రేవంత్, హరీశ్ బస్తీ మే సవాల్.. నెగ్గిందెవరంటే!
ఈ నేపథ్యంలో రైతు రుణమాఫీ ఖచ్చితంగా చేస్తామని హరీశ్ రావు తన రాజీనామా లేఖను సిద్ధంగా పెట్టుకోవాలని రేవంత్ సవాల్ విసిరారు.
By: Tupaki Desk | 26 April 2024 10:38 AM GMTవేసవి హీట్ కు తోడు తెలంగాణ రాజకీయ వేడెక్కింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లలతో ఈ హీట్ తారాస్థాయికి చేరింది.
తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల ముందు దొంగ హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని.. ప్రభుత్వం హామీ ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయడం లేదంటూ బీఆర్‌ఎస్ నేతల విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా రైతు రుణమాఫీ అంశం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది.
పంద్రాగస్టు నాటికి తెలంగాణలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని.. యాదగిరీశుడి సాక్షిగా చెబుతున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దేవుళ్ల మీద ప్రమాణం చేయడం కాదని.. తన భార్య బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పాలంటూ బీఆర్‌ఎస్ నేతలు ముఖ్యమంత్రిపై మండిపడ్డారు.
ఈ నేపథ్యంలో రైతు రుణమాఫీ ఖచ్చితంగా చేస్తామని హరీశ్ రావు తన రాజీనామా లేఖను సిద్ధంగా పెట్టుకోవాలని రేవంత్ సవాల్ విసిరారు. ఈ సవాల్ కు ప్రతిస్పందించిన హరీశ్ రావు సికింద్రాబాద్ లోని గన్ పార్కుకు చేరుకుని అమరవీరుల స్థూపం వద్ద తన రాజీనామా లేఖ అంటూ ఒకదాన్ని చూపారు. అయితే అది స్పీకర్ ఫార్మాట్ లో లేకపోవడం గమనార్హం. అయినప్పటికీ తన రాజీనామా లేఖను మేధావుల చేతుల్లో పెడతున్నానని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తన రాజీనామా లేఖను ఇవ్వాలని, ఆయనకు రావడానికి మొహమాటమైతే తన పీఏతోనైనా పంపించాలని హరీశ్ రావు సవాల్ విసిరారు.
ఆగస్టు 15లోగా ఏకకాలంలో రుణ మాఫీ చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మోసం చేసిందని ఆరోపించారు. రైతుల కోసం తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. సోనియా గాంధీ పేరుతో రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు.
హరీశ్ రావు సవాల్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీటుగా స్పందించారు. హరీశ్ రావు సవాల్ ను స్వీకరిస్తున్నానని తెలిపారు. పంద్రాగస్టులోగా రూ.2లక్షల రైతు రుణమాఫీ చేసి తీరతానని తేల్చిచెప్పారు. హరీశ్ రావు తన రాజీనామాను రెడీగా ఉంచుకోవాలని సవాల్ విసిరారు.
మోసం చేయాలనుకునే ప్రతీ సారి హరీశ్ రావుకు అమరవీరుల స్థూపం గుర్తొస్తది అని «ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్నన్నాళ్లు ఒక్కసారి కూడా అమరవీరుల స్థూపం సంగతే హరీశ్ కు గుర్తు లేదని ఎద్దేవా చేశారు. హరీశ్ మోసానికి ముసుగు అమరవీరుల స్థూపమని మండిపడ్డారు. చాంతాడంత లేఖ రాసుకొచ్చి రాజీనామా లేఖ అంటున్నారని ఎద్దేవా చేశారు. రాజీనామా లేఖ అలా ఉంటుందా అని నిలదీశారు. హరీష్ తన మామ చెప్పిన సీస పద్యమంతా లేఖలో రాసుకొచ్చారు అని రేవంత్ సైటెర్లు వేశారు.
స్పీకర్ ఫార్మాట్ లో లేకుంటే రాజీనామా లేఖ చెల్లదని హరీశ్ తెలివితేటలు ప్రదర్శిస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. హరీశ్ రావు తెలివి మోకాళ్లలో కాదు.. అరికాళ్లలోకి జారినట్టుందని ఎద్దేవా చేశారు.
మరోవైపు కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం హరీశ్ పై ధ్వజమెత్తారు. తెలంగాణకు దళిత ముఖ్యమంత్రిని చేస్తానని కేసీఆర్ అన్నారని.. అలా చేయలేకపోతే తన మెడకాయపై తలకాయ ఉండదన్నారని గుర్తు చేశారు. ముందు హరీశ్ రావు .. కేసీఆర్ తలకాయ తెచ్చుకోవాలని ఎద్దేవా చేశారు. లేదంటే తలకాయ మమ్మల్నో, దళితులనో తీయమంటావా అని నిలదీశారు. ఇప్పటికే తమ ప్రభుత్వం ఐదు గ్యారెంటీలు అమలు చేసిందని గుర్తు చేశారు.
కాగా హరీశ్ రాజీనామా డ్రామా విఫలమైందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దాదాపు తొమ్మిదిన్నరేళ్లు అధికారంలో ఉండి ఏనాడు అమరవీరుల స్థూపం వద్దకు రాని హరీశ్ రావుకు ఇప్పుడు అదొకటి ఉందని గుర్తొచ్చిందా అని నిలదీస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల ముందు హామీలు ఇచ్చినట్టే ఐదు గ్యారెంటీలను ఇప్పటికే అమలు చేస్తోందని గుర్తు చేస్తున్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని గుల్ల గుల్ల చేయకుండా ఉంటే రూ.40 వేల కోట్లు ఇవ్వడానికి తమకు ఇబ్బందే కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెబుతున్నారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, కాళేశ్వరం ప్రాజెక్టు, దాని అనుబంధ బ్యారేజీల్లో బయటపడుతున్న అవకతవకలు, అవినీతిని పక్కదారి పట్టించడానికే హరీశ్ రావు రాజీనామా డ్రామాలు ఆడుతున్నారని అంటున్నారు. రాజీనామా లేఖ అంటూ హరీశ్ రావు తెచ్చింది స్పీకర్ ఫార్మాట్ లో లేదని, ఏదో పేపర్ మీద రాసినట్టు ఉందని చెబుతున్నారు.
తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ అని అంతా చెబుతున్నారు. బీఆర్‌ఎస్ ఒక్క స్థానంలోనూ గెలుచుకునే అవకాశాలు లేవని ఇప్పటికే పలు సర్వేలు తేల్చిచెప్పాయి. దీంతో కాస్తో కూస్తో ఉనికి చాటుకోవడానికే హరీశ్ రావు రాజీనామా పేరుతో అసందర్భ సవాళ్లు విసురుతున్నారని సెటైర్లు పడుతున్నాయి.
దళిత బంధు, డబుల్ బెడ్రూమ్ లంటూ డ్రామాలు ఆడి.. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్‌ఎస్ శ్రేణులకే వాటిని కట్టబెట్టుకున్నారని అంటున్నారు. అందువల్లే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ చిత్తయిందని గుర్తు చేస్తున్నారు. స్వయంగా కేసీఆర్ కే ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టినా ఇంకా బుద్ధి రాలేదని.. తండ్రీ కొడుకు కేసీఆర్, కేటీఆర్ సైలెంటుగా ఉండి హరీశ్ ను ఎగదోస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.