని నమ్ముకుంటే అన్న మాట ముఖ్యమంత్రి నోటి నుంచి వచ్చిన సమయంలో అసెంబ్లీలో లేని మాజీ మంత్రి హరీశ్ రావు సైతం.. ఈ రోజు నిరసన చేపట్టేందుకు సిద్ధమైపోయారు.
నల్లబాడ్జీ పెట్టుకున్న ఆయన.. మహిళా నేతల్ని అవమానానికి గురి చేసిన ముఖ్యమంత్రి సారీ చెప్పాలని డిమాండ్ చేశారు. తమ పార్టీకి చెందిన మహిళా నేతల్ని ముఖ్యమంత్రి మాట అన్నప్పుడు.. తాను అక్కడ లేనన్న విషయాన్ని ఆయన మర్చిపోయినట్లున్నారు. సభలో కేటీఆర్ మాట్లాడితే హరీశ్ రావు ఉండకపోవటం.. హరీశ్ రావు మాట్లాడే వేళలో కేటీఆర్ ఉండకపోవటం ఒక ఎత్తు అయితే.. విపక్ష నేత కేసీఆర్ సభకే రాకపోవటం దేనికి నిదర్శనం? అన్నది ప్రశ్న.
సాధారణంగా అధికారంలో ఉన్నప్పటి కంటే విపక్షంలో ఉన్నప్పుడు తమ పార్టీ నేతలను కలిసికట్టుగా ఉంచి.. వారిని ఒక క్రమపద్దతిలో నడిపించాల్సిన బాధ్యత పార్టీ అధినేతగా కేసీఆర్ కు ఉంది. కానీ.. ఆయన సభకు రారు. తమ పార్టీ సభ్యుల్లో ఎవరు సభకు వస్తున్నారో? రావట్లేదన్న విషయంపై లెక్క ఏమైనా తెలుసా? లేదా? అన్నది ప్రశ్నగా మారింది. హరీశ్ విషయానికి వస్తే.. ఈ రోజున నిరసన చేస్తున్న ఆయన.. కమిట్ మెంట్ తో అసెంబ్లీ సమావేశాలు జరిగిన సమయంలో సభలోనే ఉండి ఉంటే.. ముఖ్యమంత్రి నోటి నుంచి మాట వచ్చినంతనే మాట్లాడాల్సి ఉంది. నిరసన చేయాల్సి ఉంది. కానీ.. అదేమీ చేయకుండా.. మాట అన్నప్పుడు సభలో లేని హరీశ్.. ఇప్పుడు మాత్రం చాలా అన్యాయం జరిగిపోయిందన్న విషయాన్ని ఎలా చెబుతారు? అన్నది ప్రశ్నగా మారింది.
సభకు హరీశ్ రాకపోవటాన్ని ముఖ్యమంత్రి రేవంత్ సైతం తన మీడియా ఇష్టాగోష్టిలో ప్రస్తావించారు. ‘సభలో ఎవర్నీ మేం అవమానించలేదు. కించపర్చలేదు. ఒకవేళ నిజంగానే సబితకు అవమానం.. అన్యాయం జరిగిందని అనుకుంటే.. ఆవేదన చెందితే.. కేసీఆర్.. హరీశ్ రావు ఎటు పోయారు? అసెంబ్లీకి ఎందుకు డుమ్మా కొట్టారు? సభలోకి వచ్చి ఆమెకు అండగా నిలబడాలి కదా?’’ అంటూ సూటిగా వేస్తున్న ప్రశ్నల్లో అర్థముందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏమైనా.. సభకు రాకుండా.. నిరసన చేపట్టే హరీశ్ రావు కాస్తంత ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే.. ఆయనకున్న ఇమేజ్ డ్యామేజ్ అవుతుందన్న మాట వినిపిస్తోంది.