నామినేషన్ల వేళ.. సెంటిమెంట్ల జోరు మామూలుగా లేదుగా?
ఎన్నికల వేళ.. గెలుపు కోసం తమ వంతు ప్రయత్నంతో పాటు.. దైవాన్ని నమ్ముకోవటం మామూలే. ఇందుకు ముఖ్యమంత్రి సైతం మినహాయింపు కాదు.
By: Tupaki Desk | 6 Nov 2023 4:30 AM GMTమేనమామ కం ముఖ్యమంత్రి కేసీఆర్ కు మేనల్లుడిగా సుపరిచితుడు మంత్రి హరీశ్ రావు. గులాబీ పార్టీకి ఆపద్ కాలంలో చురుకుగా పని చేసే రెస్క్యూ టీం ముఖ్యుడిగా ఆయనకున్న పేరును ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిందే. కేసీఆర్ మాదిరే హరీశ్ రావుకు దైవభక్తి.. సెంటిమెంట్లు ఎక్కువ. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. భక్తి.. అధ్యాత్మికత విషయంలో సీఎం కేసీఆర్ కు ఏ మాత్రం తీసిపోని రీతిలో ఉండే హరీశ్ కు భిన్నంగా మంత్రి కేటీఆర్ తీరు ఉంటుందని చెబుతారు. ఈ కారణంగానే.. కేసీఆర్ నిర్వహించే యగాలు.. పూజల సందర్భంగా కేటీఆర్ పెద్దగా కనిపించరు. అంతేకాదు.. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే ఫుణ్యక్షేత్రాల్ని సందర్శిస్తుంటారు.
ఎన్నికల వేళ.. గెలుపు కోసం తమ వంతు ప్రయత్నంతో పాటు.. దైవాన్ని నమ్ముకోవటం మామూలే. ఇందుకు ముఖ్యమంత్రి సైతం మినహాయింపు కాదు. ముఖ్యంగా నామినేషన్ పత్రాల్ని దాఖలు చేసే వేళలో.. సెంటిమెంట్ ను తూచా తప్పకుండా పాటించే కేసీఆర్ కు తగ్గట్లే.. మేనల్లుడు హరీశ్ రావు వ్యవహరిస్తుంటారు. ఆ మాటకు వస్తే.. పలువురు నేతలు సైతం నామినేషన్ల వేళ.. తమకున్న సెంటిమెంట్ ను ఫాలో అవుతుంటారు.
ఇలాంటి సెంటిమెంట్లను ఫాలో అయ్యే నేతల ముచ్చట్లు ఆసక్తికరంగా కనిపిస్తాయి. మంత్రి హరీశ్ విషయానికి వస్తే ఆయన తన నామినేషన్ సందర్భంగా సిద్దిపేటలోని రేణుకా ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. 1985 నుంచి ఇదే సెంటిమెంట్ ను హరీశ్ ఫాలో అవుతుంటారు. ఇప్పటివరకు సిద్దిపేట నియోజకవర్గాన్ని కేసీఆర్.. హరీశ్ లు ఆరుసార్లు చొప్పున విజయం సాధించటం గమనార్హం. ముఖ్యమంత్రి కేసీఆర్ నామినేషన్ దాఖలు చేసే తొమ్మిదినే.. హరీశ్ సైతం నామినేషన్ దాఖలు చేస్తున్నారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రవేశం నాటినుంచి నామినేషన్ సందర్భంగా ఒక సెంటిమెంట్ ను ఫాలో అవుతుంటారు. తన సొంతూరు వంగూరు మండలం కొండారెడ్డి పల్లిలోని ఆంజనేయస్వామి టెంపుల్ కు వెళ్లి పూజలు నిర్వహిస్తుంటారు. అక్కడ పూజలు చేశాకే.. నామినేషన్ వేసే సెంటిమెంట్ ను తూచా తప్పకుండా ఫాలో అవుతుంటారు. ఈ రోజు (నవంబరు 6న) ఆయన కొడంగల్ లో నామినేషన్ వేయనున్నారు.
అధికార పార్టీ నుంచి దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి.. నంగునూరు మండలం కోనాయిపల్లి వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నామినేషన్లు వేస్తారు. ఈ మధ్య ప్రచారంలో కత్తిపోటుకు గురై.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కొత్త ప్రభాకర్ రెడ్డి.. ఈ నెల 9న ఆసుపత్రి నుంచి నేరుగా ఆలయానికి వెళ్లి.. అక్కడి నుంచి నామినేషన్లు దాఖలు చేయనున్నారు. దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న చెరుకు శ్రీనివాస్ రెడ్డికి నామినేషన్ సందర్భంగా తల్లి విజయలక్ష్మి నుంచి ఆశీర్వాదం తీసుకొని ఇంట్లో నుంచి బయలుదేరటం అలవాటు. అనంతరం కోనాయిపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లి పూజలు చేసి.. నామినేషన్లు దాఖలు చేస్తారు.
సిద్దిపేట నుంచి హరీశ్ మీద పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి పూజల హరిక్రిష్ణకు పట్టణంలోని రేణుకా ఎల్లమ్మ ఆలయంలో పూజలు నిర్వహించిన తర్వాతే నామినేషన్ వేస్తారు. ఆయనకు ఆ టెంపుల్ అంటే మహా గురి. తాను చేసే ఏ పనికైనా అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్న తర్వాతే మొదలుపెట్టటం కనిపిస్తుంది. మంగళవారం ఆయన నామినేషన్ వేయనున్నారు. హుస్నాబాద్ బరిలో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి సతీశ్ కుమార్ కు విచిత్రమైన సెంటిమెంట్ ఉంది. ఆయన తన మేనమామ వేముగంటి భాస్కర్ రావుతో నామినేషన పత్రం మీద ప్రపోజ్ చేసే వారిగా తొలి సంతకం చేయించటం సెంటిమెంట్. ఆ తర్వాత సొంతూరులోని వేంకటేశ్వరస్వామికి.. తర్వాత హుస్నాబాద్ రేణుకా ఎల్లమ్మ టెంపుల్ లో పూజలు నిర్వహిస్తుంటారు. ఈ నెల 8న నామినేషన్ దాఖలు చేయనున్నారు.
హుస్నాబాద్ బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి కం మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కు నామినేషన్ సందర్బంగా తల్లి నుంచి ఆశీర్వాదం తీసుకోవటం సెంటిమెంట్. ఆ తర్వాత స్థానిక రేణుకా ఎల్లమ్మ టెంపుల్ లో పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత పొట్లపల్లిలోని భూ రాజేశ్వరాలయం.. సుందరగిరి వేంకటేశ్వర టెంపుల్ ను సందర్శించిన తర్వాతే నామినేషన్ దాఖలు చేస్తారు. గడిచిన మూడు ఎన్నికల్లోనూ ఇదే సెంటిమెంట్ ను ఫాలో కావటం గమనార్హం. దుబ్బాక బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న రఘునందన్ రావుకు స్థానిక మారెమ్మ టెంపుల్ లో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాతే నామినేషన్ దాఖలు చేస్తుంటారు. ఈ నెల ఎడెనిమిది తారీఖుల్లో ఆయన రెండు సార్లు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. గత ఎన్నికల్లోనూ ఆయన ఇదే సెంటిమెంట్ ను ఫాలో అవుతుంటారు. ఇలా నేతలు ఎవరైనా సరే.. నామినేషన్ వేళ ఏదో ఒక సెంటిమెంట్ ను పక్కాగా ఫాలో కావటం కనిపిస్తోంది.