అందరి లెక్కలు చెప్పే హరీశ్.. మేనమామ లాగేసిన మాటేంది?
అప్పటివరకు తాము చేసిన తప్పుల్ని కవర్ చేయటం.. దాని ప్రస్తావనే చర్చల్లోకి రాకుండా చేసే టాలెంట్ వారికి టన్నుల కొద్దీ ఉంటోందన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 18 July 2024 4:53 AM GMTనోరు తెరిస్తే నీతులు మాట్లాడే టాలెంట్ గులాబీ నేతలకు మామూలే. అందునా ఒక హరీశ్.. కేటీఆర్.. కవితల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాటల విషయంలో వారి తర్వాతే ఎవరైనా.. పరిస్థితి ఏదైనా తమకు తగ్గట్లు వాదనలు వినిపించటం వారికి వెన్నతో పెట్టిన విద్య. అప్పటివరకు తాము చేసిన తప్పుల్ని కవర్ చేయటం.. దాని ప్రస్తావనే చర్చల్లోకి రాకుండా చేసే టాలెంట్ వారికి టన్నుల కొద్దీ ఉంటోందన్న సంగతి తెలిసిందే.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన షాక్ నుంచి తేరుకునే లోపే.. రేవంత్ సీఎం కావటం.. అంతలోనే ఎంపీ ఎన్నికలు వెలువడటం తెలిసిందే. వరుస పెట్టి సాగిన ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్ దయనీయమైన పరిస్థితులు ఎదురయ్యాయి. ఇతర పార్టీల నుంచి వచ్చే ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలను ఖరారు చేయటం.. వారికి పార్టీ కండువా కప్పటం లాంటివి రోటీన్ గా సాగేవి. ఒకటితర్వాత ఒకటి చొప్పున రాజకీయ పార్టీలను తనలో విలీనం చేసుకున్న చరిత్రను తెలంగాణ ప్రజలు మరెప్పటికి మర్చిపోరు.
ఇన్ని చేసినప్పటికి.. తాము రేవంత్ ప్రభుత్వాన్ని కూలదోస్తామని ఓపెన్ గా వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది ఆసక్తికరమని చెప్పాలి. తాజాగా రేవంత్ సర్కారు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీలో చర్చుకునే ప్రోగ్రాంను ఉద్యమ తరహాలో తీసుకెళుతున్నారు. ఇలాంటి వేళ రేవంత్ సర్కరు దూకుడుకు పగ్గాలు వేసినట్లుగా శాపనార్థాలతో కూడిన వ్యాఖ్యలు చేయటం కేసీఆర్ పరివారానికి ఒక అలవాటుగా మారిందని చెప్పాలి. దీనికి తాజాగా హరీశ్ రావు నోట నుంచి వచ్చిన వ్యాఖ్యలే నిదర్శనం.
పార్టీలు మారిన ఎమ్మెల్యేలు మాజీలు అయ్యే వరకు నిద్రపోమన్న హరీశ్.. పార్టీ మారిన ఎమ్మెల్యేల అంశంపై సుప్రీంకోర్టులో పోరాడుతున్నామన్నారు. ఆ నియోజకవర్గాల్లో కచ్ఛితంగా ఉప ఎన్నికల ఖాయమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తమ పార్టీకి చరెందిన పన్నెండు మంది ఎమ్మల్యేలను దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు చేర్చుకున్నారని.. కానీ కుట్రలు ఫలించలేదన్నారు.
బీఆర్ఎస్ పని అయిపోయిందంటూ కొందరు వ్యాఖ్యలు చేశారని.. అలాంటి వారంతా కనిపించకుండా పోయారంటూ హరీశ్ వ్యాఖ్యానించారు. ‘‘పటాన్ చెర్వుకు ఏం కావాలంటే అదిచ్చాం. నిధుల వరద పారించాం. గూడెం మహిపాల్ రెడ్డి పోయినా గుండె ధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదు పార్టీ మారితే రాళ్లతో కొట్టండన్న రేవంత్ ఇప్పుడు వెళ్లి కండువాలు కప్పుతున్నారు’’ అని వ్యాఖ్యానించారు.
ఇన్ని మాటలు చెప్పిన హరీశ్ రావు.. పదేళ్ల కేసీఆర్ పాలనలో ఏం జరిగింది? నాడు పార్టీల్ని చీల్చేయటం.. ఇతర పార్టీల ఎమ్మెల్యేల్ని గులాబీ కారు ఎక్కించిన వైనాన్ని ఎవరూ మరచిపోలేరు. అలాంటప్పుడు తాము అధికారంలో ఉన్నప్పుడు చేయాల్సినన్ని చేసిన గులాబీ దండు.. ఈ రోజు గుండెలు బాదుకోవటం గమనార్హం. అందరూ తమ పార్టీల్లోని ఎమ్మెల్యేల్ని లాగేసుకున్న లెక్కల్ని చెప్పిన హరీశ్ రావు.. తన మేనమామ కేసీఆర్ లాగేసిన లెక్కల గురించి కూడా మాట్లాడితే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమైంది.